ఇదివరకే తగ్గుముఖం పట్టిన యూనియన్లను సర్వీసు రంగ పెరుగుదల, కాంట్రాక్టు కార్మికులు, ఇప్పుడు కొత్త కార్మిక చట్టాలు మరింత ప్రాధాన్యత లేనివిగా మార్చాయి. ఈ రోజుల్లో ఇండియాలో కార్మిక సంఘాల గురించి పెద్దగా వినబడటం లేదు. సరళీకరణకు ముందటి పారిశ్రామిక మార్కెట్‌లో కార్మిక లేదా ట్రేడ్ యూనియన్లు చాలా ప్రాధా న్యత కలిగివుండేవి. కానీ కార్మిక మార్కెట్‌లో ఇటీవల వస్తున్న భారీ మార్పులవల్ల అవి వాటి ప్రాసంగికతను కోల్పోతున్నాయి. సంఘంగా జట్టుకట్టడం ఎందుకు తగ్గు తుందో తెలుసుకోవాలంటే, కార్మిక సంఘాల ఆర్థిక శాస్త్రాన్ని తెలుసుకోవడం అవశ్యం.
డిమాండ్, సప్లయ్ రెండూ కూడా ఒక లేబర్ మార్కె ట్‌లో సంఘానికి చోటివ్వగల ఉద్యోగాలను నిర్ణయిస్తాయి. అధిక వేతనం, నిరుద్యోగిత లేకుండా చేయడాన్ని గనక యూనియన్ వాగ్దానం చేస్తే కార్మికులు యూనియన్ కాగ లిగే ఉద్యోగాలను డిమాండ్ చేస్తారు. కార్మికశక్తిని వ్యవస్థీ కృతం చేయడానికయ్యే ఖర్చులు, కొన్ని తరహా యూని యన్ కార్యక్రమాలను నియంత్రించే లేదా నిషేధించే చట్టసంబంధ వాతావరణం, ఉమ్మడి బేరసారాల్ని ఎంత బలంగా కంపెనీ నిరోధించగలదన్న సంగతి, సంస్థకు వచ్చే అధిక లాభాలను యూనియన్ ఎంత సమర్థతతో పొంద గలదు– అన్నవి సప్లయ్‌లవైపు కారకాలు అవుతాయి.
నిర్మాణం, తయారీ, రవాణా లాంటి రంగాలు కార్మిక సంఘాలుగా కూడటానికి అనువుగా ఉంటాయి. వ్యవ సాయం, ఆర్థిక రంగాల్లో ఈ వీలు తక్కువ. అత్యధిక అవుట్‌పుట్‌ను కొన్ని కంపెనీలే ఉత్పత్తి చేసే పక్షంలోనూ సంఘాలకు వీలుంటుంది. ఎందుకంటే కంపెనీల మార్కెట్ శక్తి చాలావరకు కార్మిక సంక్షేమానికి నష్టకరం గానే ఉంటుంది కాబట్టి. అలాంటి చోట సంస్థలు పొందే అధిక లాభాల్లో కొంత వాటాను యూనియన్లు తమ కార్మి కుల కోసం రాబట్టగలవు.
స్థూల ఆర్థిక పరిస్థితులు, న్యాయ వాతావరణం కూడా సంఘాలు కాగలగడాన్ని ప్రభావితం చేస్తాయి. నిరుద్యో గిత శాతం ఎక్కువగా ఉండి, కార్మికులు ఉద్యోగ అభద్రత నుంచి బయటపడాలని అనుకున్నప్పుడు సంఘం ఏర్పడా లన్న డిమాండ్ పెరుగుతుంది. ద్రవ్యోల్బణం అధికంగా ఉండి, వాస్తవిక వేతనాలు తగ్గుముఖం పట్టినప్పుడు కూడా సంఘంగా కూడే శాతం పెరుగుతుంది. ఇక సంస్థ– యూనియన్ సంబంధాన్ని నియంత్రించే కార్మిక చట్టాలు కూడా యూనియన్ కావడాన్ని ప్రభావితం చేస్తాయి. ముందు చెప్పినవన్నీ కూడా 1960–70 మధ్య కాలంలో యూనియన్లు వ్యాప్తి చెందడానికి కారణమయ్యాయి.
సరళీకరణ అనంతర దశలో అన్ని పరిశ్రమల్లోనూ కార్మిక సంఘాలు తగ్గిపోవడానికి చాలా కారణాలు పని చేశాయి. ఆర్థిక వ్యవస్థ వ్యవస్థీకృత మార్పులకు లోనై సర్వీసు రంగం ముందువరుసలోకి వచ్చింది. ఈ మూడవ రంగంలో యూనియన్లు తమ ప్రాధాన్యతను దాదాపుగా కోల్పోయాయి. సంఘంగా జట్టు కాలేని ఉద్యోగాలను సంఘపు ఉద్యోగాలుగా మార్చడం కష్టతరం అవుతున్న కొద్దీ కూడా యూనియన్ల శాతం తగ్గిపోయింది. పర్మనెంట్ ఉద్యోగాల సంఖ్య తగ్గిపోతుండటం కూడా కార్మిక సంఘాల పాత్రను పరిమితం చేస్తోంది. గత కొన్ని దశా బ్దాలుగా ఎన్నో వస్తూత్పత్తి సంస్థలు కార్మిక హక్కులకు రక్షణ కల్పించే కార్మిక చట్టాలను తప్పించుకోవడానికి కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ కార్మికులను నియమించుకు న్నాయి. అనిశ్చితి కలిగిన కాంట్రాక్టు గుణంవల్ల ఈ కార్మి కులు ఒక సంఘంగా ఏర్పడలేరు.
2020 వరకూ కూడా ఈ కారణాలు కార్మిక సంఘా లను దాదాపుగా ప్రభావశీలం కానివిగా మార్చేశాయి. దీనికితోడు గతేడాది కేంద్ర ప్రభుత్వం శాసనం చేసిన కొత్త కార్మిక చట్టాలు వారి సమస్యలను మరింత పెంచాయి. ఎన్నో వెసులుబాట్లతో కూడిన ఈ చట్టాలు ఇక యూని యన్లను ఉండీ లేనట్టుగా మార్చేశాయి. ఉదాహరణకు, మేనేజ్‌మెంట్‌తో ఒప్పందాలు కుదుర్చుకోవడంలో సమ్మె అనేది ఒక గట్టి ఆయుధంగా ఉండేది. కానీ కాలక్రమంలో చట్టాలు, విధివిధానాలు కార్మిక సంఘాలు సమ్మెకు వెళ్ల గలిగే శక్తిని తీవ్రంగా నీరుగార్చాయి.
ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్(ఐఆర్‌సీ) 2020లో ప్రభుత్వం సమ్మెల మీద చాలా ఆంక్షలను విధిస్తూ, లేఆఫ్‌లు, ఉద్యోగుల తగ్గింపు విషయంలో మాత్రం పరి శ్రమల వైపు మొగ్గుచూపింది. దీనివల్ల ప్రభుత్వ అనుమతి లేకుండానే ఉద్యోగులను తీసుకోవడం, తీసేయడం (హైరింగ్ అండ్ ఫైరింగ్) సులభతరం అవుతుంది.
ఐఆర్‌సీ ప్రతిపాదన ప్రకారం, ఒక పరిశ్రమలో పని చేస్తున్న ఏ వ్యక్తి కూడా 60 రోజుల ముందస్తు నోటీసు ఇవ్వకుండా; ట్రిబ్యునల్ లేదా నేషనల్ ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్ ముందు వాదనలు పెండింగులో ఉన్నప్పుడూ; ఆ వ్యవహారం ముగిసిన 60 రోజుల వరకూ కూడా సమ్మెకు దిగకూడదు. గతంలో కార్మికులు రెండు నుంచి ఆరు వారాల నోటీసు ఇచ్చి సమ్మెకు దిగగలిగేవాళ్లు. ఇప్పుడు మెరుపు సమ్మెలు చట్టవ్యతిరేకం.
మొదటిసారిగా కార్మిక సంఘాలను అధికారికంగా గుర్తించిన ఐఆర్‌సీలో, సంప్రదింపుల యూనియన్ లేదా సంప్రదింపుల సమితి పేరుతో కొత్త భావనను పరిచయం చేశారు. ఒకవేళ ఆ కంపెనీలో ఒకే యూనియన్ కర్తృత్వంలో ఉన్న పక్షంలో, దాన్ని కార్మికుడి తరఫున సంప్రదింపులు జరిపే ఏకైక యూనియన్‌గా కంపెనీ గుర్తిస్తుంది. ఎక్కువ సంఘాలు గనక ఉనికిలో ఉంటే, కంపెనీ హాజరు పట్టీలోని 51 శాతం ఉద్యోగులతో సంబంధం ఉన్నది మాత్రమే కార్మి కుడి తరఫున చర్చలు జరిపే ఏకైక యూనియన్ అవు తుంది. ఒకవేళ ఏ యూనియన్‌లోనూ సంస్థ హాజరు పట్టీ లోని 51 శాతం ఉద్యోగులు లేనిపక్షంలో ఆ సంస్థే ఒక చర్చల సమితిని నియమిస్తుంది.
ఈ కొత్త కార్మిక చట్టాలు ఎలా కార్మికుల హక్కులను కాపాడతాయి అనేది స్పష్టంగా తెలియకపోయినా, వ్యాపార లావాదేవీలను సులభతరం చేయడంలోనూ, కాంట్రాక్టు లేబర్‌ను పెంచడంలోనూ మాత్రం పని కొస్తాయి. కాంట్రాక్ట్ లేబర్లకు సంబంధించిన నియమావళి మరింతగా కార్మిక సంఘాల ఉనికిని కుంచింపజేస్తోంది.అయితే ఈ కొత్త తరం నవీన ఆర్థిక వ్యవస్థలో కూడా కార్మిక సంఘాలు ప్రాధాన్యత గల పాత్ర పోషించే అవ కాశం ఉంది. ఆఖరికి భారీ ఏనుగుల్లాంటి అమెజాన్, గూగుల్‌లోనూ యూనియన్లు ఉన్నాయి. ఈ కొత్త సవాళ్లను ఎదుర్కోవడానికి కార్మిక సంఘాలు కొత్త వ్యవహార పద్ధతు లను అవలంబించాలి, సాంకేతికంగా తమను కాలాను గుణంగా మార్చుకోవాలి, రాజకీయంగా తక్కువ ప్రభా వితం కావాలి. అలాగే పాత ప్రపంచ సంప్రదాయాలు, పనితీరు విషయంలో పూర్తి భిన్నంగా ఉన్న కొత్త తరం కార్మికుడి పరిభాషను మాట్లాడాలి.
-సీతాకాంత్ పాండా
అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ ఎకనామిక్స్, ఐఐటీ భిలాయ్
Comments
Please login to add a commentAdd a comment