అమరావతి రాజధాని పేరుతో పెద్ద భూబాగోతానికి తెరలేచింది. రాజధాని వస్తున్నదంటే భూముల ధరలు పెరుగుతాయని ఆశించినవాళ్లు ఎందరో ఉండొచ్చు. కానీ వాళ్లకు ఎవరికీ లాభం కలిగే అవకాశం లేకుండా, తర్వాత అమ్మడంలో ఇబ్బందులు అవుతాయని సందేహాలు రేపో, భయపెట్టో తెలుగుదేశం వర్గీయులు ఆ భూముల్ని అయినకాడికి కొనుగోలు చేశారు. దళితులకు కేటాయించిన అసైన్డ్ భూములను సైతం వాళ్లు వదలలేదు. అట్లా అమ్మకానికి వీలు లేదని చట్టాలు చెబుతున్నా, అధికారంలో ఉన్న టీడీపీ అలాంటివారికి చుట్టంగా మారి తదనుగుణమైన జీవోలు జారీచేసింది. ఇక ఇవి కూడా నిరూపణ జరగకపోతే అర్థం అది వ్యవస్థల వైఫల్యమా, స్కాములు చేసినవారి నేర్పరితనమా?
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి గ్రామాలలో అసైన్డ్ భూముల కుంభకోణం జరిగిందన్నది పచ్చి నిజం. గత ప్రభుత్వ హయాంలో దళితులనుంచి అసైన్డ్ భూములను వారికి కొంత ధర చెల్లించో, భయపెట్టో, లేక రకరకాల సందేహాలు రేపి దళితేతరులు స్వాధీనం చేసుకున్నారన్నది నిఖార్సైన వాస్తవం. 2015 జనవరి ఒకటి నుంచి రాజధాని నిర్మాణం పేరుతో భూసమీకరణ ప్రారంభించారు. అప్పుడు పట్టా భూములకే పరిమితం అయ్యారు. 2016 ఫిబ్రవరిలో అసైన్డ్ భూములను కూడా తీసుకుంటామని జీఓ 41 తెచ్చారు. ఈ మధ్యకాలంలోనే పలువురు టీడీపీ నేతలు, ఇతర వ్యక్తులు ఈ భూములను 95 శాతం వరకు కొనుగోలు చేశారు. వారికి ప్రయోజనం కలిగేలా ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందన్నది అభియోగం.
అయితే తెలుగుదేశం మీడియా అసలు కుంభకోణమే జరగలేదన్నట్లుగా ప్రచారం చేస్తోంది. కొందరు దళితులు సీఐడీ అధికారుల వద్దకు వెళ్లి తాము స్వచ్ఛందంగానే విక్రయించామని, ఎవరూ తమను బెదిరించలేదని చెప్పారని కథనాలను వండి వార్చుతోంది. వాస్తవానికి 1977లో వచ్చిన చట్టం ప్రకారం గానీ, 1989 నాటి అత్యాచార నిరోధక చట్టం ప్రకారం గానీ అసైన్డ్ భూములను ఎవరూ కొనరాదు. ఒకవేళ ప్రభుత్వం తీసుకోదలిస్తే వారికి నిర్దిష్ట పరిహారం చెల్లించి తీసుకోవచ్చు. కానీ ఇక్కడ జరిగింది ఏమిటి? దళితుల నుంచి కొందరు దళారులు భూములను తక్కువ ధరకు కొనుగోలు చేసి, ఆ తర్వాత వారు అధిక ధరలకు విక్రయించుకుని లాభపడ్డారు. ఇలా కొన్నవారిలో పలువురు టీడీపీ నేతలు, అధికారులు, కొందరు జర్నలిస్టులు కూడా ఉన్నారని చెబుతారు.
అసలు ఇలా వెసులుబాటు కలగడానికి అవకాశం ఇచ్చింది ఎవరు? దళితుల నుంచి భూములు కొనుగోలు చేసినవారికి కూడా ల్యాండ్ పూలింగులో అవకాశం ఇచ్చి, వారు స్వాధీనపరచినట్లు చూపించగానే వాణిజ్య, నివాస ప్లాట్లను ప్రభుత్వం కేటాయించింది. ఇలా చేయడానికి వీలుగా సంబంధిత జీఓలను మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారాయణ జారీ చేశారన్నది మరో ఆరోపణ. ఇందులో వాస్తవం లేదా? కానీ గౌరవ హైకోర్టువారు రాజధాని ప్రాధికార సంస్థ చట్టంలోని ఒక సెక్షన్ ప్రకారం ఈ చట్టం కింద చేపట్టిన చర్యల విషయంలో అధికారుల మీదగానీ, అథారిటీల మీదగానీ ఎలాంటి ప్రాసిక్యూషన్ చేయరాదని ఉంది కనుక చంద్రబాబుకూ, నారాయణకూ సీఐడీ పెట్టిన కేసులో నాలుగువారాల స్టే ఇచ్చారు. దీని ప్రకారం సీఐడీకి ఈ కేసు విచారణార్హత ఉందా అన్నది తేలాలని న్యాయస్థానం అభిప్రాయపడింది. కొన్ని కేసులలో చట్టాలకు చట్టాలనే కొట్టివేసిన న్యాయస్థానం, ఈ విషయంలో చట్టంలో ఉన్న ఫలానా క్లాజ్‌ను అనుసరించి అసలు కేసు పెట్టవచ్చా అన్న మీమాంసకు తెరతీసింది.
కోర్టులు ఎలాంటి నిర్ణయాలు చేస్తాయన్నది పక్కనబెడితే దళితులకు ఎప్పుడో ఇచ్చిన భూములకు ప్రభుత్వం నేరుగా పరిహారం ఇచ్చినా, లేక వారు సమీకరణకు భూమి ఇస్తే వారికే తదనుగుణంగా ప్లాట్లను కేటాయించినా అసలు సమస్యే లేదు. అలాకాకుండా దళితులనుంచి భూములు కొని ఇతరులకు అమ్మినవారికి క్రమబద్ధం చేయడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. అప్పట్లోనే జాతీయ ఎస్సీ కమిషన్ ఈ ప్రాంతంలో పర్యటించి జీవో 41 ని రద్దు చేయాలని సిఫారసు చేసినా, ఆనాటి ప్రభుత్వం పట్టించుకోలేదు.
కొందరు దళితులు స్వచ్ఛందంగానే భూములు అమ్మి ఉండవచ్చు. కానీ అలా అమ్ముకోవడానికి చట్టం అనుమతిస్తుందా? ఆ తర్వాత అది మరికొన్ని చేతులు మారి లక్షలు, కోట్ల ఆర్జనకు ప్రభుత్వమే ద్వారాలు తెరవొచ్చా? వీటిని న్యాయ వ్యవస్థ ఆలోచించాల్సి ఉండగా, అసలు చట్టంలో కేసులే పెట్టకూడదని ఉంది కనుక దాని గురించి విచారించాలని భావించింది. నిజానికి ఏ కేసులో అయినా సీఐడీ లేదా ఏ దర్యాప్తు సంస్థ అయినా విచారణ చేస్తుంటే దానిని కొనసాగించకుండా న్యాయ వ్యవస్థ నిర్ణయాలు చేయరాదని సుప్రీంకోర్టు గతంలో ఆదేశాలు ఇచ్చింది. అలాగే ఎఫ్‌ఐఆర్‌లు క్వాష్ చేయరాదని కూడా సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఒకవేళ ఏవైనా అనుమానాలు వస్తే సంబంధిత వ్యక్తులను అరెస్టు చేయకుండా విచారణ చేసుకోవచ్చని చెబితే కొంత పద్ధతిగా ఉంటుంది. అలాకాకుండా విచారణ నిలుపుదల చేయడం చర్చనీ యాంశం అవుతోంది. ఇలా నిర్ణయాలు జరగడం సాంకేతిక కారణాల వల్లే కావచ్చు. కానీ అది న్యాయవ్యవస్థపై విమర్శలకు ఆస్కారం ఇస్తోంది.
దీనికి సంబంధించిన జీవోపై క్యాబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకోవల్సి ఉండగా, చంద్రబాబు, ఆనాటి మున్సిపల్ మంత్రి నారాయణ ఈ జీవో ఇచ్చేశారట. జరగని ఒక అధికారిక సమావేశాన్ని జరిపినట్లు చూపించి, జీవో ఇవ్వడానికి రంగం సిద్ధం చేసుకోవడం మరో ప్రత్యేకతగా న్యాయ నిపుణులు చెబుతున్నారు. అసలు భూముల వ్యవహారాలన్నీ రెవెన్యూ శాఖ చూడవలసి ఉండగా, సంబంధిత మంత్రి కేఈ కృష్ణమూర్తికి ఎలాంటి సంబంధం లేకుండా, మున్సిపల్ శాఖే నిర్ణయాలు చేయడం ఆశ్చర్యం. ఈ క్రమంలోనే ఇన్‌సైడర్ ట్రేడింగ్ అంశం తెరపైకి వచ్చింది. తమకు కావల్సిన వారికి ముందుగా సమాచారం ఇచ్చి భూములు కొనుగోలు చేయడం అందులో ముఖ్యమైన అంశం. చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ సంస్థ సరిగ్గా రాజధానిని అనుకుని 14 ఎకరాల భూమి కొనుగోలు చేయగలిగిందని వార్తలు వచ్చాయి. అంటే వీరు పూలింగ్‌కు కూడా ఇవ్వనవసరం లేదన్నమాట. అప్పట్లో దళిత భూములకు సంబంధించి సీపీఎం, ఇతర పార్టీలు ఆందోళన చేయకపోలేదు. ఇప్పుడు ఆ రాజకీయ పక్షాలు ఎందువల్లో చొరవ తీసుకుని ఈ కేసులకు సహకరిస్తున్నట్లు కనిపించదు.
తాను ఒక మధ్యవర్తి నుంచి ఎకరం భూమి కొనుగోలు చేశాననీ, అది అసైన్డ్ భూమి అని తెలిసే కొన్నాననీ ఒక ప్రముఖుడు చెప్పారు. ప్రభుత్వం మారిన తర్వాత ఇవన్నీ బయటకు వస్తుండటంతో తాను ఆ భూమిని వెనక్కి ఇవ్వడానికి సిద్ధపడుతున్నానని అన్నారు. ప్రభుత్వం భూములు లాక్కుంటుందని చెప్పి తక్కువ ధరకు తీసుకున్న మాట వాస్తవమేననీ అన్నారు. తాము నేరుగా ఈ భూమి కొనలేదనీ, ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నవారి సన్నిహితుడి నుంచి కొన్నాననీ వివరించారు. దళితుడి నుంచి మధ్యదళారీ పది లక్షలకు కొని, తమకు నలభై లక్షలకు అమ్మారని, తద్వారా కాలు అడ్డం పెట్టినందుకు అతనికి 30 లక్షలు మిగిలిందని ఆయన వివరించారు. ఇప్పుడు ఈ పరిణామాల నేపథ్యంలో భూమిని తిరిగి ఇచ్చేయవలసి వస్తే తమ డబ్బు తమకు ఇవ్వాలని అడుగుతున్నామని చెప్పారు. ఇలాంటి ఘటనలు ఎన్నో ఉన్నాయి. అయినా టీడీపీ మీడియా అసలు కుంభకోణమే జరగలేదన్న పిక్చర్ ఇవ్వడానికి ప్రయత్నిస్తోంది. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎలా కేసు పెడతారని ఒక వాదన తేవడం, అసలు దళితులకు నష్టం జరగలేదని మరో ప్రచారం చేయడం... ఇలాంటి వన్నీ గత పాలకులు గానీ, వారికి మద్దతు ఇచ్చే మీడియా గానీ ఆత్మరక్షణలో పడ్డాయని చెప్పకనే చెబుతాయి.
అదే సమయంలో హైకోర్టులో ప్రభుత్వం తరపున మరింత సమర్థంగా వాదన వినిపించాలన్న అభిప్రాయం కూడా లేకపోలేదు. స్కామ్‌ను కనిపెట్టడం ఒక ఎత్తు అయితే, దానిని నిరూపించడం మరో ఎత్తు. రాజధానిలో దళిత అసైన్డ్ భూములతో సహా వేల ఎకరాలకు సంబంధించి అనేక స్కాములు జరిగాయని అందరికీ తెలుసు. కానీ అవి తేలకపోవడమే ఆశ్చర్యం కలిగించే అంశం. దీనికి కారణం ప్రభుత్వ వైఫల్యమా? స్కాములు చేసినవారి నేర్పరితనమా? ఆయా వ్యవస్థలు వాస్తవాలను గుర్తించలేకపోవడమా?
కొమ్మినేని శ్రీనివాసరావు
వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment