శాస్త్ర, సాంకేతిక రంగాల్లో అసమాన ప్రతిభ కనబర్చి, ‘భారత రత్నం’గా భాసించిన ఎ.పి.జె. అబ్దుల్ కలాం భారతీయతకు నిలువెత్తు ఉదాహరణ. ఇతర మతాల పట్ల సామరస్య ధోరణితో ఉండడం తండ్రి నుండి ఆయనకు అబ్బింది. ‘గొప్పవారికి మతం స్నేహితులను అందించే ఒక మార్గం. అల్పులకు మతం ఘర్షణలకు ఒక కారణం’ అనేవారు కలాం. ఆధ్యాత్మికత కలాం జీవితమంతా ఆయనతో పాటే కొనసాగింది. ‘ట్రాన్సిడెన్స్: మై స్పిరిచ్యువల్ ఎక్స్‌పీరియెన్సెస్ విత్ ప్రముఖ్ స్వామీజీ’ పుస్తకంలో తన ఆధ్యాత్మిక యాత్రను వివరించారు. స్వామి నారాయణ సంప్రదాయానికి చెందిన ప్రముఖ్ స్వామీజీని తన ఆధ్యాత్మిక గురువుగా ఆయన భావించేవారు. న్యూఢిల్లీలో 2001 జూన్ 30న మొదటిసారి స్వామీజీని కలిసినప్పుడే కలాం ఆయనపట్ల ఆకర్షితులయ్యారు. ఆ తర్వాతి సంవత్సరం సెప్టెంబరులో అక్షరధావ్‌ుపై ఉగ్రవాదులు దాడి చేసినప్పుడు, ఆ దాడికి పాల్పడిన ఉగ్రవాదులతో సహా అందరూ క్షేమంగా ఉండాలని ప్రముఖ్ స్వామీజీ ప్రార్థించడం కలాంను కదిలించింది. దేవుడి కక్ష్యలోకి తనను ప్రవేశ పెట్టిన మహిమాన్వితుడిగా స్వామీజీని ఆయన పేర్కొన్నారు.
ఐదు అంశాల్లో అభివృద్ధి వల్ల దేశం పురోగమిస్తుందని కలాం భావించేవారు. 1. వ్యవసాయం, ఆహారం. 2. విద్య, వైద్యం. 3. సమాచార సాంకేతికత. 4. విద్యుత్తు, రవాణా, మౌలిక వసతులు. 5. క్లిష్టమైన సాంకేతిక విషయాల్లో స్వావలంబన. వీటికి ప్రముఖ్ స్వామీజీ ఆరో అంశాన్ని చేర్చారు. నేరం, అవినీతిలతో కల్మషమైన ప్రపంచానికి ఆధ్యాత్మికతను అందజేయడం. ఇదే కలాం ఆధ్యాత్మిక దృక్కోణమైంది. లీడ్ ఇండియా కార్యక్రమం కలాం ఆశయాలకు అద్దం పట్టింది. యువతలో ఉత్తమ ఆలోచనలను పాదుకొల్పడం దీని ముఖ్య ఉద్దేశ్యం. దీంట్లో భాగంగా వేలాది విద్యార్థులను స్వయంగా కలిసి, సంభాషించారు. కలాం నేర్పిన జీవన మంత్రాన్ని మరోసారి విద్యార్థులు, యువత గుర్తుకు తెచ్చుకోవాలి. (నేడు అబ్దుల్ కలాం 89వ జయంతి)
-డా. రాయారావు సూర్యప్రకాశ్‌రావు ‘ మొబైల్ 94410 46839
Comments
Please login to add a commentAdd a comment