‘మణి’తో చెదురు మధుర మెమొరీస్‌ | Sakshi Guest Column On SP Balasubrahmanyam | Sakshi
Sakshi News home page

‘మణి’తో చెదురు మధుర మెమొరీస్‌

Published Sun, Jun 4 2023 12:46 AM | Last Updated on Sun, Jun 4 2023 12:46 AM

Sakshi Guest Column On SP Balasubrahmanyam

మా చిన్ననాటి నెల్లూరు స్నేహితులు ఏ పేరుతో పలకరిస్తే తను పులకరిస్తాడో ఆ ముద్దుపేరే ‘మణి’.  సినిమా వాళ్ళు  పిల్చుకున్న పేరు బాలూ. వెరసి యస్పీ ‘బాలు’ సుబ్ర‘మణి’యం అయ్యాడు. తనతో నాకా రోజుల్నుంచే పరిచయం ఏర్పడి అది స్నేహంగా మారి, బంధమవడానికి మూల కారకుడు – కారణజన్ముడు మహమ్మద్‌ రఫీ. ఇక మేం వయసులో ఎదిగే కొద్దీ మా దారులూ, రహదారులూ, రహసందులూ వేరయ్యాయి.

నేనేమో డాక్టరీ చదివి చెవి, ముక్కు, గొంతు స్పెషలిస్ట్‌నయ్యాను. తనేమో ఆ మూడు అంగాల్లో గొంతును ఎన్నుకొని దాన్ని ఎన్ని మెలికలు తిప్పాలో తిప్పి, డాక్టరేట్లూ, పాటలకి మంచి రేట్లూ సంపాదించుకుంట, చివరికి ‘పద్మభూషణ్‌’ దగ్గర ఆగాడు. నేనేమో నా  పేషెంట్ల గూబల్ని గుయ్యిమనిపిస్తూ వైద్యం చేసుకుంటుంటే తనేమో శ్రోతల చెవుల్లోని కర్ణభేరులకు తన శ్రావ్యమైన గొంతుతో సాంత్వన కలిగించేవాడు. 

సింగర్‌గా తొలిరోజుల్లో తను పాడిన సినిమా పాటలు నాలుగైదు మట్టి రికార్డులుగా హెచ్‌.ఎం.వి. వారు మార్కెట్లోకి వదలగానే వాటిని చూసుకొని మురిసిపోయి, సన్నగా రివటలా ఉన్న మనిషి కాస్తా శారీరకంగా ఉబ్బి, మానసికంగా తబ్బిబై్బ పోయాడు. బాడీ షేమింగ్‌ చెయ్యడానికి రౌడీమూక రెడీ అవుతుందని ముందే పసిగట్టి, వాళ్ళ కంటే ముందు తన మీద తనే జోకులేసుకోవడం మొదలెట్టాడు. వేదిక మీద ప్రోగ్రామ్స్‌ చేస్తున్నప్పుడు  ‘ఈ భారీకాయాన్ని దొర్లించుకుంటూ రావడంలో మీ కంటే వెనుకబడిపోయాను’ లాంటి జోకులు వేసుకుంటే ఇక అవతల వాళ్ళకేం మిగిలిందని! అందుకనే నేను అతనికి పెట్టిన పేరు ‘జోకులపతి ఫన్‌డితారాధ్యుల శుభ్రహాస్య గోలసుబ్రమణ్యం’.

ఓసారి నాకు ఫోన్‌ చేసి ‘ఫలానా మన కామన్‌ ఫ్రెండ్‌కి మీ మున్సిపాలిటీలో ఏదో సర్టిఫికేట్‌ కావాలట. ఆ ఫ్రూఫ్‌లేవో పంపుతాడు. నువ్‌ కాస్త ఫాలోఅప్‌ చెయ్‌. మొన్న నేను కచ్చేరీకి వచ్చినప్పుడు ఎవరో వచ్చి కలిశారు. మేయరట. ఆ నంబర్‌ తెలుసుకుని నాకు పంపించు. నేనూ ఫోన్‌ చేసి రిక్వెస్ట్‌ చేస్తాను’ అన్నాడు.

‘మేయరా? నేన్నమ్మను గాక నమ్మను’ అన్నాను. ‘ఏం? నా ఫ్యానై ఉండకూడదా? ఇందులో నమ్మకపోవడానికేముంది?’ అన్నాడు. ‘నా పర్సనల్‌ అనుభవంతో చెప్తున్నాను, అక్కడ మెజా రిటీ వాళ్ళు మేస్తారు మేస్తారు మేస్తారు’. 

మణీ, నేనూ కలిసి ఎన్నోసార్లు వేదికలెక్కి నాటిక ప్రదర్శనల్లో పాల్గొన్నాం. ఓ సంవత్సరం ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌కి మైమ్‌ ప్రదర్శన. నటి రేవతి యాంకరింగ్‌. ప్రేక్షకుల్లో టాలీ, కోలీ, బాలీవుడ్‌ సెలబ్రిటీస్‌ ఎందరో! కల్పనా అయ్యర్‌ డాన్స్‌ మొదలైంది. తర్వాత మా ‘వైద్యోనారాయణో హరీ’ మ్యూజిమైమ్‌. సైడ్‌వింగ్‌లో మేకప్పు లతో రెడీగావున్నాం. అప్పుడు చూసుకుంటే బాలు తెల్లకోటు (ఆప్రన్‌) మర్చిపోయి వచ్చాడు. అందులో మేమిద్దరం డాక్టర్లం. ఏదో కామెడీగా ఆపరేషన్‌ చేసే సీను.

ఒక్కసారి నాకైతే గుండెల్లో గుదిబండ పడ్డట్టయింది.  ‘ఏం వర్రీకాకు. నువ్వు డాక్టర్‌ పాత్ర కంటిన్యూ చెయ్‌. నేన్నీ పక్కన కంపౌడర్‌గా మారిపోతాన’ని అప్పటికప్పుడు ప్యాంటు  మోకాలు వరకూ మడిచి, చొక్కా పై బటన్స్‌ రెండు విప్పేసి రెడీ అయిపోయాడు. ప్రదర్శన బ్రహ్మాండంగా వచ్చింది. అలా మేం తెరవేయగానే వేదిక వెనక్కి వచ్చిన దర్శకుడు బాలచందర్, మణితో ‘నీకొక కథ రెడీ చేసుకోబోతున్నాను.

అందులో హీరో నువ్వే. నేను చెప్పినప్పుడు డేట్స్‌ యివ్వు’ అనేసి వెళ్ళిపోయారు. తర్వాత అది నిజంగానే కార్య రూపం దాల్చి తమిళంలో వసంత్‌ అనే తన అసిస్టెంట్‌తో దర్శ కత్వం చేయించారు బాలచందర్‌ ‘కేలడి కన్మణి’ (ఇందులోనూ మణి ఉంది గమనించారా). పెద్ద హిట్టయింది. 

ఓ ఉదయం తిరుపతి నుంచి మెడ్రాస్‌ కార్లో వెళ్తూ బోర్‌ కొట్టి ‘వీడు అర్ధరాత్రీ అపరాత్రీ ఫోన్‌లు చేసి డోకులొచ్చే జోకులేసి విసి గించేస్తుంటాడు కదా ఇప్పుడైతే ఒ.పి.లో పేషెంట్లతో మాంచి బిజీగా ఉంటాడు కదా? డయల్‌ చేసి యివ్వు  కాలెత్తాడంటే అయిపోయాడే’ అని తన పి.ఎ. విఠల్‌తో అన్నాడట. తర్వా తెప్పుడో నాకు చెప్పారు. సరే, ఇక్కడ నా ఫోన్‌ మోగింది. 

‘ఏం చేస్తున్నావ్‌’ అట్నుంచి మణి గొంతు.‘ప్రాక్టీస్‌ చేస్తున్నాను. ఇంకేం చేస్తాను గురూ’ అన్నాను. ‘అదే. ఎన్నో ఏళ్ళ నుండి నిన్నెప్పుడడిగినా ప్రాక్టీస్‌ అనే అంటావు. మరి పర్‌ఫెక్ట్‌ అయ్యేదెప్పుడు? ప్రాక్టీస్‌ మేక్స్‌ ఎ మాన్‌ పర్‌ఫెక్ట్‌ అంటారు గదా. అంటే నువ్‌ ప్రాక్టీస్‌ సరిగ్గా చెయ్యడం లేదన్నమాటేగా. ఇప్పుడు నేను న్నాననుకో పాట ప్రాక్టీస్‌ చేస్తాను. పర్‌ఫెక్ట్‌ అయ్యాకే రికార్డింగ్‌ చేస్తారు. అలా నువ్వూ పెర్‌ఫెక్ట్‌ అవ్వాలని నా ఆశ’... ఇలా సాగి పోయింది వరుస. 

కాసేపు కామెడీ పక్కన బెడ్తే మీతో పంచుకోవలసిన మరో గొప్ప విషయాన్ని నా బీరువా అరల్లోంచి బైటికి తీస్తాను. కాకినాడలో నేను ఫైనలియర్‌ యమ్‌బీబీయస్‌ చదువుతున్న రోజుల్లో కొవ్వూరు నుంచి ఇక్కడికి వలసొచ్చిన ఓ భారీ నంబరు మెంబర్లున్న ఫ్యామిలీతో పరిచయమైంది. ప్రతి రాత్రీ వాళ్ళొచ్చి నా బేచిలర్‌ రూమ్‌లో సంగీత సాహిత్య సమలంకృత సద్గోష్ఠి జరుపుతుండేవారు. ఆ అన్నదమ్ముల్లో ఒకాయన కొడుకు వయొ లిన్‌ అద్భుతంగా వాయించేవాడు.

అతనికప్పుడు ఇంకా నిక్కర్ల వయసే! అతన్ని సినిమాల్లోకి పంపించాలనే ఉద్దేశంతో ముందో సారి బాలూకి పరిచయం చెయ్యమని నన్నడిగారు. నేనా కుర్రాడ్ని మద్రాస్లో మణి యింటికి తీసుకెళ్తే ఆ రాత్రి రెండు కీర్తనలు వింటే చాలనుకున్న బాలూకి ఇరవై రెండయినా తన్మయత్వం విడలేదు. అతిశయోక్తి కాదనుకుంటే ఆ రాత్రి అదే ఐ మీన్‌ తెల్లవారు జాము వరకూ రెండొందల రెండయినా అయ్యుంటాయి. చివర్న చేతు ల్నిండుగా చప్పట్లుకొట్టి ‘వెరీగ్రేట్‌. ఎలాంటి చైల్డ్‌ ప్రాడిజీని తీసు కొచ్చావ్‌! సంగీత ప్రపంచంలో ఇతనే హైట్స్‌కి వెళ్ళిపోతాడో నేనూహించలేను. గాడ్‌ బ్లెస్‌ యు’ అన్నాడు. ఆ కుర్రాడి పేరు – కీరవాణి.

కీరవాణికి ఆస్కారకుడూ, ఆస్కారణ భూతుడైన∙రాజమౌళి కప్పుడు బహుశా రెండో, మూడో, ఏడో ఏడు. చాలాసార్లు వేదికల మీద  కీరవాణి ప్రసక్తి వచ్చినప్పుడు మణి ‘నా ఫ్రెండ్‌ దివాకర్‌ నాకు మొట్టమొదట పరిచయం చేశాడు’ అంటుండేవాడు నేను గర్వపడేలాగ. తీరా ఇవ్వాళ కీరవాణి ఆస్కార్‌ పట్టుకొచ్చిన వేళకు, ముందే కూసిన కోయిలలా, కంగ్రాట్స్‌ చెప్పకుండానే, కంగారుపడి, కాయం చాలించి, కాలం చేసి, కీర్తిశేషుడయ్యడు బాలూ! నాకెంతో ఆప్తుడు, మనందరికీ ఇష్టుడైన మణి / బాలూకి ఈ డెబ్భయ్‌ ఏడవ జన్మదినాన ఈ భూగోళం ఉన్నంత కాలం బిలియన్స్‌ అండ్‌ ట్రిలియన్స్‌ ఆఫ్‌ మెమొరబుల్‌ రిటర్న్స్‌ ఆఫ్‌ ది డే.
డా‘‘ వై. దివాకర రావు 
వ్యాసకర్త ప్రముఖ ఈఎన్‌టీ స్పెషలిస్టు, కాకినాడ
మొబైల్‌: 94403 40484

(నేడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జయంతి) 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement