ప్రభుత్వ రంగంలో ప్రాంతీయ భాషా మాధ్యమాన్ని మార్పు చేయాలని తన భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ అనడం దేశవ్యాప్తంగా చర్చను రేకెత్తిస్తుంది. గ్రామస్థాయి వ్యవసాయ, చేతివృత్తుల సమాజాలకు చెందిన పిల్లలు తప్పనిసరై స్థానిక భాషల్లోనే చదువుకోవడం వల్ల అంతర్జాతీయ అవకాశాలకు దూరంగా ఉండిపోతున్నారు.
సంపన్నులు మాత్రమే అన్ని అవకాశాలను పొందగలిగే తరహా కొత్త భారతీయ వర్గ వ్యవస్థను ఇంగ్లిష్ విద్య అనుమతించకూడదు. భావజాలపరమైన నేతలందరూ ఈ విషయంలో విద్యా కపటత్వంతో వ్యవహరించారు. పేద, ధనిక పిల్లలందరూ ఒకే భాషా (ఇంగ్లిష్) విద్యను కలిగి ఉండాలని స్పష్టమైన వైఖరిని తీసుకోకుంటే మానవ సమానత్వం అనే లక్ష్యాన్ని భారతదేశం సాధించలేదు.
భారత్ జోడో యాత్రలో భాగంగా రాజ స్థాన్‌లోని ఆల్‌వర్‌లో ర్యాలీని ఉద్దేశించి రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ ఇలా చెప్పారు. ‘‘పాఠశాలల్లో ఇంగ్లిష్ బోధనను బీజేపీ నేతలు కోరుకోరు. కానీ ఆ పార్టీ నేతలందరి పిల్లలూ ఇంగ్లిష్ మీడియం పాఠశాలలకే వెళతారు. వాస్తవానికి పేద రైతులు, కూలీల పిల్లలు ఇంగ్లిష్ నేర్చుకోవాలనీ, పెద్ద కలలు కనాలనీ, వ్యవ సాయ పొలాల నుంచి బయటకు వెళ్లి జాతీయ వార్తల్లోకి వెళ్లాలనీ వారు కోరుకోవడం లేదు.
’’ ప్రభుత్వ పాఠశాలల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంగ్లిష్ మీడియం ప్రారంభించిన తర్వాత తెలంగాణ కూడా ఆ నమూనాను అనుసరించింది. భారత్ జోడో యాత్రలో భాగంగా మొదట దక్షిణ భారతదేశం నుంచి నడక ప్రారంభించిన రాహుల్ గాంధీ తర్వాత ఉత్తర భారత దేశంలో యాత్ర కొనసాగిం చారు. ఆ తర్వాత రాజస్థాన్‌లో ఇటీవలే పై ప్రకటన చేశారు.
ఢిల్లీ నుంచి, ఆర్‌ఎస్‌ఎస్–బీజేపీ విధానంగా హిందీని ముందుకు నెట్టాలని ప్రయత్నిస్తున్న నరేంద్రమోదీ, అమిత్ షాలకు వ్యతిరేకంగా ఒక జాతీయ నాయకుడు తొలిసారిగా స్థిరమైన వైఖరి తీసుకున్నారు. ఒకే దేశం, ఒకే భాష అనే ఆర్‌ఎస్‌ఎస్–బీజేపీ విధానంలో భాగంగానే వీరిద్దరూ పాఠశాల నుంచి విశ్వవిద్యాలయ విద్య దాకా ప్రభుత్వ రంగంలో హిందీ భాషను ముందుకు నెడుతున్నారు.
అదే సమ యంలో ప్రపంచ స్థాయి ఇంగ్లిష్ మీడియం విద్యను ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలు, విశ్వవిద్యాలయాలకు వదిలేస్తున్నారు. గ్రామస్థాయి వ్యవ సాయ, చేతివృత్తుల సమాజాలకు చెందిన పిల్లలు తప్పనిసరిగా స్థానిక భాషల్లోనే చదువుకోవడం వల్ల అంతర్జాతీయ అవకాశాలకు దూరంగా ఉండిపోతున్నారు.
పేద వ్యవసాయ కార్మికులు, కూలీల పిల్లలు కూడా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో చదువుకోవాలని రాహుల్ గాంధీ ఆ ర్యాలీలో చెప్పారు. రాజస్థాన్ ప్రభుత్వం కూడా మరిన్ని ఇంగ్లిష్ మీడియం స్కూళ్లను తెరవాలనీ, అప్పుడే పేద పిల్లలు పెద్ద కలలు కనగలరనీ అన్నారు. రాహుల్ గాంధీ ఇచ్చిన పిలుపు దేశవ్యాప్తంగా సమాన భాష, నాణ్యమైన స్కూల్ విద్యపై జాతీయ చర్చను రేకెత్తి స్తుంది. బీజేపీ, కమ్యూనిస్టు నాయకులను ఇది వణికిస్తుంది.
ఆర్‌ఎస్‌ఎస్–బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు అందరికీ సమాన మాధ్యమ విద్యను ఎన్నటికీ అమలుచేయవు. ఇక కమ్యూనిస్టులు పశ్చిమ బెంగాల్‌లో దాన్ని అమలు చేయలేదు. ఇప్పుడు కేరళలో కూడా అమలు చేయడం లేదు. ఆర్‌ఎస్‌ఎస్–బీజేపీలు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, మెడిసిన్, ఇంజినీ రింగ్ సహా ఉన్నత విద్యాసంస్థలను హిందీ మాధ్యమంలోకి మార్చేస్తు న్నాయి. అంటే పేదలకు స్పష్టమైన హిందీ దిశని ఇది చూపిస్తుంది.
నెహ్రూ హయాం నుండి అమలవుతూ వస్తున్న – ప్రైవేట్ రంగంలో ఇంగ్లిష్ మీడియం, ప్రభుత్వ రంగంలో ప్రాంతీయ భాషా మాధ్యమాన్ని మార్పు చేయాలని రాహుల్ గాంధీ ఇప్పుడు కోరు కుంటున్నారు. బ్రిటిష్ వారి నుంచి అప్పుడే స్వాతంత్య్రం సాధిం చడం, మత ఘర్షణల వాతావరణంలో ఇంగ్లిష్ వర్సెస్ హిందీని జాతీయ భాషా విధానంగా చేపట్టిన కాలంలో నెహ్రూ తొలి ప్రధానిగా గందరగోళంలో ఉండేవారు. కానీ అంబేడ్కర్ ఆ కాలంలోనే ఇంగ్లిష్ మాధ్యమ విద్యను కోరుకున్నారు.
అయితే ఆయన ప్రవేశపెట్టిన తీర్మానం రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ వల్ల ఒక్క ఓటు తేడాతో ఓడిపోయింది. కానీ అదే సమయంలో ప్రైవేట్ రంగంలో ఇంగ్లిష్ మీడియంను అలాగే ఉంచేశారు. అదే విధానాన్ని ఆర్‌ఎస్‌ఎస్–బీజేపీ నేతలు, కమ్యూనిస్టు నేతలు పాటించారు. భావజాలపరమైన నేతలం దరూ భాషకు సంబంధించిన ఈ విద్యా కపటత్వంతో ఉత్పాదక వర్గాల పిల్లలను పేలవమైన ప్రాంతీయ భాషా విద్యతో కూడిన ఆధునిక బానిసత్వ పరిస్థితుల్లో ఉంచేశారు. 2019లో ఏపీలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంను ప్రవేశపెట్టడం ద్వారా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మొట్టమొదటిసారిగా ఆ విద్యాపరమైన కపటత్వంపై దాడి చేశారు.
ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీల హిందీ విధానాన్ని వ్యతిరేకిస్తూ రాహుల్ గాంధీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం విద్యకు సంబంధించి స్పష్ట మైన వైఖరిని తీసుకున్నారు. కాబట్టే పార్టీ మేనిఫెస్టోలోనూ, 2024లో జరగబోయే జాతీయ ఎన్నికల ప్రచార కార్యక్రమంలోనూ నూతన విద్యా విధానాన్ని చొప్పించడానికి సంబంధించిన విధివిధానాలపై కృషి చేయవలసిందిగా జాతీయ నాయకత్వం అన్ని రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీ యూనిట్లను ఆదేశించింది.
హిందీ మాట్లాడే రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు ప్రభుత్వ రంగ విద్యా విధానంలో, ప్రస్తుత హిందీ మీడియంలో చదువుతున్న శూద్ర, దళిత, ఆదివాసీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాల్సి ఉంటుంది. ఉత్తరప్రదేశ్‌లో అఖిలేశ్ యాదవ్, బిహార్‌లో నితీశ్ కుమార్, తేజస్విని యాదవ్, మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ నేతలు, ఇంకా ప్రాంతీయ పార్టీల నేతలు... ప్రత్యేకించి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంకు సంబంధించి తమదైన విద్యా విధానంతో ముందుకు రావలసి ఉంది.
ఈ ప్రాంతీయ పార్టీలు చాలావరకు తమ కుటుంబాల్లోని పిల్లలను ప్రైవేట్ ఇంగ్లిష్ మీడియం స్కూళ్లలో చేరుస్తూనే, మరోవైపు హిందీ భాషా దురహంకారంలో కూరుకుపోయి ఉంటున్నాయి. నాణ్యమైన ఇంగ్లిష్ మీడియం స్కూల్, కాలేజీ విద్యపై ఈ ప్రాంతీయ పార్టీలు రాష్ట్ర బడ్జెట్‌లో హేతుపూర్వకమైన మొత్తంలో కూడా ఖర్చుపెట్టడం లేదు.
రాజకీయ పార్టీలతోపాటు దేశంలో అనేక ప్రభుత్వేతర, పార్టీయే తర సంస్థలు ఉంటున్నాయి. ఇలాంటి సంస్థల్లోని కీలక సభ్యులందరూ తమ పిల్లలను ప్రైవేట్ మీడియం పాఠశాలల్లో చదివిస్తుంటారు. కానీ ప్రాంతీయ భాషా ప్రభుత్వ పాఠశాలల గురించి మౌనం పాటిస్తుం టారు. పేద, ధనిక పిల్లలందరూ ఒకే భాషా (ఇంగ్లిష్) విద్యనూ, రెండో భాషగా తమ మాతృభాషనూ పొందే హక్కును కలిగి ఉండా లని రాజకీయ పార్టీలు, పౌర సమాజంలోని కీలక శక్తులు ఒక స్పష్ట మైన వైఖరిని తీసుకోకుంటే మానవ సమానత్వం అనే లక్ష్యాన్ని భారతదేశం సాధించలేదు.
ప్రపంచంతో మాట్లాడగల హక్కు, ప్రపంచం అందించే ప్రతి అవ కాశాన్ని పొందే హక్కు... దేశంలోని ఏ కుటుంబంలో లేదా కులంలో పుట్టినా సరే... పిల్లలందరికీ హక్కుగా ఉండాలి. సంపన్నులు అన్ని అవకాశాలు పొందుతూ, అన్ని విజ్ఞాన నిర్మాణాలను పొందగలిగే తరహా కొత్త భారతీయ వర్గ వ్యవస్థను ఇంగ్లిష్ విద్య అనుమతించ కూడదు. వర్గ వ్యవస్థను రద్దు చేయడానికి ప్రజలను సమీకరించే కమ్యూనిస్టు నేతలు ఇన్ని సంవత్సరాలుగా విద్యా సమానత్వం విష యంలో కపటధారుల్లాగా కొనసాగటానికి బదులుగా ఈ అంశాన్ని చేపట్టాల్సి ఉంటుంది.
ఆర్‌ఎస్‌ఎస్–బీజేపీ నేతలు ఈ సమస్య విషయంలో రాహుల్ గాంధీని ఏమాత్రం ఎదుర్కోలేరు. ఎందుకంటే వీరందరూ తమ పిల్లలను ఇంగ్లిష్ మీడియం ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీ ల్లోనే చేర్పించారని ఆయన స్పష్టంగా చెప్పారు. గడ్డం తీసుకోకుండా, పొడవాటి గడ్డంతో కనిపిస్తున్న రాహుల్ గాంధీ ఒక మునిలాగా కాకుండా విద్యలో సమానత్వాన్ని వ్యాపింపజేయడానికి సిద్ధమవు తున్న పేద రైతులా కనిపిస్తున్నారు.
ఆధునిక ప్రజాస్వామ్య దేశంలో ప్రేమను, శాంతిని, సమైక్య జీవితాన్ని పంచిపెట్టాలంటే ఆత్మన్యూ నతా భావం, ఆత్మాధిక్యతా భావం లేకుండా ప్రతి ఒక్కరూ మాట్లాడు కునే భాషను కలిగి ఉండటం మొట్టమొదటి అవసరంగా ఉంటుంది. రాహుల్ సాగిస్తున్న భారత్ జోడో యాత్ర– భవిష్యత్తులో పిల్లలం దరికీ అందుబాటులో ఉండే జాతీయ భాషగా ఇంగ్లిష్‌ను స్వీకరించేలా ప్రతి ఒక్కరినీ కలుపుతుందని ఆశిద్దాం!
ప్రొ‘‘ కంచ ఐలయ్య
షెపర్డ్
వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త
Comments
Please login to add a commentAdd a comment