పశ్చిమాసియా: ట్రంప్‌ సుడిగుండంలో బైడెన్‌ | Trump Critics On US Electoral System Damage Country Fame | Sakshi
Sakshi News home page

పశ్చిమాసియా: ట్రంప్‌ సుడిగుండంలో బైడెన్‌

Published Wed, Dec 2 2020 3:44 AM | Last Updated on Wed, Dec 2 2020 3:46 AM

Trump Critics On US Electoral System Damage Country Fame - Sakshi

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తన ప్రత్యర్థి బైడెన్‌ గెలుపు చట్టబద్ధతను సవాలు చేయడం ద్వారా దేశాధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అమెరికా ప్రయోజనాలకు తీవ్ర నష్టం కలిగించారు. ఓటర్ల తీర్పును తాను గౌరవించబోనని, మోసంతో బైడెన్‌ గెలిచారని ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలు దేశీయంగా చిక్కులను కల్పించడమే కాకుండా విదేశాల్లో అమెరికా సంయుక్త రాష్ట్రాల ప్రతిష్టను కూడా దెబ్బతీసింది. సునాయాసంగా అధికార మార్పిడీ, ప్రజాస్వామ్య ఆదర్శాల పట్ల నిబద్ధత గురించి విదేశీ నేతలకు ప్రబోధించే నైతిక అధికారాన్ని ఇప్పుడు అమెరికా కోల్పోయింది. నాలుగేళ్ల తర్వాత ట్రంప్‌ వదిలివెళుతున్న విధానాలు అధికార మార్పిడి విషయంలో బైడెన్‌కు దేశీయంగా చిక్కులు కొని తేవడమే కాకుండా పశ్చిమాసియాలో గమ్యం తెలీని ప్రయాణాన్ని కొత్త అధ్యక్షుడి యంత్రాంగానికి కలిగించనున్నాయి.

గత కొన్ని వారాల్లో ట్రంప్‌ యంత్రాంగం మధ్యప్రాచ్యానికి అసాధారణ ప్రాధాన్యతనిచ్చింది. విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియోతో సహా కనీసం నలుగురు సీనియర్‌ అధికారులు ఇజ్రాయెల్‌కి అమెరికా సన్నిహిత గల్ఫ్‌ మిత్రదేశాలను సందర్శించారు. ఈ క్రమంలోనే ట్రంప్‌ ఇరాన్‌పై ఆంక్షలను పెంచడమే కాకుండా ఇరాన్‌ అణు శాస్త్రజ్ఞుడు మొహసెన్‌ ఫఖీర్‌జాదె హత్యకు ఆమోద ముద్ర వేశారు. అణ్వాయుధ సహిత అమెరికా యుద్ధ వాహన నౌకను గల్ఫ్‌ ప్రాంతానికి తరలించారు. ఈ చర్యలన్నీ అమెరికా విదేశీ విధానాన్ని కాకుండా దాని దేశీయ రాజకీయాలకు దగ్గరగా ఉన్నట్లు పలువురు భావిస్తున్నారు.
అధికారం నుంచి వైదొలుగుతున్న ట్రంప్‌ యంత్రాంగానికి సన్నిహితులుగా ఉంటూవచ్చిన పశ్చిమాసియాలోని మిత్రులు బైడెన్‌ను లాంఛనప్రాయంగా స్వాగతించి ఉండవచ్చు కానీ బైడెన్‌ యంత్రాం గానికి వ్యతిరేకంగా వీరు ట్రంప్‌తో చేతులు కలిపి డెమొక్రాటిక్‌ పార్టీకి రాజకీయ వ్యతిరేక శిబిరంలో చేరే అవకాశం కూడా కాదనలేం.

ట్రంప్‌ విధానాలకు పూర్తి వ్యతిరేకంగా బైడెన్‌ అధ్యక్ష పాలన ఉండబోతోందని, బరాక్‌ ఒబామా పాలనను అది తలపించవచ్చని మధ్యప్రాచ్య నేతలు భావిస్తున్నారు. ఇటీవల జాతీయ భద్రతా అధికారులను బైడెన్‌ నియమించిన తీరు దీనికి కాస్త భిన్నంగా ఉండటం వాస్తవమే కానీ, అమెరికా విదేశాంగ విధానం బైడెన్‌ హయాంలో కొన్ని నిర్దిష్ట మార్పులను తీసుకురావడం తప్పదని వీరి అంచనా. అందుకే సౌదీ పాలకుడు, ఈజిప్ట్‌ అధ్యక్షుడు, టర్కీ పాలకుడు కొన్ని రాజీధోరణులను ప్రదర్శిస్తూ వస్తున్నారు. ఇక ఇరాన్‌ సైతం అమెరికా తనపై విధించిన ఆంక్షలను రద్దు చేయించుకుని అణు చర్చల పునరుద్ధరణ బైడెన్‌ హయాంలో సాధ్యమవుతుందని ఆశిస్తోంది.

ట్రంప్‌ హయాంలో అమెరికా విదేశీ విధానం ప్రమాదకరస్థాయిలో వ్యక్తిగతీకరణ బారిన పడింది. ట్రంప్‌ విధానాలను వ్యతిరేకించిన అధికారులను నిర్దాక్షిణ్యంగా ఇంటికి పంపేవారు. విశ్వసనీయులు, అవకాశవాదులు మాత్రమే ట్రంప్‌ యంత్రాంగంలో ఉండేవారు. సాంప్రదాయికమైన విదేశీ విధాన నిర్ణయాలు పక్కకుపోయి, సంస్థల మధ్య అంతర్గత సహకారం కుప్పగూలింది. పెంటగాన్, విదేశాంగ శాఖ వంటి కీలకమైన సంస్థలను ట్రంప్‌ నమ్మేవారుకాదు. దీంతో ట్రంప్‌ అనుయాయులతో విదేశీ నేతలు సులువుగా సంప్రదింపులు జరుపుతూ శ్వేతసౌధంలో మరింత పట్టును సాధించేవారు. అయితే బైడెన్, డెమొక్రాట్లు అధికారం స్వీకరించాక, ట్రంప్‌ అల్లుడితో అర్ధరాత్రి వాట్సాప్‌ సందేశాలు వంటి అడ్డదారి విధానాలకు పశ్చిమాసియా నేతలకు అందుబాటులో ఉండవు. దీంతో పశ్చిమాసియాతోపాటు విదేశీ విధాన అంశాలపై అమెరికా సంస్థల మధ్య విభేదాలు తిరిగి పొడసూపి విధాన నిర్ణయ ప్రక్రియ మందగించే అవకాశమూ లేకపోలేదు.

ట్రంప్‌ అధ్యక్ష పాలనా వారసత్వం నూతన అధ్యక్షుడిగా గెలుపొందిన బైడెన్‌ యంత్రాంగం పురోగమించేందుకు కొన్ని అవకాశాలను ప్రతిపాదించవచ్చు కానీ ట్రంప్‌ సృష్టించిన ప్రాంతీయ సవాళ్లు మాత్రం మిగిలే ఉంటాయి. పశ్చిమాసియాలో ట్రంప్‌ బృందం ఇప్పటికే విదేశీ విధాన డైనమైట్లను అమర్చివుంది. వచ్చే నాలుగేళ్లలో వీటిని తొలగించడానికి బైడెన్‌ చాలా కష్టపడాల్సి ఉంటుంది. పశ్చిమాసియా నేతలు ప్రారంభంలోనే బైడెన్‌కు పరీక్ష పెడతారు. వచ్చే నాలుగేళ్ల పాలనను సీరియస్‌గా తీసుకోవాలంటే బైడెన్‌ ఇప్పుడే కాస్త వెన్నెముకను ప్రదర్శించాల్సి ఉంది.
వ్యాసకర్త: జో మెకరాన్, అరబ్‌ సెంటర్‌ పరిశోధకుడు, వాషింగ్టన్‌ డీసీ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement