రిజర్వేషన్ల ప్రాణంతీస్తున్న ప్రభుత్వాలు | R Krishnaiah Guest Column About Reservation Issues In India | Sakshi
Sakshi News home page

రిజర్వేషన్ల ప్రాణంతీస్తున్న ప్రభుత్వాలు

Published Fri, Nov 13 2020 12:50 AM | Last Updated on Fri, Nov 13 2020 12:53 AM

R Krishnaiah Guest Column About Reservation Issues In India - Sakshi

బీసీ, ఎస్సీ, ఎస్టీల ప్రయోజనాలను గండి కొట్టడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోటీపడుతున్నాయి. ఒక్క ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మాత్రమే ఈ వర్గాల ప్రజలకు అన్ని రంగాల్లో జనాభా ప్రకారం కోటా ఇవ్వడాన్ని చట్టబద్ధం చేసింది. కాంట్రాక్టులలో, పారిశ్రామిక పాలసీలలో, నామినేటెడ్‌ పోస్టులలో జనాభా ప్రకారం కోటా ఇస్తూ ఉత్తర్వులు జారీచేసింది. అమ్మఒడి, రీయింబర్స్‌మెంట్, స్కాలర్షిప్‌ వంటి పథకాలతో పేదకులాల పిల్లలు ప్రతి ఒక్కరూ చదువుకునేటట్లు చేశారు. విద్యా, ఉద్యోగ, రాజకీయ అవకాశాల్లో దేశమంతటా జరుగుతున్న అన్యాయంపై ఐక్యంగా గళమెత్తకపోతే బీసీ, ఎస్సీ, ఎస్టీల బతుకు అంధకారంలో మునిగిపోతుంది. 

కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు ఒక పథకం ప్రకారం బీసీ రిజర్వేషన్లకు గండికొట్టే ప్రయత్నాలు ప్రారంభించాయి. ఒకవైపు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి బీసీ/ ఎస్సీ/ఎస్టీ వర్గాలకు అన్ని రంగాలలో జనాభా ప్రకారం కోటా ఇవ్వడాన్ని చట్టబద్ధం చేశారు. కాంట్రాక్టులలో, పారిశ్రామిక పాలసీలలో, నామినేటెడ్‌ పోస్టులలో జనాభా ప్రకారం కూడా ఇస్తూ చట్టబద్ధం చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. అలాగే ప్రతి కులానికి ఒక కార్పొరేషన్‌ చొప్పున 56  కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, చైర్మన్‌తో సహా 13 మంది డైరెక్టర్లను నియమించి, ఆయా కులాల నాయకత్వాన్ని పెంచారు.

బడ్జెట్‌ కేటాయించి ఆయా కులాలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ చదువుకోవాలని పాఠశాల స్థాయిలో అమ్మ ఒడి పథకం కింద ప్రతి ఒక్కరికీ 15 వేలు చొప్పున అలాగే ఇంజనీరింగ్, మెడిసిన్, ఇతర కోర్సులు చదివే విద్యార్థులకు పూర్తిగా ఫీజు రియింబర్స్‌మెంట్‌ మంజూరు, కాలేజీ స్థాయిలో 20 వేల స్కాలర్‌షిప్‌ మంజూరు చేస్తూ పేద కులాలను ప్రతి ఒక్కరూ చదువుకొనేటట్లు చేశారు. 

కానీ, ఇంకొకవైపు కేంద్ర ప్రభుత్వం బీసీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతోంది. నీట్‌లో కేంద్ర ప్రభుత్వ కోటా కింద వచ్చే మెడికల్‌ అడ్మిషన్లలో బీసీ రిజర్వేషన్లు అమలు చేయడం లేదు. లక్నోలోని అంబేడ్కర్‌ యూనివర్సిటీ విద్యాసంస్థల అడ్మిషన్లలో రిజర్వేషన్లు అమలు చేయడం లేదు. అలాగే నల్సార్‌ యూనివర్సిటీ ‘లా’–అడ్మిషన్లలో ఓబీసీ రిజర్వేషన్లు అమలు చేయడం లేదు. దీనికి తోడు క్రీమీలేయర్‌ పరిధిలో మరి కొన్ని వర్గాలను తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలను జాతీయ బీసీ కమిషన్, అలాగే ఓబీసీ–పార్లమెంటరీ కమిటీ వ్యతిరేకించడంతో ఆ ప్రతిపాదన ఉపసంహరించుకుంది.

అలాగే 2021లో చేపట్టబోయే జనాభా గణనలో బీసీ కులాల వారీగా జనాభా గణన చేయరాదని నిర్ణయించింది. 2018 ఆగస్టు 31న బీసీ కులాల జనాభా లెక్కలు తీయాలని కేంద్ర హోంశాఖ మంత్రి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో నిర్ణయించింది. ఆ తరువాత ఇటీవల ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. బీసీల జనాభా లెక్కలు లేకపోవడంతో పంచాయతీరాజ్‌ సంస్థలలో ఏయే స్థానాలు బీసీలకు కేటాయించాలో ఎంత శాతం నిర్ణయించాలో తెలియక ప్రభుత్వాలే ఇబ్బంది పడుతున్నాయి. అలాగే కేంద్ర ప్రభుత్వం బీసీ జాబితాను గ్రూపులుగా వర్గీకరణ చేయడానికి నియమించిన జస్టిస్‌ రోహిణి కమిటీకి బీసీల జనాభా లెక్కలు అందుబాటులో లేక వర్గీకరణ ప్రక్రియ ముందుకు సాగడం లేదు.

ఇక తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కూడా ఒక పథకం ప్రకారం రిజర్వేషన్లకు గండి కొడుతోంది. ఇటీవల ప్రారంభించిన 5 ప్రైవేటు యూనివర్సిటీలలో బీసీ/ఎస్సీ/ఎస్టీ రిజర్వేషన్లు అమలు చేయరాదని నిర్ణయించారు. రాజ్యాంగం ప్రకారం ఇవ్వవలసిన రిజర్వేషన్లను ఈ యూనివర్సిటీలలో పెట్టబోమని దర్జాగా విద్యాశాఖ మంత్రి సబితా రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు.

గతంలో ఈ ఐదు వర్సిటీలకు ఒక్కొక్క యాజమాన్యం క్రింద 20 నుంచి 50 ఇంజనీరింగ్, తదితర కాలేజీలు ఉండేవి. రిజర్వేషన్లు ఎత్తివేయడానికే ఈ కాలేజీలను యూని వర్సిటీలుగా మార్చారా! ప్రైవేటు విద్యాసంస్థల్లో బీసీ/ఎస్సీ/ఎస్టీ రిజర్వేషన్లు పెట్టాలని 2006లో పార్లమెంటులో చట్టం చేశారు. 1980లో అప్పటి ప్రభుత్వ ఉమ్మడి రాష్ట్రంలో ఇంజనీరింగ్, మెడికల్‌ కాలేజీ ప్రారంభించినపుడు బీసీ/ఎస్సీ/ఎస్టీ రిజర్వేషన్లు పెట్టలేదు. అప్పుడు బీసీ విద్యార్థి సంఘం పెద్దఎత్తున ఆందోళన చేయగా ప్రభుత్వం దిగివచ్చి ప్రైవేటు విద్యాసంస్థలలో రిజర్వేషన్లు పెట్టాలని అసెంబ్లీలో చట్టం చేసింది. అప్పటి నుంచి ప్రైవేటు ఇంజనీరింగ్‌ పీజీ మెడికల్‌ కాలేజీలో రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. కానీ ఇప్పుడు ప్రైవేటు యూనివర్సిటీలలో బీసీ/ఎస్సీ/ఎస్టీ రిజర్వేషన్లు అమలు చేయకపోవడం రాజ్యాంగ విరుద్ధం.

అలాగే పంచాయతీరాజ్‌ ఎన్నికలలో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్‌పీటీసీ, వార్డ్‌ మెంబర్‌ ఎన్నికలలో బీసీ రిజర్వేషన్లు 34 శాతం నుండి 22 శాతంకు తగ్గించారు. బీసీ, ఎస్టీ, ఎస్సీ కులాలవారు ఓట్లు వేసి అగ్ర కులాల వారిని గత 74 ఏళ్లలో 32 మందిని సీఎంలను చేశారు. వేలాది మందిని ఎంపీలు, ఎమ్మెల్యేలుగా, కేంద్ర మంత్రులు, ప్రధాన మంత్రులుగా చేశారు. కానీ బీసీలు కనీసం సర్పంచులయితే కూడా ఈ అగ్రకుల నాయకులు ఓర్వలేక పోతున్నారు.

బీసీ సంక్షేమ సంఘం 1986లో పోరాడి బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పెట్టిస్తే ఓర్వలేని అగ్రకుల ప్రభుత్వాలు వీటిని 34 శాతం నుండి 22 శాతంకు తగ్గించారు. బీసీ కులాల జనాభా గ్రామీణ ప్రాంతాలలో 64 శాతం ఉంటే 22 శాతంకు రిజర్వేషన్లను తగ్గించడంలో ఏమైనా న్యాయం ఉందా! మొత్తం గ్రామ పంచాయతీలు 12,751 కాగా 56 శాతం జనాభా  గల బీసీలకు 6,822 గ్రామ పంచాయతీలు దక్కాలి. పోనీ గతంలో మాది రిగా 34 శాతం రిజర్వేషన్లు అమలు ప్రకారం 4,300 గ్రామపంచాయతీలు బీసీలకు దక్కాలి. కానీ బీసీ రిజర్వేషన్లు లెక్కించేటపుడు గిరిజనులకు కేటాయించిన రిజర్వేషన్లను కట్‌ చేసిన తర్వాత వచ్చే సంఖ్య ఆధారంగా లెక్కించి అన్యాయం చేశారు. దీనితో కేవలం 2,332 పంచాయితీలను మాత్రమే బీసీలకు కేటాయించారు. అంటే 18 శాతం కేటాయించి బీసీలకు అన్యాయం చేశారు.

రిజర్వేషన్లు తగ్గించడం వలన రెండు వేల గ్రామ సర్పంచులు, 23 వేల వార్డు మెంబర్లు బీసీలకు రావలసినవి దక్కకుండా పోయాయి. అలాగే జెడ్పీటీసీ, ఎంపీటీసీ, జిల్లా పరిషత్‌ చైర్మన్, మండల్‌ పరిషత్‌ చైర్మన్‌ పదవులను కూడా బీసీ రిజర్వేషన్లను తగ్గించి బీసీల నాయకత్వాన్ని ఉద్దేశపూర్వకంగా అణచివేశారు. రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో ఉన్న కేసును సమర్థిస్తూ వాదించవలసిన రాష్ట్ర ప్రభుత్వం కేసును ఉపసంహరించుకుంది. బి.సి రిజర్వేషన్లను 34 శాతం నుంచి 22 శాతంకు తగ్గించారు. 

మెడికల్‌ కౌన్సెలింగ్‌లో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా బి.సి రిజర్వేషన్లు సక్రమంగా అమలు చేయకుండా 550 జీవోకి గండి కొట్టారు. మెడికల్‌ కౌన్సెలింగ్‌ ఎంబీబీఎస్‌ అడ్మిషన్ల సందర్భంగా గత 20 ఏళ్లుగా పాటిస్తున్న జీవో నంబర్‌ 550 ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ జీవోకు సవరణ చేస్తూ 114 జీవో తెచ్చి రిజర్వేషన్‌ వర్గాలకు అన్యాయం చేశారు. రిజర్వేషన్లు సక్రమంగా అమలు చేయకుండా ఈ కులాలకు అన్యాయం చేస్తున్నారని, దీనిని సరిదిద్దాలని వైద్య శాఖ అధికారులను బీసీ సంఘాలు కోరగా, సీఎం కార్యాలయం వారు జోక్యం చేసుకొని బీసీలకు వ్యతిరేకంగా ఒత్తిడి తెచ్చి ఈ కులాలకు రిజర్వేషన్లను సక్రమంగా అమలు చేయకుండా అన్యాయం చేశారు.

దీని మూలంగా గత ఏడాది 262 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఎంబీబీఎస్‌ సీట్లు లభించకుండా అన్యాయం జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో రిజర్వేషన్లలో జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దాలని కోరగా వెంటనే సీఎం జగన్‌మోహన్‌రెడ్డి సరిదిద్దుతూ జీఓ నం. 56  జారీ చేశారు. తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా సరిదిద్దాలని కోరినా ఒక సంవత్సర కాలంగా గడిచిన రిజర్వేషన్ల అక్రమాలను సరిదిద్దడం లేదు. 

బీసీల విద్యా–ఉద్యోగ రిజర్వేషన్ల అమలుపై టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 2014లోనే క్రీమీలేయర్‌ నిబంధన విధించి అన్యాయం చేశారు. గత ప్రభుత్వాలు 1993 నుంచి అంటే దాదాపు 22 ఏళ్ల నుంచి క్రీమీలేయర్‌ పెట్టలేదు. క్రీమీలేయర్‌ విధించరాదని బీసీ సంఘాలు గత ప్రభుత్వాలను కోరితే ఆపివేశారు. కానీ, టీఆర్‌ఎస్‌ అదికారంలోకి రాగానే బీసీ వ్యతిరేకతను వెళ్ళగక్కుతోంది. క్రీమీలేయర్‌ నిబంధన విధించి బీసీ రిజర్వేషన్లు బీసీలకు దక్కకుండా అన్యాయం చేశారు. అన్ని వర్గాలకు పారిశ్రామిక పాలసీ ప్రకటించారు.

కానీ 52 శాతం జనాభా గల బీసీలకు పారిశ్రామిక పాలసీ ఇంతవరకు ప్రకటించలేదు, అంటే బీసీలు పరిశ్రమలు, కంపెనీలు పెట్టడం కూడా ఈ అగ్రకుల ప్రభుత్వాలు ఓర్వలేక పోతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పారిశ్రామిక పాలసీలో, కాంట్రాక్టులలో, నామినేటెడ్‌ పోస్టులలో బీసీలకు 50 శాతం కోటా ఇచ్చారు. కాని తెలంగాణలో మాత్రం ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారు.

డబుల్‌ బెడ్‌రూం పథకంలో ఇతర వర్గాలకు జనాభాకు మించి కోటా కేటాయిస్తూ జీఓ జారీ చేశారు. కానీ బీసీల జనాభా 52 శాతం ఉంటే డబుల్‌ బెడ్‌రూం పథకంలో 15 శాతం కేటాయించడం చూస్తే ఎంత అన్యాయం చేస్తున్నారో తెలుస్తుంది. ప్రస్తుతం బీసీలకు విద్యా– ఉద్యోగాలలో 29 శాతం రిజర్వేషన్లు కొనసాగుతున్నాయి. ఈ కోటా కూడా డబుల్‌ బెడ్‌ రూంలలో ఇవ్వకపోవడం చూస్తే పాలకుల బీసీ వ్యతిరేక వైఖరి స్పష్టంగా కన్పిస్తుంది.

సంక్షేమ అభివృద్ధి పథకాలలో, పేదరిక నిర్మూలన పథకాలలో సామాజిక వర్గాలకు జనాభా ప్రకారం కోటా ఇవ్వడం సంప్రదాయం. కానీ, ఇందుకు భిన్నంగా తగ్గించి ఇవ్వడం న్యాయమా? ఒకవైపు ఈ కులాలలో చైతన్యం పెరుగుతోంది. విద్యా, ఉద్యోగాలతో పాటు అన్ని రంగాలలో తమ వాటా తమ జనాభా ప్రకారం కావాలని గొంతెత్తి పోరాడుతున్నారు. కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు రిజర్వేషన్లకు గండికొట్టే ఆలోచనలకు వ్యతిరేకంగా బీసీ/ ఎస్సీ/ఎస్టీ వర్గాలు పోరాడకపోతే భవిష్యత్‌ అంధకారమౌతుంది.

వ్యాసకర్త
ఆర్‌. కృష్ణయ్య
అధ్యక్షులు, జాతీయ బి.సి. సంక్షేమ సంఘం

మొబైల్‌ : 90000 09164 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement