సుమారు 46,000 మందిని బలిగొన్న టర్కీ భూకంపంలో ఇంతటి భారీ ప్రాణనష్టాన్ని నివారించేందుకు అవకాశం ఉండిందా? దాదాపు టర్కీ మొత్తం భూకంప ప్రమాద పరిధిలోనే ఉన్నప్పటికీ, ప్రభుత్వంలోని విపరీతమైన అవినీతి ఫలితంగా భవన నిర్మాణ నియంత్రణలు అమల్లోకి రాలేదు. భవిష్యత్తులో వచ్చే భూకంపాలను సమర్థంగా ఎదుర్కొనేందుకని ‘భూకంప పన్ను’ కూడా వసూలు చేశారు. ఆ మొత్తాన్ని ఎలా ఖర్చు పెట్టారన్న విషయంలో అనేక ప్రశ్నలున్నాయి. ఈ మొత్తాన్నీ గమనిస్తే ఒక విషయం స్పష్టమవుతోంది. భూకంప ముప్పును ఎదుర్కొనే విషయంలో టర్కీ వద్ద ఉన్న జ్ఞానానికీ, ఆచరణకూ మధ్య అంతరం ఉంది.
ఇలాంటి విధ్వంసానికి సన్నద్ధంగా ఉండటం అసంభవం.’’ ఫిబ్రవరి ఆరున టర్కీని భారీ భూకంపం తాకిన రెండు రోజులకు అత్యంత దారుణంగా దెబ్బతిన్న ప్రాంతంలో పర్యటించిన తర్వాత ఆ దేశ అధ్యక్షుడు రీజెప్ తాయిప్ ఎర్డోగాన్ చేసిన వ్యాఖ్య ఇది. నిజంగానే ఇంతటి విధ్వంసపు స్థాయి ఇంతకుముందు చూడనిదే. తెలతెల వారుతూండగానే 7.8 తీవ్రతతో భూకంపం రావడం, వేల మందిని బలితీసుకోవడం ఘోరమే. (సుమారు 46,000 మంది చనిపోయారని అంచనా.)
అత్యంత హృదయ విదారకమైన ప్రకృతి వైపరీత్యాల్లో ఇదీ ఒకటి. అయితే, ఇంతటి ప్రాణనష్టాన్ని, ఆస్తి నష్టాన్ని నివారించేందుకు అవకాశం ఉండిందా? పూర్తిగా కాకపోయినా పాక్షికంగానైనా తగ్గించే వీలు లేకపోయిందా? అసాధ్యమని ఎవరైనా చెబితే అది రాజకీయ ప్రకటనే అవుతుంది. టర్కీకి భూకంపం ముప్పు ఉందని తెలిసినా అందుకు సన్నద్ధంగా లేకపోవడం కచ్చితంగా ఓ వైరుధ్యమే.
చేజారిన అవకాశాలు
భూకంప ముప్పునకు సంబంధించి టర్కీ ఒక మ్యాపును రూపొందించింది. 2018 లోనే దీన్ని సమీక్షించి, మార్పులు చేర్పులు చేసి ప్రచురించారు కూడా. దాని ప్రకారం దాదాపు దేశం మొత్తానికి భూకంప ప్రమాదం ఉంది. తూర్పు అనతోలియా ఫాల్ట్ జోన్, ఉత్తర అన తోలియా ఫాల్ట్ జోన్ రెండూ దేశాన్ని అల్లుకుని ఉన్నాయి! దాదాపు 1,400 కిలోమీటర్ల పొడవైన ఉత్తర అనతోలియా ఫాల్ట్ జోన్ టర్కీ ఉత్తరార్ధ భాగంలో తూర్పు నుంచి పశ్చిమానికి ఉంది.
దేశంలోని ప్రధాన నగరాలైన అంకారా, ఇస్తాంబుల్‌తో పాటు, పారిశ్రామిక వాడలు కూడా ఈ ఫాల్ట్ జోన్ వెంబడే ఉన్నాయి. మరోవైపు తూర్పు అనతోలియా ఫాల్ట్ జోన్ వెయ్యి కిలోమీటర్ల పొడవుతో దేశ ఆగ్నేయ ప్రాంతం గుండా ప్రయాణిస్తూంటుంది. లక్షల జనాభా ఉన్న చిన్న చిన్న నగరాలు, పల్లెలు ఈ జోన్‌లోనే ఉన్నాయి. ఈ సమస్యను ఎదు ర్కొనేందుకు టర్కీ ఇప్పటికి చాలా ప్రయత్నాలే చేసింది.
1959లో ఆ దేశ పార్లమెంటు ‘డిజాస్టర్ లా 7269’(విపత్తు చట్టం)ను ఆమోదించింది. ప్రకృతి వైపరీత్యాల నష్టాన్ని నివారించేందుకు ప్రణాళికలను రూపొందించాలనీ, జాతీయ స్థాయి నుంచి మున్సిపాలిటీల వరకూ నియమ, నిబంధనలు సిద్ధం చేయాలనీ తీర్మానించారు. ఈ ఏర్పా ట్లన్నీ ప్రజల్లో భూకంప విపత్తుపై కొంత అవగాహనైతే పెంచాయి కానీ, 1990లలో గణనీయమైన స్థాయిలో ఉన్న ఐదు భూకంపాలు చోటు చేసుకున్నా మార్పులేమీ కనబడకపోవడంతో ఆ చట్టంపై ఆశలు సన్నగిల్లాయి.
1999లో మార్మరా ప్రాంతంలో వచ్చిన భూకంపాల్లో సుమారు 17 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తరువాత టర్కీ ప్రభుత్వం భూకంపాలను తట్టుకునే భవనాల నిర్మాణానికి, ప్రోత్సా హానికి ఒక కార్యక్రమం చేపట్టింది. అయినాసరే, ప్రభుత్వంలోని విపరీతమైన అవినీతి ఫలితంగా ఈ భవన నిర్మాణ నియంత్రణలు అమల్లోకి రాలేదు. భవిష్యత్తులో భూకంపాలు వస్తే వాటిని సమర్థంగా ఎదుర్కొనేందుకని ప్రభుత్వం ‘భూకంప పన్ను’ పేరుతో పన్నులు వసూలు చేసింది కూడా. దీనిద్వారా సుమారు 460 కోట్ల అమెరికన్ డాలర్ల మొత్తం జమకూడింది.
అయితే ఈ మొత్తాన్ని ఎలా ఖర్చు పెట్టారన్న విషయంలో అనేక ప్రశ్నలు తలెత్తాయి. 2009లో టర్కీ ‘నేషనల్ డిజాస్టర్ అండ్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ అథారిటీ’ (జాతీయ విపత్తు మరియు అత్యవసర పరిస్థితి నిర్వహణ సంస్థ) ఒకదాన్ని ఏర్పాటు చేసింది. విపత్తు నిర్వహణకు సిబ్బందిని సిద్ధం చేయడం, తద్వారా ప్రమాద నష్టాన్ని తగ్గించడం దీని ఉద్దేశం. రాష్ట్ర, మున్సిపాలిటీ స్థాయిల్లో సిబ్బందికి శిక్షణ ఇవ్వడం, భూకంపాలు వచ్చినప్పుడు ఎలా వ్యవహరించాలో ప్రజలకు వివరించడం దీని పని. 2014లోనూ టర్కీ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ప్లాన్ (జాతీయ విపత్తు సంసిద్ధతా పథకం) ఒకదాన్ని సిద్ధం చేసింది.
ప్రకృతి విపత్తుల సమయంలో ప్రభుత్వ సంస్థలు ఎలాంటి పాత్ర పోషించాలో సూచించిందీ పథకం. పోషకాహారం, అత్యవసర గృహ వసతి, సమాచార వ్యవస్థలు.. ఇలా వేర్వేరు బృందాలను ఏర్పాటు చేసి వాటికి నిర్దిష్ట బాధ్యతలు అప్పగించారు. 2014లోనే సోమా ప్రాంతంలో భూగర్భ గనిలో ఓ అగ్ని ప్రమాదం చోటు చేసుకుని 301 మంది మరణించారు. ఈ ఘటనపై సమీక్షించిన టర్కీ ప్రభుత్వం జాతీయ విపత్తు పథక పునఃసమీక్షకు నిర్ణయించింది. జపాన్, అమెరికా, యూరప్ ప్రతినిధులతో కూడిన సలహా కమిటీని కూడా ఏర్పాటు చేసింది.
ఈ కమిటీ సూచించిన మార్పులను జాతీయ విపత్తు పథకంలో చేర్చారు. నిరంతర నిఘా, విపత్తు నిర్వహణ సిబ్బందికి మరింత ఆధునికమైన శిక్షణ, సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి తేవడం, సంస్థల మధ్య సమన్వయం వంటి మార్పులు చేశారు. అయితే ఈ ప్రణాళికలను 2015 జనవరి నుంచే సైద్ధాంతికంగా అమల్లో పెడుతున్నట్లు నేతలు ప్రకటించారు కానీ, వాస్తవ ఆచరణ ఇప్పటికీ జరగలేదు.
నేషనల్ డిజాస్టర్‌అండ్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ అథారిటీ నాయకత్వాన్ని మార్చడంతో సరిపెట్టింది ప్రభుత్వం. పైగా మంచి శిక్షణ, ఆధునిక సమాచార వ్యవస్థలు కావాలని కోరిన వారిని పదవుల నుంచి తప్పించింది. ఈ మార్పులు స్థానిక ప్రభుత్వాలపై తీవ్ర ప్రభావం చూపాయి.
జపాన్, కాలిఫోర్నియా పాఠాలు...
మార్పులు చేసిన నేషనల్ డిజాస్టర్ ప్లాన్ అమలు చేయకపోవడం ఒక విషయాన్ని స్పష్టం చేస్తోంది. భూకంప ముప్పును ఎదుర్కొనే విషయంలో టర్కీ వద్ద ఉన్న జ్ఞానానికీ, ఆచరణకూ మధ్య అంతరం ఉంది. భూకంపాలను ఎలాగూ ఆపలేము. కానీ వాటిని తట్టుకోగల భవనాలను నిర్మించవచ్చు. జపాన్, కాలిఫోర్నియాల్లో ఇదే జరిగింది. భూకంపాలను తట్టుకోగల భవనాలకు సంబంధించిన నియమావళిని టర్కీ రూపొందించింది. దేశంలో 1.50 లక్షల మంది సివిల్ ఇంజినీర్లూ ఉన్నారు. ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనేలా రోడ్లు, భవనాలు, వంతెనలు ఎలా కట్టాలో వీరికి తెలుసు.
అయితే ఇప్పటికే ఉన్న భవనాలను కొత్త ప్రమాణాల ప్రకారం కట్టేందుకు అయ్యే ఖర్చు చాలా ఎక్కువ కావడంతో ఆ కార్యక్రమం చాలా నెమ్మదిగా సాగుతోంది. భవనాల డిజైన్ నియంత్ర ణలు 2000 సంవత్సరం నుంచే అమల్లో ఉన్నా, వాటి అత్యాధునిక అవసరాలను స్థానిక ఇంజినీర్లు పెద్దగా అర్థం చేసుకోలేకపోయారు. భవన నిర్మాణాన్ని పర్యవేక్షించేందుకూ 2010 నుంచి ఒక కమిటీ ఉంది కానీ దేశంలోని కోటీ అరవై లక్షల భవనాలను పర్యవేక్షించ లేకపోతోంది.
భవిష్యత్తు దశ, దిశ 2023 ఫిబ్రవరి ఆరున సంభవించిన భారీ భూకంపంతో టర్కీ పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. స్వల్పకాలికం మాత్రమే కాదు, సుదీర్ఘకాలం పనిచేయగల ప్రణాళికలు అత్యవసరంగా అమలు చేయాల్సిన పరిస్థి తిని ఆ దేశం ఎదుర్కొంటోంది. గృహ నిర్మాణాన్ని ఇప్పటిలానే లోపాలతో కొనసాగించడమా, వ్యయప్రయాసలకు ఓర్చి అత్యాధునిక, దృఢమైన, మెరుగైన డిజైన్ కలిగిన భవన నిర్మాణాలను చేపట్టడమా అన్నది నిర్ణయించుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది.
ఈ కార్యక్ర మంలో ప్రజలందరినీ భాగస్వాములు చేయడం ద్వారా భూకంపా లతో వచ్చే ముప్పును గుర్తించే సమాజాన్ని సిద్ధం చేయాలి. అంతే కాకుండా తగిన ప్రణాళిక, ఆచరణలతో నష్టాన్ని తగ్గించవచ్చునన్న తెలివిడి కూడా వీరికి కలిగించాల్సిన అవసరం ఉంది.
– లూయిస్ కె. కంఫర్ట్, ప్రొఫెసర్, పిట్స్‌బర్గ్ యూనివర్సిటీ
– పోలాత్ గుల్కన్, ప్రొఫెసర్, బాష్కెంట్ యూనివర్సిటీ
– బుర్చాక్ బాష్బూ ఎర్కాన్
అసోసియేట్ ప్రొఫెసర్, మిడిల్ ఈస్ట్ టెక్నికల్ యూనివర్సిటీ
(‘ద కాన్వర్జేషన్’ సౌజన్యంతో)
Comments
Please login to add a commentAdd a comment