గెలిచినా, ఓడినా చరిత్రే! | Kamala Harris in the presidential race | Sakshi
Sakshi News home page

గెలిచినా, ఓడినా చరిత్రే!

Published Thu, Aug 1 2024 4:32 AM | Last Updated on Thu, Aug 1 2024 4:32 AM

Kamala Harris in the presidential race

భారతీయ బ్రాహ్మణ మూలాలున్న కమలాదేవి హ్యారిస్‌కు అమెరికాలో జరిగింది ఒక సామాజిక అద్భుతం అని చెప్పాలి. తండ్రి వైపు నుంచే కాకుండా, తల్లి పోరాటాల రీత్యా కూడా ఆమె నల్లజాతి వారసత్వాన్ని ఎంచుకున్నారు. యవ్వనంలోనూ, ఆ తర్వాతా తెల్లజాతి జాత్యహంకార భావాలకు వ్యతిరేకంగా పోరాడారు. ఆ దేశానికి తొలి నల్లజాతి మహిళా ఉపాధ్యక్షురాలిగా ఇప్పటికే చరిత్ర సృష్టించారు. ఇది కొన్ని దశాబ్దాల క్రితం ఊహించ డానికి కూడా వీలు లేని సామాజిక దృగ్విషయం. ఇప్పుడు డెమోక్రాటిక్‌ పార్టీ అభ్యర్థిగా శ్వేతజాతీయ వాదులతోనూ, మహిళా వ్యతిరేకి అయిన ట్రంప్‌ తోనూ ఆమె పోరాడుతారు. గెలిచినా ఓడినా ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది మహిళలకు రోల్‌ మోడల్‌గా నిలుస్తారు.

‘నేను హిందువునెట్లయిత?’ అని 1996లో నేను రాసిన పుస్తకంలో, బ్రాహ్మణుడు తనను తాను దళితుడిగా మార్చుకున్నప్పుడే భారతదేశం మార్పు చెందుతుందని చెప్పాను. అలాంటిది జరుగుతుందని ఊహించలేమని కొంత మంది భారతీయ చరిత్ర, సంస్కృతి పండితులు విమర్శించారు.సంస్కృతీకరణ ప్రక్రియలో భాగంగా బ్రాహ్మణుల అన్ని జీవన విధా నాలను శూద్రులు, దళితులు అవలంబిస్తారనేది వారి వాదన. మరాఠాలు ఓబీసీ రిజర్వేషన్‌ పొందడానికి ‘కున్బీ’ సర్టిఫికెట్‌ అడగటం గురించి గానీ, చాలామంది శూద్ర ఓబీసీలు రిజర్వేషన్‌ కోటా కోసం ఆదివాసీ లేదా దళిత హోదా అడగటం గురించి గానీ వారు ఏం చెబుతారో నాకు తెలీదు. ఉత్తర భారత బనియాలు ఓబీసీ సర్టిఫికెట్లను తీసుకుంటూ రిజర్వేషన్‌ పొందడం గురించి వాళ్లేమంటారు? దీన్నిసంస్కృతీకరణ అనవచ్చా? నా దృష్టిలో అది దళితీకరణే కానీ సంస్కృతీకరణ కాదు. ఈ రోజుల్లో ఏ కులమైనా బ్రాహ్మణ సర్టిఫికెట్‌ కోసం అడగడం లేదు. భారతదేశంలో ఇలా జరుగుతుండగా, పాశ్చాత్య దేశా లలోని వలస భారతీయుల్లో ఏం జరుగుతోంది? 

భారతీయ బ్రాహ్మణ మూలాలున్న కమలాదేవి హ్యారిస్‌కు అమెరి కాలో జరిగింది ఒక సామాజిక అద్భుతం అని చెప్పాలి. ఆమె ఆఫ్రికన్‌–అమెరికన్‌ హోదాను పొందింది తన నల్లజాతి తండ్రి కారణంగానే కాదు... ఆమె తల్లి శ్యామల గోపాలన్‌ హ్యారిస్‌ తమిళ బ్రాహ్మణ వలసదారు. నల్లజాతి స్త్రీలా కనిపించేవారు. పైగా వివాహా నికి ముందు తన జీవితంలో ఎక్కువ భాగం యూసీ బర్కిలీ ప్రాంతంలోని నల్లజాతి పరిసరాల్లో జీవించారు. మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ జూని యర్‌ సాగించిన పౌర హక్కుల ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. డొనాల్డ్‌ హ్యారిస్‌తో ఆమె వివాహం జరిగిన తర్వాత కలిగిన ఇద్దరు కుమార్తెలు కమల, మాయ నల్లజాతీయుల పరిసరాల్లోనే పెరిగారు. వారు తమ ప్రారంభ జీవితంలో నల్లజాతి ఆధిపత్య పాఠశాలలో చదువుకున్నారు. ఆమె భర్త డొనాల్డ్‌ హ్యారిస్‌ జమైకన్‌ అమెరికన్‌ ఆర్థికవేత్త. శ్యామలకు విడాకులు ఇచ్చిన తర్వాత ఇప్పుడు జమైకాలో నివసిస్తున్న ఆయన కూడా నవ్యభావాలు కలిగిన వ్యక్తి. ఏమైనప్పటికీ, కమల తన తల్లి వైపు పూర్వీకుల బ్రాహ్మణ గోధుమవర్ణ సంప్రదాయ వారసత్వాన్ని ప్రకటించుకోవచ్చు. లేదా తల్లి, తండ్రి మాదిరిగా నల్ల వారి జీవితాలూ విలువైనవే భావనతో కూడిన క్రైస్తవీకరణ ప్రక్రియను అనుసరించవచ్చు. ఆమె నల్లజాతి వారసత్వాన్ని ఎంచుకున్నారు. తన యవ్వనంలోనూ, ఆ తర్వాతా తెల్లజాతి జాత్యహంకార భావాలకు వ్యతిరేకంగా పోరాడారు.

ఆ దేశానికి తొలి నల్లజాతి మహిళా ఉపాధ్యక్షురాలిగా కమల ఇప్పటికే చరిత్ర సృష్టించారు. ఇది కొన్ని దశాబ్దాల క్రితం ఊహించ డానికి కూడా వీలు లేని సామాజిక దృగ్విషయం. ఆఫ్రికనీకరణచెందిన నల్ల–గోధుమ బ్రాహ్మణ మహిళ అయిన కమలా హ్యారిస్, డెమోక్రటిక్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా శ్వేతజాతీయ వాదులతోనూ, మహిళా వ్యతిరేకి అయిన ట్రంప్‌తోనూ పోరాడుతారు. ఎన్నికల్లో గెలిస్తే అమెరికాకు తొలి మహిళా అధ్యక్షురాలు, తొలి నల్లజాతి మహిళా అధ్యక్షురాలు అవుతారు. 

250 ఏళ్ల ప్రజాస్వామ్య చరిత్రలో అధ్యక్షురాలిగా వైట్‌హౌజ్‌లో ప్రవేశించడానికి శ్వేతజాతి లేదా నల్లజాతి మహిళను అమెరికా ఎప్పుడూ అనుమతించలేదు. వైట్‌హౌజ్‌లో నివసించిన మహిళలందరూ వారి అధ్యక్ష భర్తలకు సహాయక పాత్రను పోషించే ప్రథమ మహిళలు (ఫస్ట్‌ లేడీస్‌)గా ఉండేవారు. కమల గెలిస్తే తన భర్తను ప్రథమ పురుషుడి (ఫస్ట్‌ మ్యాన్‌)గా మార్చిన మహిళ అవుతారు. ఇకపై ఆయన భూమిపై ఉన్న తన అత్యంత శక్తిమంతమైన భార్యామణిని జాగ్రత్తగా చూసుకోవాలి.

బరాక్‌ ఒబామా మొట్టమొదటి అమెరికన్‌ నల్లజాతి పురుష అధ్యక్షుడిగా ఎంపికైనప్పుడు, శ్వేతజాతి ఆధిపత్యవాదులు మినహా  అందరూ ఆ విజయాన్ని పండుగలా జరుపుకొన్నారు. పైగా ఆయన ఎనిమిదేళ్లు విజయవంతమైన అధ్యక్షుడిగా నిరూపించుకున్నారు. అయినా అది అమెరికా ప్రాథమిక పితృస్వామ్య స్వభావాన్ని మార్చ లేదు.

మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, చాలామంది భార తీయ సంతతికి చెందిన పురుషులు, మహిళలు పాశ్చాత్య దేశాలలో అధికారాన్ని చేజిక్కించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. రిషి సునాక్‌ ఇప్పటికే తనను తాను హిందువునని పదేపదే ప్రకటించుకుంటూ ఏడాదికి పైగా ప్రధానిగా బ్రిటన్‌ను పాలించారు. అయితే, కమల మత విశ్వాసం రీత్యా క్రైస్తవురాలు. ఆమె క్రిస్టియన్‌ కాకపోతే ఉపాధ్యక్ష పదవి వచ్చేది కాదు, అధ్యక్ష అభ్యర్థిగా అవకాశం కూడా వచ్చేది కాదు. హిందువుగా ఉంటూ వైట్‌హౌజ్‌లోకి వెళ్లాలనుకునేవారు కొందరు న్నారు. భారతీయ మూలాలకు చెందిన శాకాహార బ్రాహ్మణుడైన వివేక్‌ రామస్వామి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారుగానీ విఫలమ య్యారు. కమలను ‘పిల్లలు లేని పిల్లి’ అని పిలిచిన రిపబ్లికన్ల ఉపా ధ్యక్ష అభ్యర్థి జేడీ వా¯Œ ్స భార్య ఉషా చిలుకూరి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బ్రాహ్మణ మూలాలున్న మహిళ. ఆమె తన హిందూ శాకాహార సాంస్కృతిక విలువను బహిరంగంగా ప్రకటించుకున్నారు.

విగ్రహాలను పూజించే సునాక్‌ను ప్రధానిగా అనుమతించిన బ్రిటన్‌లా కాకుండా, భారతదేశ ప్రధానిగా మరే విదేశీ వ్యక్తినీ అనుమ తించకూడదనే ఆరెస్సెస్‌/బీజేపీ నమూనాను అమెరికా కూడా అనుస రించవచ్చు. ఇతర మతవిశ్వాసం గల మరే వ్యక్తినీ అధ్యక్షుడిగా అమె రికా అనుమతించకపోవచ్చు. ఏదేమైనా, కమల వారి ఆధ్యాత్మిక భావాలకు సరిపోతారు.

కమల తన ఆఫ్రికన్‌–అమెరికన్‌ ముద్రతో దేశాధ్యక్షురాలైతే, నల్లజాతి అమెరికన్లతో అంతగా సంబంధం లేని భారతీయ ప్రవా సులు విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటారు. సంపన్న భారతీ యులు, ముఖ్యంగా మితవాద హిందూ భారతీయులు... ట్రంప్‌ దాత లుగా, ట్రంప్‌ ఓటర్లుగా ఉంటున్నారు. ట్రంప్‌ 2020లో మోదీ బల పరిచిన అభ్యర్థి. బహుశా ఇప్పటికీ ఆరెస్సెస్‌/బీజేపీ పంథా అదే కావచ్చు. వారు డెమోక్రటిక్‌ పార్టీని వామపక్ష ఉదారవాద పార్టీగా చూస్తారు. ఉపాధ్యక్షురాలిగా తన అధికారిక హోదాలో కమల భారత్‌ను సందర్శించలేదు. 

నలుపు, గోధుమరంగు స్త్రీ–పురుష సంబంధాలను నివారించ డానికీ, తెల్లవారితో కలిసి జీవించడానికీ భారతీయ అమెరికన్లు ప్రయత్నిస్తారు. శ్యామలా గోపాలన్, కమలాదేవిలా కాకుండా, వారు శ్వేతజాతీయుల పరిసరాల్లో లేదా వారి సొంత భారతీయ (దక్షిణా సియా కూడా కాదు) పరిసరాల్లో ఉంటూ, స్వచ్ఛమైన శాకాహార పార్టీలతో జీవించడానికి ఇష్టపడతారు. అలాంటి పార్టీలలో మగవాళ్లు సూట్లు ధరిస్తారు, మహిళలు భారతీయ నారీమణుల్లాగా చీరలు కట్టు కుంటారు. కమలా హ్యారిస్‌ మాత్రం అమెరికన్‌ వ్యక్తిలా చక్కగా డిజైన్‌ చేసిన ఫుల్‌ సూట్లో కనిపిస్తారు. ఆమె దుస్తుల కోడ్‌ ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శిస్తూ, పురుషునిలాగా ఎలా ఉండాలని అమెరికన్‌ స్త్రీలు కూడా ఆమె నుండి నేర్చుకునేలా ఉంటుంది. అన్నిటికంటే మించి ఆమె జీవన శైలి సమానత్వంతో కూడుకున్నది.

కమలా హ్యారిస్‌ అధ్యక్ష రేసులో గెలిచినా, ఓడినా మార్పు దోహద కారులలో ఒకరిగా మారారు. భారతీయ సంతతికి చెందిన మహిళగా ఆమె ఆఫ్రికనీకరణ, మార్పు దోహదకారి పాత్రను నేను ఎంతగానో ఆరాధిస్తున్నాను. ఆమె భవిష్యత్తులోనూ శతాబ్దాల పాటు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది మహిళలకు రోల్‌ మోడల్‌గా ఉంటారు. ఆమె గెలిచి తన భర్తను వైట్‌హౌజ్‌లో ప్ర«థమ పురుషుడి (ఫస్ట్‌ మ్యాన్‌)గా చేస్తారని ఆశిస్తున్నాను.

-వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త  
- ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement