మళ్లీ మొదటికొచ్చిన కశ్మీర్‌ సమస్య | Manoj Joshi Analysis On Article 370 Abolishment In Kashmir | Sakshi
Sakshi News home page

మళ్లీ మొదటికొచ్చిన కశ్మీర్‌ సమస్య

Published Fri, Jun 10 2022 1:47 AM | Last Updated on Fri, Jun 10 2022 1:47 AM

Manoj Joshi Analysis On Article 370 Abolishment In Kashmir - Sakshi

ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత కశ్మీర్‌ లోయలో శాంతిని పునఃస్థాపించగలిగామని రెండేళ్లుగా ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోంది. ఈ చర్యల కారణంగానే కశ్మీరీ పండిట్లు మళ్లీ తమ మాతృభూమికి వెళ్లగలిగారనీ, ఉద్యోగాలు పొందగలిగారనీ కూడా కేంద్రం చెబుతూ వస్తోంది. కానీ... తాజాగా జరుగుతున్నదేమిటి? పండిట్లు నిస్సహాయులుగా మళ్లీ కశ్మీర్‌ను వదిలి వెళ్లిపోతున్నారు. కశ్మీర్‌లోని ఉగ్రవాదులతో పాటు ప్రజలూ, మీడియాను కూడా ప్రభుత్వం తొక్కిపెట్టింది. ఫలితంగా ప్రజల్లో ప్రభుత్వం పట్ల సానుకూల దృక్పథం కొరవడి, మిలిటెంట్లు మళ్లీ రెచ్చిపోయేందుకు కారణమైంది. కాబట్టి, కశ్మీర్‌ రాజకీయాల్లో తుపాకీ పాత్ర లేకుండా జాగ్రత్త పడినప్పుడే సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఇదేమీ అసాధ్యమైన విషయం కాదు. మిజోరం, పంజాబ్‌లలో కేంద్రం ఇప్పటికే ఈ ఘనతను సాధించింది.

గ్రీకు పురాణాల్లో ‘హుబ్రిస్‌’ అని పిలుస్తారు దాన్ని. ఇంగ్లిష్‌ నిర్వచనం ప్రకారం అధిక గర్వం లేదా మితిమీరిన అహంకారం అనవచ్చు. గ్రీకుల పురాతన మత బోధనల్లో ‘హుబ్రిస్‌’కు గురైన వారు... నెమిసిస్‌ అనే దేవత చేతిలో హతమవుతారు. కశ్మీర్‌ విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం అలాంటి పరిస్థితే ఎదుర్కొం టున్నట్లు కనిపిస్తోంది! 
తిరిగి వెళ్తున్న పండిట్లు ఆర్టికల్‌ 370, 35ఏ రద్దు తరువాత కశ్మీర్‌ లోయలో శాంతిని పునః స్థాపించగలిగామని రెండేళ్లుగా ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోంది. ఈ చర్యల కారణంగానే కశ్మీరీ పండిట్లు మళ్లీ తమ మాతృభూమికి వెళ్లగలిగారనీ, ఉద్యోగాలు పొందగలిగారనీ కూడా కేంద్రం చెబుతూ వస్తోంది.

కానీ... తాజాగా జరుగుతున్నదేమిటి? పండిట్లు నిస్సహా యులుగా మళ్లీ కశ్మీర్‌ను వదిలి వెళ్లిపోతున్నారు. తమను తాము కాపాడుకునేందుకు వెళుతున్న పండిట్లను నిలువరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అనధికారిక అంచనాల ప్రకారం ఇప్పటికే కొన్ని వందల మంది పండిట్లు కశ్మీర్‌ను వదిలి జమ్మూ చేరుకున్నారు. అంతేకాదు... ఉద్యోగం కోసం తప్పనిసరి చేస్తూ తమతో రాయించు కున్న ఒప్పందాన్ని రద్దు చేయాలని కూడా వీరు డిమాండ్‌ చేస్తున్నారు. 

ప్రధానమంత్రి ప్యాకేజీ కింద గత ఏడాది కాలంలో దాదాపు ఆరు వేల మంది పండిట్లకు ఉద్యోగాలు, నివాస సదుపాయం లభించాయి. ప్రభుత్వం వీరి కోసం వేర్వేరు జిల్లాల్లో తాత్కాలిక ఇళ్ల నిర్మాణమూ చేపట్టి పూర్తి చేసింది. పండిట్ల తిరుగు వలస నేపథ్యంలో అధికారులు ఇప్పుడు ఉద్యోగ ఒప్పందాలను చూపి వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవ పరిస్థితులు ఇలా ఉంటే... ప్రచార పటాటోపానికి మాత్రమే పనికొచ్చే నిర్మాణాలు కొన్ని చూపి అంతా బాగానే ఉందనే భ్రమను కల్పిస్తోంది ప్రభుత్వం. కానీ ట్రాన్సిట్‌ క్యాంపుల వద్ద కనీస భద్రతా సౌకర్యాలు, సిబ్బంది కూడా లేకపోవడం మాత్రమే వాస్తవం. 

అణిచివేతే విధానం
కశ్మీర్‌ విషయంలో ప్రభుత్వం అణచివేత ధోరణినే ప్రదర్శించింది. కశ్మీర్‌లోని మిలిటెంట్లూ, ఉగ్రవాదులతో పాటు అన్ని వర్గాల ప్రజలూ, మీడియాను కూడా అనూహ్య రీతిలో తొక్కిపెట్టే ప్రయత్నం చేసింది. ఫలితంగా ప్రజల్లో ప్రభుత్వం పట్ల సానుకూల దృక్పథం కొరవడి మిలిటెంట్లు మళ్లీ రెచ్చిపోయేందుకు కారణమైంది. అటు ఉగ్ర వాదులు, ఇటు ప్రభుత్వం మధ్యలో బలవుతున్నది మాత్రం నిరా యుధులైన అమాయకులు. మరీ ముఖ్యంగా కశ్మీరీ పండిట్లు. వీరితో పాటు ప్రభుత్వ విధాన అమలుకు సహకరించారన్న అంచనాతో స్థానిక పోలీసు సిబ్బంది మీద కూడా ఉగ్రవాదుల దాడులు జరుగు తున్నాయి. పోలీసులను పరిస్థితులకు బందీలుగా కాకుండా ప్రభుత్వ ఉపకరణాలుగా ఉగ్రవాదులు చూస్తున్నారు.

2019 తరువాత నరేంద్ర మోదీ ప్రభుత్వం కశ్మీర్‌ విషయంలో వివాదాస్పద విధానాన్ని అవలంబించిందంటే అతిశయోక్తి కాదు. ఆర్టికల్‌ 370 కారణంగా కశ్మీర్‌కు ప్రత్యేక అధికారాలు లభిస్తున్నాయన్న భ్రమలో దాన్ని రద్దు చేయడం మాత్రమే కాకుండా, రాష్ట్రాన్ని కాస్తా కేంద్ర పాలిత ప్రాంత స్థాయికి తగ్గించారు. జమ్మూ కశ్మీర్‌కు ముఖ్య మంత్రులుగా, కేంద్ర మంత్రులుగా  పనిచేసిన రాజకీయ నేతలను నిర్బంధంలో ఉంచారు. పరిపాలన మొత్తం నేరుగా ఢిల్లీ నుంచే నడిచేది. వీటన్నింటికి తోడుగా ఉగ్రవాదాన్ని రూపుమాపేందుకు నిర్వ హించిన ‘ఆపరేష¯Œ  ఆలౌట్‌’ను మనం మరచిపోకూడదు. ఉగ్రవాద అణచివేతలో విజయం సాధించామన్న ప్రభుత్వ ప్రచారార్భాటాన్నీ గుర్తుంచుకోవాలి. 

వాస్తవిక పరిస్థితులు వేరే...
2021 డిసెంబరులో జరిగిన ఒక కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి, కశ్మీర్‌ పాలనా వ్యవస్థకు అనధికార నేత అయిన అమిత్‌ షా మాట్లా డుతూ – ఆర్టికల్‌ 370 తొలగింపు ద్వారా కశ్మీర్‌లో శాంతి స్థాపనకు మార్గం ఏర్పడిందనీ, అభివృద్ధి సుసాధ్యమైందనీ మరోసారి వ్యాఖ్యా నించారు. అలాగే ఈ ఏడాది మార్చిలోనూ కశ్మీర్‌లో హింస తగ్గి పోయిందని నిరూపించేందుకు బోలెడన్ని గణాంకాలు వల్లెవేశారు.

గణాంకాలు కాగితంపై బాగానే కనిపిస్తాయి కానీ... వాస్తవ పరిస్థి తులు పరిశీలిస్తేనే అసలు విషయం తెలుస్తుంది. తుదముట్టించిన మిలిటెంట్ల సంఖ్య, అరెస్ట్‌ అయినవారు, స్వాధీనం చేసుకున్న ఆయు ధాలు, పునరావాసం పొందిన పండిట్లు, కుదుర్చుకున్న ఒప్పందాల వంటివన్నీ అమిత్‌ షా మాటల్లో వినిపించాయి అయితే వీటన్నింటి మధ్య జన సామాన్యుల భావనలెలా ఉన్నాయన్నది మాత్రం ప్రభుత్వం అంచనా వేయలేకపోయింది. ఆరేళ్ల అణచివేత ధోరణుల ఫలితంగా ప్రజలు అప్పటికే విసుగెత్తి ఉన్నారు. తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేసేందుకు నిరసన ప్రదర్శనలు నిర్వహించే అవకాశమూ లేకపోయిన నేపథ్యంలో వారు ప్రభుత్వ చర్యలకు మద్దతిస్తారని ఆశించలేము.
ఉగ్రవాదం తీరు మారింది!

ఈ పరిస్థితుల నేపథ్యంలోనే సైనిక చర్యల కారణంగా గణనీయంగా తగ్గిపోయిన ఉగ్రవాద కార్యకలాపాలు కాస్తా మళ్లీ తీవ్రవాదం స్థాయికి చేరుకున్నాయి. ఇప్పుడు అక్కడ యుద్ధం ఏకే 47, ఆర్‌పీజీలతో జరగడం లేదు కానీ... వ్యక్తులను ఎంచుకుని మరీ తుపాకులు, గ్రెనేడ్లతో దాడులు మొదలుపెట్టారు. లక్ష్యితులు నిరాయుధులు కావడం, ఆయుధాలను దుస్తుల్లో దాచుకుని వెళ్లగలగడం ఉగ్రవాదుల పనిని మరింత సులువు చేస్తోంది. అతి సాధారణ జీవితం గడుపుతూ అవసరమైనప్పుడు పండిట్ల వంటి నిరాయుధులను, లేదంటే విధి నిర్వహణలో లేని పోలీసు సిబ్బందిపై కాల్పులు జరపడం ఈ హైబ్రిడ్‌ మిలిటెన్సీ తీరుతెన్నులుగా మారాయి.  

పాకిస్తాన్‌ నుంచి భారత్‌లోకి చొరబడుతున్న ఉగ్రవాదుల సంఖ్య తగ్గిపోయిందని సైన్యం స్వయంగా గత ఏడాది జూ¯Œ లో ప్రకటించింది కాబట్టి... ఈ తాజా దాడులు, హైబ్రిడ్‌ మిలిటెన్సీ పాక్‌ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ కనుసన్నలలోనే జరుగుతోందని మనం కచ్చితంగా అను కోవచ్చు. ఇంకోలా చెప్పాలంటే... మోదీ ప్రభుత్వ చర్యల వల్ల ఏర్పడ్డ పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకుని మిలిటెంట్లు పని చేస్తున్నారని చెప్పాలి. 

తుపాకులకు చోటు లేదు!
కశ్మీర్‌ లోయలో ఉగ్రవాదుల అణచివేతలో నిఘా సంస్థలు, కేంద్ర ప్రభుత్వ బలగాలు ఎంతో సమర్థతతో వ్యవహరించాయనడంలో ఎలాంటి సందేహమూ లేదు. గడచిన రెండు దశాబ్దాల్లో ఇలాంటి పరిస్థితులు అనేకమార్లు ఏర్పడ్డాయి కూడా! అయితే ఒక మిలిటెంట్‌ హతమైతే... అతడి స్థానంలో ఇంకొకరు పుట్టుకొస్తున్నారు. అంటే... ఎంత మంది మిలిటెంట్లను చంపాం? ఎన్ని ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాం? అన్నవి ముఖ్యం కాదన్నమాట. కశ్మీర్‌ రాజకీయాల్లో తుపాకీ పాత్ర లేకుండా జాగ్రత్తపడినప్పుడే సమస్యకు పరిష్కారం లభించినట్లు.

ఇదేమీ అసాధ్యమైన విషయం కాదు. మిజోరం, పంజాబ్‌లలో కేంద్రం ఇప్పటికే ఈ ఘనతను సాధించింది. ఈ రెండు రాష్ట్రాల అనుభవాలేమిటన్నది బీజేపీ సహా అన్ని పార్టీల రాజకీయ నాయకులకూ బాగా తెలుసు. కానీ ప్రస్తుతం వారు వాటిని విస్మరి స్తున్నారు. ఇదీ రాజకీయం ప్రత్యేకత. పాకిస్తాన్‌ కారణంగా కశ్మీర్‌ విషయంలో దౌత్యమూ అత్యవసరం. కానీ అవేవీ చేయకుండా మనం అణచివేత రాజకీయాలకు పాల్పడతూ, ఉడికీ ఉడకని జాతీయత అనే భావన ఆధారిత విధానాలను అవలంబిస్తున్నాం. 


వ్యాసకర్త: మనోజ్‌ జోషీ,
జాతీయ, అంతర్జాతీయ రాజకీయ వ్యవహారాల నిపుణుడు
(‘ద ట్రిబ్యూన్‌’ సౌజన్యంతో) 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement