భావాలను వ్యాప్తి చేయడంలో, ప్రజలను చైతన్య పర్చడంలో రచనల స్థానాన్ని సినిమా దురాక్రమించిందని రాశారు జాకబ్ డ్రకెర్. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చెందించడానికి లేదా చారిత్రక దృక్పథాన్ని వక్రమార్గం పట్టించడానికి కూడా సినిమా సాధనంగా మారవచ్చు. ఈ నేపథ్యంలో చూస్తే ‘ద కశ్మీర్ ఫైల్స్’ మీద ఇజ్రాయిల్ దర్శకుడు నదావ్ లపీద్ వ్యాఖ్యలు మరింత బాగా అర్థమవుతాయి.
అంతర్జాతీయ ఘటనలపై తమ దృక్పథాన్ని వివరిస్తూ అన్ని దేశాలూ సినిమాలు తీస్తుంటాయి. అయితే ప్రచారం నుంచి కళను వేరు చేసే; రెచ్చగొట్టే మెజారిటీ వాదం నుంచి ఉదారవాద ప్రజాస్వామ్య విలువలను వేరు చేసే విభజన రేఖ తప్పకుండా ఉండాలి. ‘ద కశ్మీర్ ఫైల్స్’ ఆ రేఖను ఉల్లంఘించింది.
గోవాలో ఇటీవల ముగిసిన 53వ భారత అంతర్జాతీయ చిత్రోత్సవంలో జ్యూరీ అధ్యక్షుడిగా వ్యవహరించిన ఇజ్రాయిల్ దర్శకుడు నదావ్ లపీద్ ‘ద కశ్మీర్ ఫైల్స్’పై చేసిన అవమానకర వ్యాఖ్యలు ఇప్పటికీ దేశంలో ప్రతి ధ్వనిస్తూనే ఉన్నాయి. వివాదం రేగిన తర్వాత ఆయన క్షమాపణను ‘ఎన్డీటీవీ’ పతాక వార్తగా ప్రసారం చేయగా, మరోవైపున ‘ద వైర్’ కోసం నదావ్ లపీద్ ఇంటర్వ్యూ చేసిన పాత్రికేయుడు కరణ్ థాపర్ ఆ వార్తను ఖండించారు.
తన వ్యాఖ్యను వెనక్కు తీసుకోవడానికి లేదా విరమించుకోవడానికి తిరస్కరించిన ఇజ్రాయిల్ దర్శకుడు ఆ ఇంటర్వ్యూలో తానెందుకలా అనవలసి వచ్చిందో స్పష్టం చేశారు. ‘‘అది నా కర్తవ్యం, నా విధి కూడా. వ్యర్థ ప్రసంగం చేయకుండా నిజా యితీగా ఉండటానికి నన్ను జ్యూరీకి ఆహ్వానించారు.’’ అయితే భారత్ లోని ఇజ్రాయిల్ రాయబారి నష్టనివారణకు ప్రయత్నించారు.
కశ్మీర్ పండిట్లు కశ్మీర్‌లోని తమ నివాసాలను బలవంతంగా వదిలివేయ వలసి వచ్చిన అంశంపై దృక్పథానికి సంబంధించినంత వరకూ, ఈ సినిమా బీజేపీకి ఒక పాక్షిక అధికారిక స్వరంగా ఉపయోగపడిందని ఇజ్రాయిల్ రాయబారి గుర్తించారు కనుకే తమ దేశస్థుడైన దర్శకుడి వ్యాఖ్యలను ఖండించారు.
కశ్మీర్ ఫైల్స్ సినిమాను చిత్రోత్సవంలో వీక్షించిన జ్యురీ సభ్యు లను అది ఇబ్బంది పెట్టిందనీ, షాక్‌కు గురిచేసిందనీ నదావ్ లపీద్ పేర్కొన్నారు. ఈ చిత్రం అసభ్యకరంగా ఉందనీ, వట్టి ప్రచార సినిమాలా ఉందనీ అన్నారు. కశ్మీర్ ఫైల్స్ చిత్ర రచయిత, దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ఒక సున్నితమైన విషయాన్ని మలిచిన విధానంపై లపీద్ చేసిన వ్యాఖ్యలు అసలు జరిగిన విషాదం వెనుక వాస్తవాలకు సంబంధించి గందరగోళాన్ని రేకెత్తించాయి.
రాజీవ్ గాంధీ నేతృత్వం లోని కాంగ్రెస్ ప్రభుత్వం స్థానంలో ప్రధాని వీపీ సింగ్ నేతృత్వంలోని జనతాదళ్ ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడిన కాలంలో – 1990ల మొదట్లో గవర్నర్ జగ్‌మోహన్ జమ్మూ కశ్మీర్ పాలనలో భాగమ య్యారు. అది కశ్మీర్ నుంచి ఉన్నట్లుండి హిందూ వలసలు ప్రారంభ మైన కాలం. శతాబ్దాలుగా తమతో కలిసి మెలిసి జీవిస్తున్న ఇరుగు పొరుగు హిందువులతో సంబంధాలను తెంచుకోవాలని మిలిటెంట్లు ముస్లిం మెజారిటీని ఒత్తిడికి గురిచేశారు.
కశ్మీర్ నుంచి వలసల వెల్లువ మొదలైన ఇతివృత్తంతో తీసిన కశ్మీర్ ఫైల్స్ సినిమాకు బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు పన్ను రాయితీ కల్పించాయి. ఆ రాష్ట్రాల్లోని బీజేపీ నేతలు థియేటర్లలో సినిమా విడుదల కాకముందే ప్రశంసలు గుప్పిం చడం, ప్రజలను విభజించే అభిప్రాయాలు వెల్లడించడం మొదలు పెట్టారు.
సుప్రసిద్ధ ‘టైమ్ మ్యాగజైన్’ ఒక విశేష కథనాన్ని ప్రచురిస్తూ– ‘ద కశ్మీర్ ఫైల్స్: బాలీవుడ్ కొత్త సినిమా భారత్‌ని మరింతగా మత దురభిమానంలోకి ఎలా నెడుతోంది?’ అనే శీర్షిక పెట్టింది. ‘న్యూయార్క్ టైమ్స్’ సైతం ‘కశ్మీర్ హిందువుల బహిష్కరణపై వచ్చిన సినిమా భారత్‌ను వేరుచేస్తూ ప్రజాదరణ పొందుతోందా?’ అనే శీర్షికతో తన ఆలోచనలను ప్రతిధ్వనించింది. ఇక సింగపూర్ అయితే రెచ్చగొట్టేలా ముస్లింల గురించి ఏకపక్షంగా చిత్రించిందని పేర్కొంటూ సినిమా విడుదలపై నిషేధం విధించింది.
వివిధ మతాల మధ్య ఇది శత్రుత్వాన్ని ప్రేరేపించేలా ఉందని పేర్కొంది. ఇదే ప్రాతిపదికన భారతదేశంలో అనేక చోట్ల ఎఫ్‌ఐఆర్‌లు నమోద య్యాయి. ఈ సినిమా ప్రకటించే భావాలు స్వల్ప స్థాయిలో అయినా సరే దాడులకు ప్రేరేపించే అవకాశమిస్తున్నప్పుడు, బీజేపీ, దాని భక్తులు దీన్ని ఎందుకు పనిగట్టుకుని ప్రోత్సహించినట్లు? కాబట్టి ఇప్పుడు ఈ సినిమాపై ఇజ్రాయిల్ దర్శకుడు నదావ్ లపీద్ వ్యాఖ్యల్లో కొత్త విషయమూ లేదు, ఆశ్చర్యం కలిగించేదీ లేదు.
అలాంటప్పుడు దీంట్లో సమస్య ఏంటి? చర్చ పాతదే. సాహిత్యం లేదా సినిమా ప్రజలకు వినోదం కలిగించాలా, చైతన్యం కలిగించాలా లేదా ఒకే సమయంలో రెండింటికీ అవకాశం కల్పించాలా? ‘ద హార్వర్డ్ క్రిమ్సన్’ పుస్తకంలో జాకబ్ ఆర్ డ్రకెర్... భావాలను వ్యాప్తి చేసే, ప్రజలను చైతన్య పర్చే రచనల స్థానాన్ని సినిమా దురాక్రమించిందని రాశారు. కాబట్టి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చెందించడానికి లేదా చారిత్రక దృక్పథాన్ని వక్రమార్గం పట్టించడానికి కూడా సినిమాలు సాధనంగా మారవచ్చు.
ఈ కోణంలో చూస్తే చారిత్రక దిద్దుబాటు పట్ల బీజేపీ జాగ్రత్తగా ఉన్నట్టు కనిపించదు. ‘టైటానిక్’ మునకను మరోసారి గుర్తు చేయడానికి లియోనార్డో డికాప్రియో, కేట్ విన్‌స్లెట్ నటించిన లాంటి మానవ జ్ఞాపకాన్ని తిరిగి మల్చగలిగిన చిత్రాల ఉదాహరణలు మనకు అనేకం ఉన్నాయి. స్టీవెన్ స్పీల్‌బర్గ్ తీసిన ‘లింకన్’ లేదా కెనడీపై అలివర్ స్టోన్ తీసిన ‘జేకేఎఫ్’ వంటివి వీక్షకుల దృష్టికోణంలోంచి గతంలోని చారిత్రక ఘటనలు, వ్యక్తులను సినిమా రూపంలో మలిచినవి.
విషాదకరమైన ఉపద్రవాలతో కూడిన ఘటనలను ఇతివృత్తంగా తీసుకున్నప్పుడు వాటి చిత్రీకరణ నిజంగానే సవాలు విసురుతుంది. ప్రత్యేకించి వీక్షకులు అలాంటి ఘటనలకు మరీ దూరమైన కాలంలో లేనప్పుడు, వాటిపట్ల నిర్మమకారంతో తమ అభిప్రాయాలు పంచు కోలేనప్పుడు ఇది మరింత సవాలుగా ఉంటుంది.
అందుకే, కశ్మీర్ ఫైల్స్ సినిమాను విడుదల చేసి ఉండకూడదని శరద్ పవార్ వంటి సీనియర్ నాయకుడు పేర్కొన్నారు. ఎందుకు చేయకూడదని చాలా మంది ప్రశ్నిస్తారు. దీనికి సమాధానంగా కౌంటర్ ప్రశ్నను సంధిం చాల్సిన అవసరం ఉంది. గోధ్రా అల్లర్లు లేదా బాబ్రీ మసీదు విధ్వంసం వంటి ఘటనలపై అన్ని కోణాల్లో సత్యాన్ని చిత్రించే సినిమా తీసినట్లయితే దాని విడుదలకు బీజేపీ అనుమతిస్తుందా?
అంతర్జాతీయ ఘటనలపై తమ దృక్పథాన్ని, లేదా ప్రపంచంలో తమ పాత్ర గురించి వివరిస్తూ అన్ని దేశాలూ సినిమాలు తీస్తుంటా యన్నది నిజం. 1968లో వియత్నాం యుద్ధంపై అమెరికాలో యుద్ధ వ్యతిరేక నిరసనలు వెల్లువెత్తుతున్న కాలంలో, నాటి అమెరికా అధ్యక్షుడు లిండన్ బి జాన్సన్ ఇచ్చిన ప్రోత్సాహంతో ‘ద గ్రీన్ బెరెట్స్’ సినిమాను జాన్ వేయిన్ తీశారు.
అమెరికా అసాధారణ వాదం నుంచి, అంతర్జాతీయ సుస్థిరతకు హామీ ఇవ్వడానికి, ప్రపంచ ఆధిపత్య శక్తిగా స్వీయ ప్రకటిత పాత్ర పోషించే నేపథ్యంలోంచి అనేక సూపర్ హీరో సినిమాలు వెల్లువెత్తాయి. అయితే ప్రచారం నుంచి కళను వేరు చేసే, రెచ్చగొట్టే మెజారిటీ వాదం నుంచి ఉదారవాద ప్రజాస్వామ్య విలువలను వేరు చేసే విభజన రేఖ తప్పకుండా ఉంటుంది. ఈ లక్ష్మణ రేఖను ‘ద కశ్మీర్ ఫైల్స్’ స్పష్టంగా మీరింది.
ఇజ్రాయిల్ దర్శకుడు నదావ్ లపీద్ ఒక మూడో ప్రపంచ దేశాన్ని అవమానపర్చడంలో భాగంగా ఈ ‘ఈకలు పీకలేదు’. ఇదే రకమైన విమర్శలను ఆయన తన స్వదేశంలో కూడా చేశారు. వెస్ట్ బ్యాంక్ ప్రాంతంలో ఇజ్రాయిల్ సెటిలర్లకు విరాళాలను పొడిగించడానికి లేదా వారి ఆక్రమణను సమర్థించే చిత్రాలను ప్రోత్సహిస్తున్న షోమ్రోన్ ఫిల్మ్ ఫండ్‌ను ఖండించడానికి ఆయన 250 మంది ఇజ్రాయిలీ ఫిలింమేకర్స్‌తో చేతులు కలిపారు.
ఘటనల యధార్థాన్ని ప్రశ్నించ కుండానే కశ్మీర్ ఫైల్స్ చిత్రించిన తరహా విషాదాన్ని విమర్శించవచ్చని లపీద్ అభిప్రాయపడ్డారు. ప్రజలు తమ నోరు విప్పి మాట్లాడటానికి భయపడుతున్న చోట నివసించడానికి ఎవరైనా ఇష్టపడతారా అని ఆయన ప్రశ్నించారు. వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వ సామర్థ్యాలు లేదా సోషల్ మీడియాలో ట్రోల్స్ రూపంలోని ఉన్మాద ప్రకటనలు లేక ప్రభుత్వ ప్రతినిధి వెర్రి చేష్టల కంటే మనం చూడాల్సిన నిజమైన సమస్య ఇదే మరి. నిజాలను నిర్ధారించడానికీ, లేదా ప్రభుత్వం నిర్దేశిస్తున్న వాస్తవికతను ప్రశ్నించడానికీ భారతదేశంలో ఇప్పటికీ చోటుందా?
కేసీ సింగ్
వ్యాసకర్త మాజీ కార్యదర్శి, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
(‘ద ఫ్రీ ప్రెస్ జర్నల్’ సౌజన్యంతో)
Comments
Please login to add a commentAdd a comment