చరిత్రగా మిగిలిపోనున్న వరంగల్‌ జైలు | K Venkataramana Article On Warangal Jail | Sakshi
Sakshi News home page

చరిత్రగా మిగిలిపోనున్న వరంగల్‌ జైలు

Published Thu, Jun 10 2021 1:54 PM | Last Updated on Thu, Jun 10 2021 2:01 PM

K Venkataramana Article On Warangal Jail - Sakshi

వరంగల్‌ సెంట్రల్‌ జైలు... ఇది మొత్తం భారతదేశంలోనే అత్యాధునిక ప్రమాణాలతో నిర్మించిన  కారాగారం.  6వ నిజాం మీర్‌ మహబూబ్‌ అలీఖాన్‌ హయాంలో నిర్మిం చిన ఈ కారాగారానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి.  ప్రస్తుతం మనం దేశంలోనే అత్యంత పటిష్టమైనదిగా చెప్పుకుంటున్న తీహార్‌ జైలు నుండి కూడా ఎన్నోసార్లు ఖైదీలు తప్పించుకొని వెళ్లారు. కానీ 135 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన వరంగల్‌ జైలు నుండి ఇప్పటివరకూ ఒక్క ఖైదీ కూడా తప్పించుకొని పోలే దంటే, ఈ జైలు నిర్మాణం ఏవిధంగా ఉందో ఊహిం చొచ్చు. ఈ జైలులో నేసిన తివాచీలు ప్రపంచ ప్రఖ్యా తిని గాంచాయి. నక్సలైట్‌ అగ్రనేతలైన∙కానూ సన్యాల్‌తోపాటు కాళోజి, దాశరథి, వీవీ, ప్రస్తుత మావోయిస్టు అగ్రనేత గణపతి లాంటి ఎందరో ఈ జైలు జీవితం గడపిన వారే. 

కాకతీయ సామ్రాజ్యంగా ఓరుగల్లుకు ఎంత చరిత్ర ఉందో, జైళ్ల రంగంలో దేశంలోనే వరంగల్‌ కేంద్ర కారాగారానికి అంత పేరుంది. భారత్‌ను సందర్శించడానికి వచ్చిన అనేక మంది విదేశీ చరిత్ర కారులు తమ గ్రంథాల్లో ఈ కారాగారం గురించి రాయడం విశేషం. 19వ శతాబ్దం అంతం వరకు జైళ్ల పరిస్థితి దయనీయంగా ఉండేది. నేరస్తులు, నేరా రోపణ ఎదుర్కొంటున్న వారిని గోదాముల లాంటి గదుల్లో ధించేవారు. సరైన మరుగుదొడ్లు, నీటి సదుపాయాలు ఉండేవి కావు. అయితే 1880లో నిజాం ప్రభుత్వంలో హన్కిన్‌ అనే అధికారి జైళ్ల శాఖ అధిపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నిజాం రాష్ట్రంలో జైళ్ల నిర్వహణలో గణనీయమైన మార్పులొ చ్చాయి. అందులో భాగంగానే, 1885లో వరంగల్‌ సెంట్రల్‌ జైలు నిర్మాణం జరిగింది. 15 ఏళ్ల క్రితం వరకు నాటి కట్టడ ప్రతిరూపంగా ఉన్న జైలు ముఖ ద్వారం స్థానంలో కొత్త ప్రవేశ ద్వార నిర్మాణం జరి గినా లోపల మాత్రం గత నిర్మాణాలు యధాతథంగా కన్పిస్తాయి. నాటి నుండి నేటి వరకు కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థతో పాటు పరిశుభ్రత, ఖైదీల్లో పరి వర్తనకు మారుపేరుగా నిలిచిందీ కారాగారం. జైళ్లను ఉత్తమ ప్రమాణాలు కలిగిన పరివర్తనాలయాలుగా మార్చినందుకు హన్కిన్స్‌కు నిజాం ప్రభుత్వం 1913లో ప్రత్యేక పురస్కారం అందచేసింది.

వరంగల్‌ జైలు కమ్యూనిస్టు తీవ్రవాదులను ఉంచే ప్రధాన కారాగారంగా పేరొందింది. అయితే, ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే, 2010 వరకు మావోయిస్టు, జనశక్తి పార్టీ వాళ్లకు ప్రత్యేక బ్యారక్‌లను కేటాయిం చేవారట. వారి కిచెన్‌లను వారే నిర్వహిం చుకునే వారట. ఖైదీలు కోర్టుకు వెళ్లకుండా ఇక్కడి నుండి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణ జరిపే సౌక ర్యాన్ని కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ జైలులో ఐ.ఎస్‌.ఐ. లాంటి వాటికి చెందిన కరుడు గట్టిన ఉగ్ర వాద ఖైదీలను ఉంచుతున్నారు.        
  
13 హెక్టార్ల విస్తీర్ణంలో నిర్మించిన ఈ సెంట్రల్‌ జైలులో 700 మంది ఖైదీలను ఉంచడానికి అవకాశ ముండగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గుంటూరు,  కృష్ణా జిల్లాల అండర్‌ ట్రయల్స్, నేరస్థులను కూడా ఇక్కడ ఉంచేవారు. విచారణ ఎదుర్కొనే అండర్‌ ట్రయల్స్‌కు ఇక్కడ ప్రత్యేక లాకప్‌ ఉండడం దానికి ఒక కారణం. ఈ జైలు నిర్వహణ అంతా ఇక్కడి సూపరింటెండెంట్‌ నేతృత్వంలో జరుగుతుంది. ఖైదీలకు వైద్య సదుపా యాలు అందించడానికి ప్రత్యేక డిస్పెన్సరీ, విద్యావ కాశాలకుగానూ ఓపెన్‌ యూనివర్సిటీ స్టడీ సెంటర్‌ కూడా ఉంది. ఇక్కడ శిక్ష అనుభవిస్తూనే అనేక మంది ఖైదీలు పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులను పూర్తిచేశారు. దీనిలో బాస్కెట్‌బాల్, వాలీబాల్‌ తదితర క్రీడా సౌక ర్యాలున్నాయి. గతంలో ఈ జైలులోని ఖైదీలు, అండర్‌ ట్రయల్స్‌ రాసే రచనలు, కవితలు, కథలతో సుధార్‌ అనే ఇంటర్నల్‌ మ్యాగజైన్‌ కూడా వెలువరించేవారు. పలు వ్యాధులతో బాధపడే ఖైదీలను ఐసోలేషన్‌లో ఉంచడానికి ప్రత్యేక గదులున్నాయి.

1942లో గాంధీజీ క్విట్‌ ఇండియా ఉద్యమం పిలుపునివ్వడంతో అందులో పాల్గొన్నందుకుగానూ కాళోజి, ఎం.ఎస్‌. రాజలింగం, కోమండూరి నారా యణరావు ఈ జైలుకు వెళ్లారు. 1948 జనవరి 11వ తేదీన రజాకార్లు జైలులోకి ప్రవేశించడానికి దాడి చేశారు. అయితే, నిజాయితీపరుడైన జైలు సూపరిం టెండెంట్‌ రజాకార్లను గేటు వద్దనే అడ్డుకున్నాడు. ఇదే రోజు సత్యాగ్రహాలు చేసిన వారిని నిర్బంధించిన గుల్బర్గా, నిజామాబాద్‌ జైళ్ల మీదా కూడా రజాకార్లు దాడి చేశారు. ఇందులో నిజామాబాద్‌ జైలులో దాశ ర«థి కృష్ణమాచార్యులు, వట్టికోట ఆళ్వార్‌స్వామితో పాటు 150 మంది తీవ్రంగా గాయపడ్డారు. 

ఇక్కడ నేసిన ఊలు కార్పెట్లు, దుప్పట్లు, బట్టలు, తయారుచేసిన సబ్బులు, ఫర్నీచర్, ప్రింటింగ్‌ తదితర ఉత్పత్తులను ప్రజలు ఆసక్తిగా కొనుగోలు చేస్తారు. వీటి అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఖైదీల సంక్షేమం కోసం వినియోగిస్తారు. ఈ జైలు పరిధిలో ఉన్న 15 ఎకరాల వ్యవసాయ భూమిలో కూర గాయలు, మొక్కజొన్న, మామిడి చెట్లతో పాటుగా అనేక పూల మొక్కలను నేటికీ పెంచుతున్నారు. ఈ జైలు ఖైదీల ద్వారా పెట్రోల్‌ పంపులను కూడా నిర్వ హిస్తున్నారు. ఇంతటి గొప్ప చరిత్ర కలిగిన వరంగల్‌ సెంట్రల్‌ జైలు ఇకనుండి చరిత్రగానే మిగిలిపోనుంది. ఇప్పటికే 75 శాతం ఖైదీలను ఇతర జిల్లాల్లో జైళ్లకు తరలించారు. మరి కొద్దిరోజుల్లో ఈ జైలు నేలమట్టం కానుంది. దీన్ని ధర్మసాగర్‌ సమీపంలో నిర్మించాలని ప్రభుత్వం ప్రకటించింది. ఈ జైలు స్థలంలో అత్యాధు నిక ప్రమాణాలతో చిన్నపిల్లల ఆసుపత్రిని నిర్మించ డంపై వరంగల్‌ వాసులు సంతృప్తి చెందుతున్నారు.


 

వ్యాసకర్త పూర్వ డీపీఆర్‌వో, వరంగల్‌ మొబైల్‌ : 98499 05900 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement