పొంచివున్న చైనా కొత్త ముప్పు | Sakshi Guest Column On New Intercontinental Ballistic Missile Silos In China | Sakshi
Sakshi News home page

China: పొంచివున్న చైనా కొత్త ముప్పు

Published Fri, Jul 9 2021 1:35 AM | Last Updated on Fri, Jul 9 2021 10:05 AM

Sakshi Guest Column On New Intercontinental Ballistic Missile Silos In China

చైనాలోని గన్సు ప్రావిన్స్‌లో 119 అధునాతనమైన భూగర్భ క్షిపణి వేదికల ప్రయోగ కేంద్రాలను చైనా నిర్మిస్తున్నట్లు మోంటెరీలోని జేమ్స్‌ మార్టిన్‌ అణుపరీక్షల నిషేధ అధ్యయన సంస్థకు చెందిన పరిశోధకులు కనుగొన్నారు. చైనా నిర్మిస్తున్న అత్యధునాతనమైన డీఎఫ్‌–41 అనే పేరున్న ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణుల నిల్వ కేంద్రాలుగా ఈ నిర్మాణాలను ఉపయోగించవచ్చు. ఈ క్షిపణుల పరిధి 15,000 కిలోమీటర్లు. ప్రపంచంలో ఏ ప్రాంతాన్నయినా ఇవి ధ్వంసం చేయగలవు. ఇప్పటికే ఉనికిలో ఉన్న అణ్వాయుధాల వ్యవస్థలో భారీ పెట్టుబడులు పెట్టడం ద్వారా, ఆమెరికా అణ్వాయుధ ఆధిక్యతను ఎదుర్కోవాలనే ప్రయత్నంలో భాగంగా చైనా ఈ భూగర్భ క్షిపణి ప్రయోగ కేంద్రాలను నిర్మిస్తున్నట్లు అంచనా. ఈ పరిణామాలన్నింటినీ మూడు కారణాల వల్ల భారత ప్రభుత్వం పరిశీలించాల్సి ఉంది.

మొదటగా, అమెరికా, చైనా మధ్య పోటీ... అంతర్జాతీయ రాజకీయాల్లో అణ్వాయుధాల పాత్రకు అత్యంత ప్రాధాన్యత కలిగించనుంది. అణ్వాయుధాలు దేశాల మధ్య యుద్ధం విషయంలో మహా సమానత (ఈక్విలైజర్‌)ను ఏర్పర్చేవని చెబుతుంటారు. ఎందుకంటే శక్తిలేని దేశాల చేతికి చిన్నస్థాయి అణ్వాయుధం వచ్చినా సరే.. బలమైన శత్రుదేశాలను అది అడ్డుకోగలదు. భారతగడ్డపై అతిపెద్ద సంప్రదాయ ఆయుధాలతో దాడులు జరిపించిన తర్వాత కూడా భారత్‌ నుంచి భారీ ప్రతీకార దాడులతో దెబ్బతినకుండా పాకిస్తాన్‌ను కాపాడింది.. అది సేకరించి పెట్టుకున్న అణ్వాయుధాలేనని చెప్పాలి. భారత్, చైనా వివాదాల్లో అణ్వాయుధాల ప్రభావం తక్కువే కానీ, భారత్‌ కూడా అణ్వాయుధాలను సాధించినప్పటినుంచి, చైనా 1962 నాటి సైనిక విజయాలను ఇకపై కొనసాగిస్తుందని ఊహించడానికి కూడా సాధ్యం కాకుండా పోయింది.

అణ్వాయుధాలు చిన్నస్థాయి విజయాలు తెచ్చిపెడతాయనే అంశాన్ని తోసిపుచ్చలేం. అయితే బాలిస్టిక్‌ క్షిపణులలో అత్యంత కచ్చితత్వం విషయంలో సాధించిన విప్లవం కానీ, ఉపగ్రహ ఛాయాచిత్రాల్లో రిజల్యూషన్‌ పెరగడం, అత్యంత తక్కువ ధ్వనితో ప్రయాణించే జలాంతర్గాములను కనుగొనడంలో సాధించిన నైపుణ్యం కానీ, అణ్వాయుధాలను సాధించడంద్వారా శక్తిహీనమైన దేశాలు పొందిన ఈ మహా సమానత అవకాశాన్ని తోసిపుచ్చాయి. అమెరికా వంటి సాంకేతికంగా సంపన్న దేశాలు ఇప్పుడు తమ ప్రత్యర్థి దేశాల అణ్వాయుధ శక్తులను సులభంగా కనుగొనేలా తమ ఉపగ్రహాలను ఉపయోగించగలవు. అంతేకాకుండా కఠినతరమైన ఆయుధ షెల్టర్లను కూడా ధ్వంసం చేసే అత్యంత నిర్దిష్టమైన క్షిపణులను ఇవి ప్రయోగించగలవు.

అమెరికా సాంకేతిక ఆధిపత్యం ముందు తాను నిలబడలేనని చైనా గుర్తించిన తర్వాతే అనేక ప్రతిఘటనా వ్యవస్థల నిర్మాణం వైపు చైనా పురోగమించింది. భూగర్భ క్షిపణి ప్రయోగ కేంద్రాలు కూడా దాంట్లో భాగమే. భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్తాన్, చైనాకు వ్యతిరేకంగా భారత్‌ కూడా ఈ కోవలోనే సాగే అవకాశం ఉంది. చైనా అణ్వాయుధాల దుర్భేద్యం అనేది భారత్‌కి శుభసూచకం కాకపోవచ్చు. ఎందుకంటే, చైనా అణ్వాయుధాలు అమెరికా రక్షణకే ప్రమాదం అనుకున్నప్పుడు, దాంతో పోలిస్తే భారత్‌కు మరీ ప్రమాదకరం. భారతీయ జలాంతర్గాములను నిర్మూలించ డానికి హిందూ మహాసముద్రంపై అణ్వాయుధాలతో కూడిన జలాంతర్గాములను మోహరించే లక్ష్యంతో.. అధునాతన కౌంటర్‌ ఫోర్స్‌ ప్లాట్‌ఫామ్‌లపై పెట్టుబడి పెట్టాలని చైనా నిర్ణయించుకుంటే అది భారత్‌కు నిజంగా ప్రమాదకరమే. 

శత్రుదాడులనుంచి తట్టుకోగల అణ్వాయుధ శక్తిని చైనా మోహరించగలదా లేదా అనే అంశంపై నిపుణులకు భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణులపై పెట్టుబడి పెట్టిన చైనాకు పూర్తి రక్షణతో కూడిన అణ్వాయుధ శక్తిని నిర్మించుకునే సామర్థ్యం ఉంటుందని కొందరు అణ్వాయుధ నిపుణులు చెబుతుండగా, మరికొందరు నిపుణులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఒకే ఒక్క స్పష్టమైన దాడితో చైనావద్ద ఉన్న దీర్ఘ శ్రేణి క్షిపణులను తుడిచిపెట్టగలనని అమెరికా నమ్ముతున్నట్లయితే, అవసరమైతే ఆ దేశం అంత పనీ చేయగలుగుతుంది. ప్రత్యేకించి అమెరికా నగరాలను ధ్వంసం చేయగల అణ్వాయుధాన్ని మొట్టమొదటగా చైనా ప్రయోగించే ప్రమాదం ఉందని అమెరికా భావిస్తోంది.

చైనాపై భారీస్థాయి అణుదాడికి పూనుకోవాలని అమెరికా నిర్ణయించి ఒకమేరకు ఆ ప్రయత్నంలో విజయం సాధించిన పక్షంలో, చైనా వద్ద మిగిలి ఉన్న మధ్య, స్వల్ప శ్రేణి క్షిపణులు అమెరికాతోపాటు జపాన్, దక్షిణ కొరియా, భారత్‌ వంటి దాని వ్యూహాత్మక భాగస్వామ్య దేశాలను కూడా చేరుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. అమెరికా ప్రత్యర్థులు దీర్ఘ శ్రేణి క్షిపణులను సేకరించి పెట్టుకున్న ప్పుడు, అణ్వాయుధాల ప్రయోగం నుంచి తన మిత్రదేశాలకు అమెరికా కల్పించే రక్షణ ఛత్రం బలహీనపడిపోతుందని కొందరు వాదిస్తున్నారు. ఎందుకంటే అమెరికా ప్రభుత్వం తన మిత్రదేశాలకు అనుకూలంగా జోక్యం చేసుకోవాలని నిర్ణయించుకుంటే, దాని ప్రత్యర్థులు నేరుగా అమెరికా భూభాగంపైనే దాడికి దిగే అవకాశం ఉంది.

అణ్వాయుధాల ప్రయోగం నుంచి బయటపడే పద్ధతి కొన్ని అంశాలతో ముడిపడి ఉంటుంది. అమెరికాకు చెందిన క్షిపణి రక్షణ వ్యవస్థల, ఎదురుదాడి ప్రమాదంతో చైనా వ్యవహరించాల్సి వచ్చినప్పుడు భూగర్భ క్షిపణి వ్యవస్థలను నిర్మించతలపెట్టడం కాస్త ఆశ్చర్యం కలిగించకమానదు. ఒకే చోట స్థిరంగా ఉంచిన ఈ తరహా క్షిపణులను రాడార్‌ ఉపగ్రహాలను ఉపయోగించి రాత్రింబవళ్లు పర్యవేక్షించవచ్చు. బహుశా అమెరికా అణ్వాయుధ దాడిని సంక్లిష్టం చేయడానికి తన భూగర్భ క్షిపణి వ్యవస్థలను చైనా అటూఇటూ తరలించే ప్రయత్నం చేయవచ్చు లేక వీటిలో కొన్నింటిని డమ్మీలుగా ఉపయోగించవచ్చు. ఒకే సమయంలో అసలు క్షిపణి వ్యవస్థలను, వీటిని కూడా ఉపయోగించవచ్చు.

తీవ్రస్థాయిలో ఎదురుదాడి సామర్థ్యం కలిగిన బలమైన ప్రత్యర్థులతో ప్రభుత్వాలు ఎలా వ్యవహరిస్తాయి అనే విషయంలో చైనా ఒక ఉదాహరణగా నిలుస్తోంది. భారత్‌ వద్ద ఉన్న ఎదురుదాడి క్షిపణి వ్యవస్థలను పాకిస్తాన్‌ ఎదుర్కొవలసి వస్తున్నప్పటికీ భూగర్భ క్షిపణి వ్యవస్థల విషయంలో చైనా అనుసరిస్తున్న పద్ధతిని పాక్‌ పాటించకపోవచ్చు. ఎందుకంటే చైనా లాగా కాకుండా, పాక్‌ సైన్యం అణ్వాయుధాలపై అధికంగా నియంత్రణ కలిగి వుంది. పైగా అమెరికాతో ఘర్షించే పరిస్థితులు చాలా ఎక్కువగా ఉన్నాయని చైనా గ్రహిస్తున్నందువల్లే భూగర్భ క్షిపణి వ్యవస్థల నిర్మాణం దిశగా ప్రయత్నాలు చేస్తోంది. ఇదే భారత్‌పై, దాని విదేశాంగ విధానంపై అనేక ప్రభావాలను కలిగిస్తోంది.

చైనా ఇంతకుముందు కూడా భూగర్భ క్షిపణి వ్యవస్థలను కలిగి ఉండేది కానీ ఇంత పెద్ద స్థాయిలో నిర్మించటం గతంలో ఎన్నడూ లేదు. ఈ నూతన పరిణామాలను భారత్‌ నిశితంగా పరిశీలించాల్సి ఉంది. ఎందుకంటే అణ్వాయుధాల భవిష్యత్తు మొదలుకుని, ఇండో–పసిఫిక్‌ ప్రాంతంలో యుద్ధం జరిగి అవకాశం వరకు అన్నింటిపై వీటి ప్రభావం తప్పక ఉంటుంది.
కునాల్‌ సింగ్, పీహెచ్‌డీ స్కాలర్‌
మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement