సినిమా వారి రాజకీయాలు | MAA Elections Guest Column By Kommineni Srinivasa Rao | Sakshi
Sakshi News home page

సినిమా వారి రాజకీయాలు

Published Wed, Oct 20 2021 12:20 AM | Last Updated on Wed, Oct 20 2021 12:20 AM

MAA Elections Guest Column By Kommineni Srinivasa Rao - Sakshi

రాజకీయాలకు ప్రజాభిమానమే పెట్టుబడి. దాన్ని నాయకులు ప్రజల్లో ఉండటం ద్వారా సంపాదించుకుంటే, నటీనటులకు అయాచితంగా వస్తుంది. దాంతో ఆ అభిమానాన్ని రాజకీయాల్లోకి మళ్లించే ప్రయత్నం చేస్తారు. కానీ అది చాలాసార్లు విఫలయత్నమే అవుతోంది. తామేదో ప్రత్యేకమైన జీవులుగా చాలామంది ప్రవర్తించడం, వారిని దేవుళ్లలాగా అభిమానులు ఆరాధించడం కొనసాగుతూనే ఉంది. అందుకే రేపు వీరు రాజకీయాల్లోకి వస్తే వెర్రి అభిమానంతో కాకుండా– వారి స్థిరత్వం, సైద్ధాంతిక నిబద్ధత ఆధారంగా అభిమానులు మద్దతివ్వాలి. సినిమావాళ్లు సైతం రాజకీయాల్లో రాణించాలంటే ప్రజలతో ఉండటం తప్ప మరో మార్గం లేదని తెలుసుకోవాలి.

తెలుగు సినిమా కళాకారుల సంఘంలో రాజకీయాలు, అలాగే తెలుగు రాష్ట్రాలలో వారి రాజకీయాలను పరిశీలించడం ఆసక్తికరం. అంతా కలిపి 900 మంది కూడా ఉండని మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నిక లలో జరిగిన గందరగోళాన్ని ఈమధ్య కాలంలో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికలతో పోల్చవచ్చేమో. ‘మా’ ఎన్నికలలో ప్రాంతాలు, భాషలు, కులాలు,  పార్టీల ప్రస్తావన రావడం దురదృష్టకరం.

భక్తులు గుడులకు వెళ్లి ఎలా తమ ఇష్ట దైవాలకు ప్రార్థన చేస్తారో, దాదాపు అదే స్థాయిలో సినీ హీరోలు, హీరోయిన్లను అభిమానులు ఆరాధిస్తుంటారు. కానీ ఈ సినీ కళాకారుల సంఘ ఎన్నికలు చూసిన తర్వాత అభిమానులకు ఒక విషయం అర్థమై ఉండాలి. వీరు కూడా సామాన్య ప్రజల మాదిరే వ్యవహరిస్తారనీ, గొడవలు పడుతుంటా రనీ స్పష్టమైపోయింది. వీరు రాజకీయాలలోకి వస్తే వారిలో ఉండే స్థిరత్వం, వారి వ్యక్తిగత జీవితాలలో పాటించే నిబద్ధత, సిద్ధాంత వైఖరి మొదలైన వాటిని పరిగణనలోకి తీసుకుని అభిమానులు లేదా ప్రజలు మద్దతిస్తే మంచిది. 

ప్రకాశ్‌ రాజ్, మంచు విష్ణు మధ్య మాటల యుద్ధం; మోహన్‌ బాబు రంగంలోకి దిగడం; ప్రకాశ్‌ రాజ్‌ వర్గం ఓడిపోవడం, దాంతో వారు రాజీనామాలు ప్రకటించడం; అలాయ్‌ బలాయ్‌ కార్యక్రమంలో విష్ణు పలకరించినా పవన్‌ కల్యాణ్‌ మాట్లాడలేదన్న వార్త వంటివి సినిమా రంగానికి కొంత నష్టం చేసినట్లు అనిపిస్తుంది. ప్రాంతీయ వాదం తనను ఓడించిందని ప్రకాశ్‌ రాజ్‌ చెప్పారు. మెగా కుటుంబపు మద్దతు ప్రకాశ్‌ రాజ్‌కేనని ప్రకటించడం ద్వారా చిరంజీవికి, పవన్‌ కల్యాణ్‌కు నాగబాబు ఇబ్బంది తెచ్చి పెట్టారు. పవన్‌ బీజేపీకి మిత్ర పక్షంగా ఉంటే, ఆ పార్టీకి పూర్తి వ్యతిరేకిగా ముద్ర పడ్డ ప్రకాశ్‌ రాజ్‌కు ఎలా మద్దతు ఇచ్చారన్న విమర్శలు వచ్చాయి. దానికి తోడు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ దీనిపై కామెంట్‌ చేసి ప్రకాశ్‌ రాజ్‌ ఓటమిని స్వాగతించారు.

తెలుగుదేశం ఎమ్మెల్యే అయిన బాల కృష్ణ... మంచు విష్ణుకు మద్దతివ్వడం కూడా గమనించదగిన అంశమే. ఒక వైపు ఏపీలో జనసేనతో కలవాలని టీడీపీ ప్రయత్నిస్తుంటే, మెగా ఫ్యామిలీ బలపరిచిన ప్యానెల్‌కు బాలకృష్ణ మద్దతు ఇవ్వకపోవడం ఆసక్తికరం. వీటన్నింటిని ఏపీ రాజకీయాలతో ముడిపెట్టకపోయినా, జరిగిన సంఘటనలన్నీ ఏపీ రాజకీయాలను ఎంతో కొంత ప్రభా వితం చేసేలా ఉన్నాయి. రెండు సామాజిక వర్గాలను, టీడీపీ– జనసేనను కలపాలని ప్రయత్నిస్తున్న టీడీపీకీ మద్దతిచ్చే కొందరు పాత్రికేయ ప్రముఖులకు ఇది ఇబ్బంది కలిగించింది. ఫలితాల గురించి టీడీపీ వారికన్నా, వారికి మద్దతిచ్చే మీడియావారే ఎక్కువ బాధపడ్డట్టుగా ఉంది.

ఇదే సమయంలో రాజకీయాలలో ఉండేవారంతా నిబద్ధత కలిగి ఉంటారా అన్న సంశయం రావచ్చు. రాజకీయనేతలకు ఎవరం సర్టిఫి కెట్‌ ఇవ్వజాలం. కానీ వారు నిత్యం ప్రజలలో ఉంటారు. వారిని ప్రజలు ఓడిస్తారు, గెలిపిస్తారు. ఏ పరిస్థితిలో అయినా ప్రజల మధ్య ఉంటారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ గత పదేళ్లలో అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. సోనియాగాంధీ, చంద్రబాబు కలిసి జైలుకు పంపించినా ఓపికగా ఉన్నారు. పార్టీ ఓడిపోయినా ప్రజా జీవనంలో గట్టిగా నిలబడ్డారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కూడా గత నాలుగు దశాబ్దాలుగా రాజకీయాలలో ఉన్నారు. తన మామను పదవి నుంచి దించడం కరెక్టా కాదా అన్నది వేరే విషయం. రెండుసార్లు గెలిచారు. మూడుసార్లు ఓటమి చెందారు. కానీ రాజ కీయాలు వదలలేదు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా అనేక ఢక్కామొక్కీలు తిన్నారు. 

సినీ నటులు అలా కాదు. తామేదో స్పెషల్‌ వ్యక్తులుగా ఎక్కువ మంది భావిస్తారు. దానికి కారణం కొంతమంది పిచ్చి అభిమానంతో వారిపై పడిపోతుండటమే. తమపై ఏర్పడిన అభిమానంతో సినీ నటులు రాజకీయాలలోకి కూడా వచ్చి శాసించాలని ప్రయత్నిస్తుం టారు. వీరిలో కొందరు సఫలం అయ్యారు. మరికొంతమంది విఫలం అయ్యారు. దక్షిణాది రాష్ట్రాలలోనే రాజకీయాలలోకి సినీ నటులు ఎక్కువ మంది వచ్చారు. తమిళనాడులో సినిమా ఆధారంగానే కరుణానిధి, ఎంజీఆర్‌ మధ్య రాజకీయాలు సాగాయి. ఎంజీఆర్‌ సొంతంగా అన్నా డీఎంకేను ఏర్పాటు చేసుకుని ఘన విజయం సాధించారు.

పాలనలో ప్రజల మన్నన కూడా పొందగలిగారు. అలాగే కరుణానిధి, జయలలిత  దశాబ్దాల తరబడి ప్రత్యర్థులుగా ఉంటూ తమిళ రాజకీయాలను శాసించారు. కొన్ని సార్లు సక్సెస్‌ అయ్యారు, మరికొన్నిసార్లు ఫెయిల్‌ అయ్యారు. అయినా రాజ కీయాలలో కొనసాగారు. వారి తర్వాత ఆ స్థాయిలో తమిళ నటులు రాణించలేదు. రజనీకాంత్‌కు రాజకీయాలలోకి రావడానికి ధైర్యం చాలలేదు. కమల్‌హాసన్, విజయ్‌కాంత్‌ వచ్చి విఫలం అయ్యారు.

ఆంధ్రప్రదేశ్‌ విషయానికి వస్తే ఎన్టీ రామారావుకు ముందు కొంగర జగ్గయ్య వంటి కొద్ది మంది రాజకీయాలలోకి వచ్చినా పెద్దగా సక్సెస్‌ కాలేదు. జగ్గయ్య ఒకసారి ఎంపీగా గెలిచారు. ఎన్టీఆర్‌ తెలుగు దేశం పార్టీని స్థాపించిన తొమ్మిది నెలల్లో అధికారంలోకి రావడం ఒక సంచలనం. అయితే అనుభవ రాహిత్యంతో ఒకసారి, నిర్లక్ష్యంతో మరోసారి ముఖ్యమంత్రి పదవిని పోగొట్టుకున్నారు. ఆ తర్వాత చిరంజీవి 2009 ఎన్నికల సమయంలో ప్రజారాజ్యం పేరుతో పార్టీ పెట్టినా సఫలం కాలేకపోయారు. రాజకీయాలు నడపడం చేతకాక దెబ్బతిన్నారని చెప్పాలి.

చివరికి తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి కేంద్ర మంత్రి అయ్యారు. ఆ తర్వాత రాజకీయాలకు ఒక రకంగా దూరంగా ఉంటున్నారు. ఆయన సోదరుడు పవన్‌ కల్యాణ్‌ 2014లో జనసేన పార్టీని స్థాపించి, పార్టీ తరఫున ఎవరినీ పోటీలో దించ కుండా, బీజేపీ, తెలుగుదేశం గెలుపునకు ఉపయోగపడ్డారు. 2019లో జనసేన పోటీచేసినా ఉపయోగం లేకుండా పోయింది. కమ్యూని స్టులు, బీఎస్పీతో కలిసి ఎన్నికలలో పాల్గొన్నారు. ఎన్నికలు అయిపో గానే తిరిగి బీజేపీ  పంచన చేరారు. 2009లో చిరంజీవి రెండుచోట్ల పోటీచేసి ఒక చోట ఓడిపోయి, మరోచోట గెలిస్తే, పవన్‌ పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయారు. 

మరికొందరు కూడా రాజకీయాలలోకి వచ్చారు. కృష్ణ కొంత కాలం రాజకీయాలలో ఉండి ఒకసారి ఎంపీ అయి తదుపరి వైదొలి గారు. ఆయన భార్య విజయనిర్మల ఒకసారి పోటీచేసి ఓటమి చెందారు. కోట శ్రీనివాసరావు, జయసుధ, కైకాల సత్యనారాయణ, శారద ఒకసారి గెలిచి ఆ తర్వాత రాజకీయాల్లో తెరమరుగయ్యారు. బాబూమోహన్‌ రెండుసార్లు గెలిచి మంత్రిగా కూడా పనిచేశారు. కాకపోతే మూడు పార్టీలు మారారు. నరేష్‌ ఒకసారి పోటీచేసి ఓడి పోయారు. జయప్రద ఒకసారి రాజ్యసభకు ఇక్కడ నుంచి గెలిచి, ఆ తర్వాత యూపీ నుంచి లోక్‌సభకు ఎన్నికవడం విశేషం. మోహన్‌ బాబు ఒకసారి రాజ్యసభకు ఎన్నికై, ఆ తర్వాత అంతగా రాణించ లేకపోయారు. కృష్ణంరాజు రెండుసార్లు పార్లమెంటుకు ఎన్నికై కేంద్ర మంత్రి పదవి నిర్వహించారు.

ఆయన కూడా మూడు పార్టీలు మారవలసి వచ్చింది. సూపర్‌ స్టార్‌గా పేరొందిన అమితాబ్‌ బచ్చన్‌ సైతం ఒకసారి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించి, రాజకీయాలు తనవల్ల కాదని వైదొలిగారు. మరికొందరు హిందీ నటులు కూడా రాజకీయాలలో ఉన్నా, వారు మొత్తం రాజకీయాలను ప్రభావితం చేయడానికి ప్రయత్నించలేదు. పవన్‌ అయితే నిలకడ లేని, గాలివాటు రాజకీయాలు చేస్తున్నారన్న అభిప్రాయం ఉంది. ఏది ఏమైనా రాజ కీయాలు వేరు, సినిమాలు వేరు అన్న విషయాన్ని ప్రజలు కొంత వరకు అర్థం చేసుకున్నా, ఇంకా పిచ్చి అభిమానంతో ఉండేవారు లక్షల సంఖ్యలోనే ఉన్నారని చెప్పాలి. వారందరికీ ‘మా’ ఎన్నికలు కనువిప్పు కావాలి. సినిమాను వినోదంగా, నటులను నటులుగానే చూడాలి.

-కొమ్మినేని శ్రీనివాసరావు
వ్యాసకర్త సీనియర్‌ పాత్రికేయులు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement