ఒక దేశ సర్వతోముఖాభి వృద్ధికి సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలు) ఎంతో ఉపయోగకరం. ఐక్యరాజ్య సమితి 2017 ఏప్రిల్ 6న 74వ ప్లీనరీలో... అభివృద్ధి చెందుతున్న దేశాలలో స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు సాధించడంలో ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈల జాతీయ సామర్థ్యాలను ఆయా దేశాలకు అనుగుణంగా అభివృద్ధి చేయడం కోసం జూన్ 27వ తారీఖును ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈల డేగా ప్రకటించడం ప్రాముఖ్యం సంతరించుకున్నది. మన దేశంలో 2016 నాటి గణాంకాల ప్రకారం 6 లక్షల ఎమ్‌ఎస్ ఎమ్‌ఈలు ఉన్నాయి. కేంద్రం... రాష్ట్ర ప్రభుత్వాలకు మరింత సహకారం అందజేస్తూ తగిన విధానాలను, సాంకేతికతను, నాయకత్వ నైపుణ్యాలను పెంపొందించడానికి ముందుకు రావాలి.
ఏపీలో గత ప్రభుత్వం 2017లో ఆంధ్రప్రదేశ్ ఎస్‌ఎమ్‌ఎస్‌ఈ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ను ప్రారంభించింది. అయితే దానికి ఎటువంటి నామినేటెడ్ బాడీనిగానీ, ఆఫీసునుగానీ ఏర్పాటు చేయలేదు. ప్రస్తుత ప్రభుత్వం పోయిన ఏడాది కార్పొరేషన్ చైర్మన్‌ను, డైరెక్టర్లను నియమించింది. రాష్ట్రంలో సుమారు లక్ష ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలు రిజిస్టరై ఉన్నాయి. కోవిడ్ వల్ల దెబ్బతిన్న ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలు ఇప్పుడిప్పుడే తిరిగి పునః ప్రారంభమవుతున్నాయి. ఈ తరుణంలో గత రాష్ట్ర ప్రభుత్వం ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలకు ప్రకటించిన ఆర్థిక ప్రోత్సాహకాలను ప్రస్తుత ప్రభుత్వం పూర్తిగా చెల్లించడంతో వాటికి ఒక చక్కటి భరోసా లభించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో కుడా ఆర్థిక ప్రోత్సాహకాలను త్వరలోనే విడుదల చేస్తామని ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి చెప్పారు. ఇటీవల జరిగిన పారిశ్రామిక రివ్యూ సమావేశంలో ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈల వ్యవస్థను మరింత అభివృద్ధి చేయడానికి దేశంలోని నిపుణుల నుండి సలహాలు తీసుకోవాలని అన్నారు. సంస్థ ప్రభావవంతంగా పనిచేయడానికి శాఖాపరమైన మార్పుల కోసం నోట్‌ను తయారు చేయమని కార్పొ రేషన్ అధ్యక్షుణ్ణి ఆదేశించారు.
ఆర్థిక ప్రోత్సాహకాలతో పాటు, నాణ్యమైన ఉత్పత్తి, ప్రణాళికాబద్ధమెన యాజమాన్యపు పద్ధ తులు, శాస్త్ర సాంకేతికతలో వచ్చిన నూతన అభివృద్ధి, నాణ్యమైన ముడి పదార్థాల సరఫరా, దేశీయ, అంతర్జాతీయ రంగాలలో మార్కెటింగ్ మెలకువలు లాంటి విషయాలు... ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలు స్థిరపడడానికీ, అభివృద్ధి చెందడానికీ చాలా అవసరం. ఈ అంశాలలో తగిన విషయ పరిజ్ఞానం లేకపోవడం మూలంగా అనేక ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలు పోటీలో నిలబడలేక అంతరించిపోతున్నాయి. (క్లిక్: విద్యారంగంలో జగన్ జైత్రయాత్ర)
నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్... ఇనుము, రసాయనాలు, లోహాలు, ఇతర ముడి పదార్థాలు ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈల కోసం క్రమబద్ధంగా భారీ పరిశ్రమల నుండి కొనుగోలు చేసి వాటికి క్రెడిట్ రూపంలో అందించగలుగుతుంది. ఈ సౌకర్యాన్ని మన రాష్ట్రంలో అత్యంత పరిమితంగా వాడుకుంటున్నాం. ఏ చిన్న పరిశ్రమకైనా ముడిపదార్థం నిరంతర సరఫరా జరిగితేనే ఆ సంస్థ నిలదొక్కుకునే అవకాశాలు ఉంటాయి. అలాగే మిషనరీ కొనుగోలు చేయడంలోనూ, డిజిటల్ సర్వీసెస్ అందజేయడంలోనూ, ఇన్ఫో మీడియరీ సర్వీస్ అందజేయడంలోనూ, జాతీయ – అంతర్జా తీయ ఎగ్జిబిషన్లలో పాల్గొనడంలోనూ ఇది ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలకు సహకరిస్తుంది. ఇలాగే నాబార్డ్, సిడ్బి, ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ సంస్థ, ఇండియన్ ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్, వరల్డ్‌బ్యాంక్, ఐక్యరాజ్య సమితి, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ వంటి సంస్థలు అందించే సహకారాన్ని కుగ్రామాల్లో ఉన్న ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలకు చేరవేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దీంతో ముందు ముందు ఇవి దేశ ప్రగతిలో ప్రధాన పాత్ర పోషించనున్నాయి. (క్లిక్: పేద యువతను నిందించగలమా?)
- వంక రవీంద్రనాథ్
ఆంధ్రప్రదేశ్ ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్
(జూన్ 27న ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈల దినోత్సవం)
Comments
Please login to add a commentAdd a comment