Cricketer Ambati Rayudu Visited Guntur - Sakshi
Sakshi News home page

గుంటూరులో క్రికెటర్ అంబటి, ప్రజలతో మమేకం, త్వరలో ప్రకటన

Published Thu, Jun 29 2023 2:04 AM | Last Updated on Thu, Jun 29 2023 1:17 PM

Cricketer Ambati meeting people in Guntur district - Sakshi

ముట్లూరులో విద్యార్థులతో కలిసి భోజనం చేస్తున్న క్రికెటర్‌ అంబటి

వట్టిచెరుకూరు (ప్రత్తిపాడు): ఇన్నాళ్లు క్రికెటర్ గా అలరించిన అంబటి రాయుడు కొత్త బాట పట్టారు. నిష్ఠగా ప్రజాసేవ కోసమే వస్తున్నానని ప్రజలకు తెలియజేస్తున్నానని క్రికెటర్‌ అంబటి రాయుడు అన్నారు.

విద్యార్థులతో మాటామంతీ

గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని వట్టిచెరుకూరు మండలం ముట్లూరు గ్రామంలో అంబటి రాయుడు పర్యటన జరుగుతోంది. తొలుత పునీత శౌరివారి పుణ్యక్షేత్రాన్ని సందర్శించారు. ఫాదర్‌ మార్నేని దిలీప్‌కుమార్‌ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం స్థానిక శౌరివారి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను పరిశీలించారు. పాఠశాల ఆవిర్భావం, వసతులు, పది ఫలితాల గురించి హెచ్‌ఎం జోస్పిన్‌ గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో కలిసి జగనన్న గోరుముద్ద భోజనం తిన్నా రు.

వ్యూహాత్మకంగా అడుగులు

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. భవిష్యత్‌ ప్రణాళికను కొద్ది నెలల్లో చెబుతానన్నారు. జిల్లాలో ప్రతి ప్రాంతం, ప్రతి ఊరు తిరగడం జరుగుతుందని చెప్పారు. ప్రజాసేవకు వచ్చినప్పుడు ఏ ప్రాంతంలో ఏ పనులు, ఏమేమి అవసరాలు ఉన్నాయనేది తెలుసుకుని, వాటిని ఒక ప్రణాళిక ప్రకారం నెరవేర్చుకుంటూ వెళదామన్నదే తన కోరికని, అందుకోసమే అన్ని గ్రామాల్లో పర్యటిస్తూ సమస్యలు తెలుసుకుంటానని వివరించారు. ఆయన వెంట రాతంశెట్టి లక్ష్మణ్‌, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

ఇటీవలే సీఎం జగన్ తో భేటీ

IPL ఫైనల్ లో చెన్నై జట్టు తరపున ఘనవిజయం సాధించి, స్వయంగా ధోనీతో కలిసి ట్రోఫీని అందుకున్న రాయుడు.. అనూహ్యంగా క్రికెట్ కు గుడ్ బై చెప్పారు. భవిష్యత్తులో తానేం చేస్తానన్నది ప్రకటించకపోయినా.. ప్రజలతో ఏదో ఒక రకంగా మమేకం కావాలన్నది రాయుడు వ్యూహాంగా కనిపిస్తోంది. ఇటీవలే మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసారు అంబటి. 

రాజకీయాల్లోకి వస్తాడా? రాడా?

అంబటి రాయుడుకు క్రికెటర్ గా మంచి పేరుంది. గ్రౌండ్ లో ఎంతో ప్రొఫెషనల్ గా కనిపించే రాయుడు, నిజ జీవితంలోనూ అంతే నిబద్ధతతో ఉంటాడన్న పేరుంది. రాజకీయాల్లోకి రావాలా లేదా అన్నదానిపై అంబటి రాయుడు ఇంకా నోరు విప్పకపోయినా.. ప్రజాసేవలో ఏ రకంగా ముందడుగు వేసినా రాయుడు సక్సెస్ అవుతాడన్న అంచనాలున్నాయి. 

ఇటీవల తన ట్వీట్ లో తన అంకితభావాన్ని, పట్టుదల గురించి ఇలా రాసుకున్నాడు అంబటి. "పెద్ద కలలు కను. దానిపైనే దృష్టి పెట్టు. కఠోర శ్రమ చేయు. వర్తమానంలో జీవించు"

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement