కీలకమైన గెలుపు హవా! | Praveen Rai Article Five State Assembly Election Narendra Modi | Sakshi
Sakshi News home page

కీలకమైన గెలుపు హవా!

Published Wed, Mar 9 2022 1:14 AM | Last Updated on Wed, Mar 9 2022 4:37 AM

Praveen Rai Article Five State Assembly Election Narendra Modi - Sakshi

దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్‌ అసెంబ్లీతోపాటు పంజాబ్, మణిపూర్, గోవా, ఉత్తరాఖండ్‌ ఎన్ని కల తంతు ముగిసింది. జయాప జయాల వివరాలు ఇంకో రెండు రోజుల్లో స్పష్టమవుతాయి. ఈ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ద్వారా ఒక విషయమైతే అంచనా వేయవచ్చు. దేశ ప్రస్తుత రాజకీయాల్లో సైద్ధాంతికంగా మోడీ హవా ఇంకా కొనసాగుతూనే ఉంది. 2014 ఎన్నికలు మోడీని జాతీయ స్థాయి నేతగా నిలబెడితే, 2019 నాటి ఎన్నికలు మోడీ ఆధిపత్యాన్ని పరాకాష్టకు చేర్చాయి. మోడీ నాయ కత్వంపై విదేశీ మీడియా మాత్రమే కాదు.. వామపక్షవాదులు, విమర్శకులు, విదేశీ మీడియా తరచూ విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఏ ఒక్క రాష్ట్రంలో బీజేపీ ఓటమిపాలైనా మోడీ హవా అయిపోయిందనీ వీరు ప్రకటించేస్తూంటారు. వ్యవసాయ చట్టాల రద్దు తరువాత మోడీ రైతులకు క్షమాపణలు చెప్పడంతో ఈ చర్చ మళ్లీ మొదలైంది. అయితే, మోడీ హవాను అర్థం చేసుకోవడం అంత సులువైన పనేమీ కాదు.

మోడీ హవాకు నాందీ పడింది గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఆయన అధికారం నిర్వహించినప్పుడన్నది నిర్వివాదాంశం. మోడీ మార్కు గుజరాత్‌ నమూనా ఆర్థిక వృద్ధికి సూచికగా మారిన విషయం తెలిసిందే. 2002–12 మధ్యకాలంలో గుజ రాత్‌ ఆర్థిక వృద్ధిని సవాలు చేసే వాళ్లెవరూ లేకపోగా ఈ పరి ణామం కాస్తా ఆయన్ని మళ్లీ మళ్లీ ముఖ్యమంత్రిని చేయ గలిగింది. నిజాయతీపరుడు, కష్టజీవి, హిందుత్వవాది అన్న ముద్ర మోడీకి దక్కింది. ఆర్థికంగా ఎదగాలన్న మధ్యతరగతి వర్గం రాష్ట్ర అభివృద్ధి విషయంలో మోడీ దార్శనికతను తమదిగా చేసుకున్నారు. హిందూ ఓట్లు మోడీకి నమ్మకంగా పడటం మాత్రమే కాకుండా.. హిందుత్వ రాజకీయాలకు మోడీ ఓ మార్గదర్శకుడయ్యాడు. బీజేపీ తరఫున ప్రధానిగా మోడీ పోటీ చేయనున్నారన్న వార్తతో మెజారిటేరియన్‌ రాజకీయాల్లో మోడీ ప్రభ గుజరాత్‌ను దాటి దేశవ్యాప్తమైంది. మోడీ చరిష్మాతో దేశ ఎన్నికల యవనికపై కాషాయం అలుముకుంది. మట్టి మనిషి, అభివృద్ధి రాజకీయాలపై దార్శనికత ఉన్న వాడిగా ముద్ర సంపాదించుకున్న మోడీ వాటి సాయంతోనే తన చరిష్మాను కొనసాగించారు. ఆర్థికంగా సాధించిన అభివృద్ధి గుజరాత్‌ ప్రజల జీవన ప్రమాణాలను పెంచడం కూడా ఇక్కడ ఉపయోగపడింది. చాయ్‌వాలా నేపథ్యం, ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాం తాల మద్దతులు ఒకవైపున... అవినీతి, వారసత్వ రాజకీయాలు ఇంకోవైపున ఉన్న సందర్భంలో ప్రజలు మోడీకి ఆకర్షితుల య్యారని చెప్పాలి. రాజకీయ, వాక్‌ చాతుర్యాలూ కలిసి వచ్చాయి. ప్రతిపక్షాల వైఫల్యాలను ఎండగడుతూ... మైనారిటీ లను ప్రసన్నం చేసుకునేందుకు వారు చేసిన ప్రయత్నాలను తరచూ ప్రస్తావిస్తూ హిందూ వర్గాల్లో తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు. ప్రభుత్వ విధానాలను, కార్యక్రమాలను మీడియా ద్వారా ప్రజలకు అందించడం, ప్రజల నాడిని గ్రహిస్తూ వాటిల్లో తప్పులను సరిదిద్దుకోవడం మోడీకి లాభిం చింది. మోడీ వినా మరో ప్రత్యామ్నాయం లేదన్న మానసిక స్థితిని సృష్టించడంలోనూ విజయం సాధించారు.

2014 తరువాత జరిగిన ఎన్నికల్లో అత్యధికం హవాల ఆధారంగా నడిచినవే. బీజేపీ విజయాలు.. లేదా ఓట్లశాతంలో పెరుగుదల ప్రధానంగా మోడీ అనుకూల పరిస్థితులు, ప్రభుత్వ వ్యతిరేకత సెంటిమెంట్ల ఆధారంగానే జరిగాయి. ప్రభుత్వ పాలన సరిగా లేని మధ్యప్రదేశ్, హరియాణాల్లో మోడీ ప్రభ బీజేపీ పతనాన్ని అడ్డుకుంది. ఓటమి తాలూకూ తీవ్రతను గణనీ యంగా తగ్గించింది. పశ్చిమబెంగాల్‌లో పార్టీ రెండో స్థానానికి ఎదిగేందుకు సాయపడింది. సబ్‌ కా సాథ్‌.. సబ్‌ కా వికాస్‌ అన్న నినాదంతో 2022 నాటికి సరి కొత్త భారత దేశాన్ని నిర్మిస్తా మన్న మోడీ నినాదం దేశంలో ఓ కొత్త ఊపు తెచ్చింది. జాతీయ మౌలిక సదుపాయా లను ఆధునికీకరించడం, అంతర్జాతీయ ప్రమాణాలతో కొత్తవాటిని ఏర్పాటు చేయడం అన్న ద్విముఖ వ్యూహంతో మోడీ కొత్తగా నేషన్‌ బిల్డింగ్‌ మొదలుపెట్టారు. ఆర్థిక సంస్క రణలు వేగవంతం చేయడం, ప్రజాకర్షక సంక్షేమ పథకాల అమలు రాజకీయంగా మోడీకి ఉన్న ఆదరణను మరింత పెంచాయి. ఆర్టికల్‌ 370 రద్దు, అయోధ్యలో రామ మందిరం వంటి చిరకాల ఆర్‌ఎస్‌ఎస్‌ అజెండాను వేగంగా ఆచరణలోకి తీసుకురావడం మోడీ హవాకు మరింత జోరు నిచ్చాయి. ఏతావాతా.. మోడీ హవా మరింత కాలం కొన సాగేందుకు ఇవన్నీ దోహదపడుతున్నాయి.

అయితే రాజకీయ విశ్లేషకులు, నిపుణులు కొందరు మోడీ హవా, బీజేపీ తాలూకూ వ్యవస్థ చాలా బలహీన పడ్డాయని చెబుతూ, అందుకు ఐదు కారణాలు చూపుతున్నారు. వీటిల్లో మొదటిది, 2014 తరువాతి ఎన్నికల్లో మోడీ విజ్ఞప్తుల తరువాత కూడా బీజేపీకి పడ్డ ఓట్ల శాతంలో స్వల్పమైన తగ్గుదల నమోదు కావడం. ఈ కారణంగా 2024 ఎన్నికల్లో బీజేపీ స్పష్టమైన మెజా రిటీతో గెలవడం అంత సులువు కాబోదని వీరు అంటున్నారు. మోడీ తరువాత బీజేపీ తన ఆధిపత్యాన్ని కొనసాగించే పరిస్థి తులు ఉండవన్నది రెండో కారణంగా చూపుతున్నారు. మోడీ వారసుడు ఎవరన్న అంశంపై పార్టీ చీలిపోవడమో, కుప్పకూలి పోవడమో జరుగుతుందని వీరి అంచనా. మోడీ, బీజేపీ హవా తగ్గుతోందనేందుకు విశ్లేషకులు చూపుతున్న మూడో కారణం పార్టీలోనే అంతర్గతంగా పోటీ మొదలయ్యే అవకా శాలు ఉండటం. ఓబీసీలు, ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి పార్టీలో కొత్తగా చోటిచ్చిన నేపథ్యంలో వారు తమ ప్రాతినిధ్యంపై డిమాండ్‌ చేస్తారని వీరు చెబుతున్నారు. ఇప్పటివరకూ బీజేపీ అగ్రశ్రేణి నాయకత్వంలో అగ్రవర్ణాలదే ఆధిపత్యం. బీజేపీ సంస్థాగత నిర్మాణం దోవతప్పిపోయే అవకాశం ఉందన్నది నాలుగో కారణం. ఇందిరా కాంగ్రెస్‌ తరువాత కాంగ్రెస్‌ పార్టీలో జరిగి నట్టే ఇప్పుడూ జరగవచ్చునని వీరు చెబుతున్నారు. అత్యంత సంక్లిష్టమైన సామాజిక సమీకరణలు బెడిసికొట్టి ఓటర్లకు కొన్ని ఇతర అంశాలు గోచరిస్తే రాజకీయంగా మరోసారి కొత్త ముఖాల కోసం ప్రయత్నాలు మొదలు కావచ్చు.

ఆసక్తికరమైన అంశం ఏమిటంటే... ఈ కారణాల్లో కొన్ని పరస్పర వైరుద్ధ్యమున్నవి. ఇందిరా కాంగ్రెస్‌ తరువాతి పరిస్థితులపై అంచనా కూడా అస్పష్టం. ఎందుకంటే ఇరు పార్టీల నేపథ్యం, రాజకీయం పూర్తిగా భిన్నం. మొత్తమ్మీద చూస్తే... మోడీ హవా ఇప్పటికీ కొన సాగుతోందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. దేశ రాజ కీయాలకు అత్యంత కీలకమైన ఉత్తర ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా ఎన్నికల్లోనూ గెలుపు ఓటములకు మోడీ హవా కీలకం కానుంది.


ప్రవీణ్‌ రాయ్‌
వ్యాసకర్త రాజకీయ విశ్లేషకులు,
సెంటర్‌ ఫర్‌ ద స్టడీ ఆఫ్‌ డెవలపింగ్‌ సొసైటీస్, ఢిల్లీ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement