
దివంగత తెలుగుదేశం వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి. రామారావుకు తన కుటుంబం వల్ల అవమానాలు ఎదురైతే, ఆయన వల్ల మాత్రం కుటుంబ సభ్యులు మంచి గౌరవమే పొందగలుగుతున్నారు. తాజాగా ఆయన కుమార్తె దగ్గుబాటి పురందేశ్వరి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి పొందడం విశేషం. గతంలో తెలుగుదేశంలో సంక్షోభం వచ్చినప్పుడు పురందేశ్వరి భర్త వెంకటేశ్వరరావు తొలుత చంద్రబాబుకు మద్దతు ఇచ్చారు. అప్పట్లో దగ్గుబాటికి ఉప ముఖ్యమంత్రి పదవిని చంద్రబాబు ఆఫర్ చేసి ఎగవేశారు. దాంతో కొద్ది కాలానికే వెంకటేశ్వరరావు మళ్లీ ఎన్.టి.రామారావు వైపునకు వచ్చారు. కానీ రామారావు మరణించడంతో ఎన్టీఆర్ టీడీపీ(లక్ష్మీపార్వతి) తరపున రాజ్యసభకు దగ్గుబాటి ఎన్నికయ్యారు. తదుపరి మళ్లీ టీడీపీలోకి రావాలని ఆయన యత్నించారు కానీ, చంద్రబాబు రానివ్వలేదు. తదుపరి కొంతకాలం దగ్గుబాటి బీజేపీతో అనుబంధం పెట్టుకున్నా, అనూహ్యంగా కాంగ్రెస్‌లోకి వచ్చారు.
ఆ సమయంలో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి కీలక భూమిక పోషించేవారు. ఆయన పురందేశ్వరిని కూడా రాజకీయాలలోకి తీసుకు రావాలని, బాపట్ల నుంచి ఎంపీగా పోటీచేయించాలని ప్రతిపాదించారు. దాంతో భర్త పర్చూరు నుంచి అసెం బ్లీకి పోటీచేయగా, పురందేశ్వరి కాంగ్రెస్ పక్షాన బాపట్ల నుంచి, ఆ తర్వాత విశాఖపట్నం నుంచి ఎంపీగా గెలుపొందారు. ఆమె మన్మోహన్‌సింగ్ మంత్రివర్గంలో సభ్యురాలు అయ్యారు. మంచి గౌరవమే పొందారు. కానీ ఉమ్మడి ఏపీ విభజన సమయంలో పురందేశ్వరి, కావూరి సాంబశివరావు వంటి వారు కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి బీజేపీలోకి వచ్చారు. అప్పట్లో ఆమెకు విశాఖ సీటు ఇవ్వడానికి బీజేపీ, టీడీపీ కూటమి అంగీకరించలేదు. అది కాకపోయినా గుంటూరు, నరసరావుపేట, ఒంగోలు లోక్‌సభ స్థానాలలో ఏదో ఒకటి కేటాయించాలని ఆశించారు.
కాని వాటికి కూడా చంద్రబాబు, అప్పట్లో బీజేపీలో ముఖ్యుడుగా ఉన్న మరో నేత ఒప్పుకోలేదని అంటారు. దాంతో చివరికి ఆమె రాజంపేట నుంచి పోటీచేసి పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. దాంతో రాజకీయంగా ఆమె వెనుకబడినట్లయింది. కాని పార్టీ నాయకత్వం వారు బీజేపీ మహిళా మోర్చా ఇన్‌చార్జీ పదవిని ఆమెకు ఇచ్చారు. ఆ తర్వాత 2019లో విశాఖపట్నం నుంచి బీజేపీ తరపున పురందేశ్వరి పోటీచేసినా డిపాజిట్ కోల్పోవలసి వచ్చింది. తదుపరి ఆమె రాష్ట్ర పార్టీలో క్రియాశీలకంగానే ఉన్నా, ప్రస్తుతం జాతీయ స్థాయిలో ప్రధాన కార్యదర్శి పదవి ఇవ్వడం ద్వారా ఆమెకు మంచి గుర్తింపే ఇచ్చినట్లయింది. దానికి పలు రకాల కారణాలు ఉన్నాయని భావిస్తున్నారు.
వెంకటేశ్వరరావు గత ఎన్నికలలో వైఎస్సార్ సీపీ తరపున అసెంబ్లీకి పోటీచేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన అంత క్రియాశీలంగా లేరు. ఈ నేపథ్యంలో మళ్లీ పురందేశ్వరికి రాజకీయంగా బీజేపీలో ప్రాధాన్యత కొంత పెరిగింది. తెలంగాణలో సామాజిక సమీకరణల మాదిరే ఏపీలో కూడా అక్కడ ఉన్న సామాజికవర్గాల సమీకరణను తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నంలో భాగంగా బీజేపీ ఈమెకు ఈ బాధ్యత అప్పగించి ఉండవచ్చని భావిస్తున్నారు. కాపు సామాజికవర్గానికి చెందిన సోము వీర్రాజుకు పార్టీ అధ్యక్ష పదవిని అప్పగించగా, ఆయన పార్టీ భావజాలం, రాజకీయ పరిస్థితులు అన్నటిని గమనంలోకి తీసుకుని పనిచేస్తున్నారు. గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ అవినీతిని ఆయన ఇప్పటికీ ఎండగడుతున్నారు. టీడీపీ హయాంలో రాజధాని అమరావతిలో 7,200 కోట్లు ఖర్చు పెడితే అందులో జరిగిన అవినీతిని తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈయనకు ముందు అధ్యక్షుడుగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ పూర్తిగా టీడీపీ ట్రాప్‌లో పడిపోయి రాజకీయంగా దెబ్బతిన్నారన్న విమర్శలు అప్పట్లో వచ్చాయి. ఈ తరుణంలో పురందేశ్వరి నియామకం ద్వారా కమ్మ సామాజికవర్గాన్ని కొంత మేర ఆకట్టుకోవాలన్నది కేంద్ర బీజేపీ పెద్దల భావనగా చెబుతున్నారు. కాని పురందేశ్వరి ప్రధాన కార్యదర్శి అయిన తర్వాత ఇచ్చిన తొలి ఇంటర్వూ్యలో ఆమె చేసిన వ్యాఖ్యలు పార్టీని ఆత్మరక్షణలో పడేశాయన్న అభిప్రాయం కలుగుతోంది. ప్రత్యేకించి అమరావతి మాత్రమే రాజధానిగా కొనసాగాలన్నది పార్టీ నిర్ణయం అని చెప్పడం ద్వారా ఆమె విమర్శలకు గురవుతున్నారు. టీడీపీకి మద్దతు ఇచ్చే పత్రికకు ఇంటర్వూ్య ఇవ్వడం, అందులో ఆమె టీడీపీకి అనుకూలంగా మాట్లాడుతున్నారేమో అన్న అభిప్రాయం కలిగేలా కథనం ఉండడం విమర్శలకు దారి తీస్తోంది.
మొదటి ఇంటర్వూ్యలోనే ఆమె రాజకీయ వ్యూహాత్మక తప్పిదం చేసినట్లు అనిపిస్తుంది. ఆమె రాయలసీమలోని రాజంపేటనుంచి గతంలో పోటీచేసిన విషయాన్ని విస్మరించారు. ఆమె తండ్రి ఎన్టీఆర్‌ను రాయలసీమ విశేషంగా ఆదరించింది. హిందూపూర్‌లో ఎన్టీఆర్ మూడుసార్లు అసెంబ్లీకి ఎన్నికైతే, ఆ తర్వాత ఆయన కుమారుడు హరికృష్ణను ఒకసారి, మరో సోదరుడు బాలకృష్ణను రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నుకుని ఆ ప్రాంతం గౌరవించింది. అది ఒక కోణం అయితే బీజేపీ ఇప్పటికీ హైకోర్టును కర్నూలులో పెట్టాలని కోరుకుంటోంది. కానీ పురందేశ్వరి వ్యాఖ్యలు మాత్రం బీజేపీ కన్నా టీడీపీకి ఉపయోగపడేవిగా మారినట్లు కనిపించాయి. రాయలసీమలో రెండో రాజధాని ఏర్పాటు చేయాలని, సీఎం కార్యాలయం కూడా ఏర్పాటు చేయాలన్న బీజేపీ నేతలు చేసిన డిక్లరేషన్‌లో ఆమె భాగస్వామిగా ఉండి ఉండాలి.
ఈ పరిస్థితిలో రాయలసీమను గౌరవించే విధంగా ఆమె వ్యాఖ్యానించి ఉండాల్సింది. అమరావతి ఒకటే రాజధానిగా ఉండాలని కోరుకున్న ఆమె ఆ రాజధానికి కావల్సిన లక్ష కోట్ల రూపాయల నిధులను కేంద్రం నుంచి తెప్పించడానికి కృషి చేస్తానని హామీ ఇవ్వగలరా? పేదలకు రాజధానిలో ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి వీలు లేదన్న టీడీపీ వాదనతో ఆమె కూడా ఏకీభవిస్తున్నారా? అమరావతి కుంభకోణంపై సోము వీర్రాజు వ్యాఖ్యలతో ఆమె ఏకీభవిస్తున్నారా? లేదా?మూడు రాజధానుల అంశంపై కేంద్రం జోక్యం చేసుకోబోదని, అది రాష్ట్రం ఇష్టమని ఇప్పటికే ప్రకటన వచ్చింది. కాని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నవారు ఇలా మాట్లాడడం ద్వారా బీజేపీ డబుల్ గేమ్ ఆడుతోందన్న విమర్శకు ఆస్కారం ఇస్తోంది.
పైగా, బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరాఖండ్‌లో మూడు రాజధానులు ఎందుకు ఉన్నాయో ఆమె వివరణ ఇవ్వాలి. పలు రాష్ట్రాలలో హైకోర్టు, సెక్రటేరియట్, అసెంబ్లీలు వంటివి వేర్వేరుగా ఉన్న విషయం కూడా గుర్తు చేసుకోవాలి. కేంద్రంలో కానీ, పార్లమెంటులో కానీ బీజేపీకి వైఎస్సార్‌సీపీ ఇస్తున్న మద్దతును విస్మరించి మాట్లాడడం అంటే రాజకీయంగా ఆత్మహత్యాసదృశ్యమే అవుతుంది. కొద్ది రోజుల క్రితం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న గ్రామ సచివాలయ వ్యవస్థను మెచ్చుకున్న సంగతి ఆమె విస్మరించారు. మరో కేంద్ర మంత్రి ఆర్.కె. సింగ్ ఏపీలో అమలు అవుతున్న స్కీములు దేశవ్యాప్తంగా అమలు చేయాలని సూచించారు.
కాని ఆమె మాత్రం అవేమీ పట్టించుకోకుండా మాట్లాడడం ద్వారా సమతుల్యతను కోల్పోయారు. ఇప్పుడు ఆమె లక్ష్యం వైసీపీనా, టీడీపీనా?అన్నది నిర్ణయించుకోవాలి. ఏపీలోనే ఆమె కేంద్రీకరించదలిస్తే సరైన వ్యూహం ఉండాలి. అవేమీ లేకుండా ఆమె మాట్లాడారు. టీడీపీని, ఆ పార్టీ అధినేత చంద్రబాబును విమర్శించకుండా కేవలం వైసీపీని, ఆ పార్టీ తీసుకున్న విధాన పరమైన నిర్ణయాలను టీడీపీ మీడియాలో విమర్శించడం ద్వారా ఆమె జాతీయ నాయకురాలిగా కాక జాతి నేతగానే వ్యవహరించారంటూ వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్య కొంత తీవ్రంగానే ఉన్నప్పటికీ, అందుకు ఆమె అవకాశం ఇచ్చారని చెప్పాలి. ఆమె ఏపీ గురించి సోయతోనే మాట్లాడారా అన్న ప్రశ్న కూడా వస్తుంది. గతంలో ఆమె తండ్రి ఎన్.టి.రామారావుకు వ్యతిరేకంగా అనేకసార్లు కోర్టు తీర్పులు వచ్చినప్పుడు అవి ఆరుకోట్ల ప్రజలకు వ్యతిరేకంగా వచ్చిన తీర్పులు అని ఆయన వ్యాఖ్యానించిన సంగతి పురందేశ్వరికి గుర్తు ఉండకపోవచ్చు.
అంతేకాదు. మాజీ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్‌పై ఏసీబీ కేసు, ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఇద్దరు కుమార్తెలతో సహా మరికొందరిపై ఏసీపీ కేసు రావడం, వాటిని ప్రచారమే చేయకూడదని ఏపీ హైకోర్టు తీర్పు వంటివాటిని కూడా జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో పురందేశ్వరి సమర్థిస్తారా? లేదా అన్నది చెప్పాలి. ఒక వేళ ఆమె వాటిపై తన అభిప్రాయాలు చెబితే, ఆ పత్రిక వేయకపోతే ఆ విషయం అయినా ఆమె వెల్లడించాలి. లేకుంటే ఏపీలో బీజేపీని పైకి తీసుకురావడంతో పురందేశ్వరి ఏదైనా పాత్ర పోషిస్తారనుకున్నవారికి ఆమె నిరాశే మిగిల్చినట్లవుతుంది. అమరావతి రాజధాని ఒకటే ఉండాలని ప్రచారం చేయడం ద్వారా ఆమెకు వ్యక్తిగతంగా ఏమైనా ప్రయోజనాలు ఉన్నాయేమో తెలియదు. కాని రాజకీయంగా వైసీపీని ఇరుకున పెట్టాలని చెబితే మాత్రం ఆమె సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లే అవుతుంది.
పురందేశ్వరి ఇలాగే రాజకీయం కొనసాగిస్తే, అటు సామాజికవర్గాన్ని ఆకట్టుకోలేక, ఇటు వ్యూహం లేకుండా టీడీపీవారికి ,ఆ పార్టీకి మద్దతు ఇచ్చే మీడియాకు కరసాధనంగా మాత్రమే ఉపయోగపడితే ఆమెకు రాజకీయంగా ఒరిగేది శూన్యమే అవుతుందని చెప్పకతప్పదు. ఏది ఏమైనా ఒకటి మాత్రం వాస్తవం. ఎన్.టి.ఆర్.ను పదవీచ్యుతుడిని చేయడం ద్వారా ఆయన పరువును గంగలో కలపడంలో కీలక భూమిక పోషించిన ఎన్.టి.ఆర్.కుటుంబం మొత్తం చిన్నల్లుడు చంద్రబాబు ట్రాప్‌లో చిక్కుకుని బయటకు రాలేకపోతోంది. ఆ తర్వాత కాలంలో దగ్గుబాటి కుటుంబం పూర్తిగా చంద్రబాబు చేతిలో అవమానాల పాలైంది. ఇప్పుడు పురందేశ్వరి టీడీపీ అనుకూల లైన్‌లో వెళుతున్నారా అన్న సందేహం రావడానికి ఆస్కారం ఏర్పడింది. నిజంగానే పురందేశ్వరి కూడా అదే దిశలో పయనిస్తే ఏపీలో బీజేపీ సాధించేది జీరోనే అని చెప్పక తప్పదు. మరొక్క మాట. ఎన్.టి.ఆర్. ఆంధ్రులం దరిలో ఆత్మగౌరవ నినాదాన్ని ప్రేరేపించగలిగారు. కానీ అది ఆయన కుటుంబంలోనే కొరవడడం విషాదమే అనిపిస్తుంది.
కొమ్మినేని శ్రీనివాసరావు
వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు