సూర్యప్రకాశరావు మృతి తీరని లోటు
కొరిటెపాడు: కోల్డ్ స్టోరేజెస్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా, ఉమ్మడి రాష్ట్రంలో ఫెడరేషన్ ఆఫ్ కోల్డ్ స్టోరేజ్ వైస్ ప్రెసిడెంట్‌గా, గుంటూరు చాంబర్ ఆఫ్ కామర్స్ వైస్ ప్రెసిడెంట్‌గా గత 30 ఏళ్లుగా సేవలందించిన తడికమళ్ల సూర్యప్రకాశరావు బుధవారం ఉదయం మృతిచెందారు. సూర్యప్రకాశరావు ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో ఉన్న రైతు సోదరులకు పలు రకాల సేవలు అందించారని పలువురు ప్రముఖులు, మిత్రులు, బంధువులు కొనియాడారు. కోల్ట్ స్టోరేజ్‌ల అభివృద్ధికి ఎనలేని కృషి చేశారని వెల్లడించారు. రైతు సోదరుల కోసం ఆరు కోల్డ్‌స్టోరేజీలను సొంత ఖర్చులతో పలు ప్రాంతాల్లో నిర్మించి నడుపుతున్నారని గుర్తు చేశారు. ఆయన మృతి తీరని లోటన్నారు. సూర్యప్రకాశరావు ఆత్మకు శాంతి కలగాలని దేవుని ప్రార్ధించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
మాయమాటలు చెప్పి బాలికపై లైంగిక దాడి
యువకుడిపై పోక్సో కేసు
మంగళగిరి టౌన్: ఓ బాలికపై లైంగిక దాడి చేసిన యువకుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు బుధవారం మంగళగిరి పట్టణ పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. మంగళగిరి నగరానికి చెందిన ఓ బాలిక 9వ తరగతి వరకు చదువుకుని ఇంట్లోనే ఉంటోంది. పార్కురోడ్డుకు చెందిన శ్యామ్‌బాబు ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. వీరిద్దరూ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. శ్యామ్‌బాబు పెళ్లి చేసుకుంటానని మభ్యపెట్టి బాలికపై పలుమార్లు లైంగికదాడి చేశాడు. ఈ నేపథ్యంలో ఎప్పుడు పెళ్లి చేసుకుంటావని బాలిక అడగడంతో వివాహానికి నిరాకరించాడు. దీంతో బాలిక పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
రెండు ఆటోలు ఢీ : వృద్ధుడి మృతి
దాచేపల్లి: రెండు ఆటోలు ఢీకొన్న ఘటనలో వృద్ధుడు మృతి చెందిన ఘటన దాచేపల్లి మండలం గామాలపాడు గ్రామ సమీపంలో బుధవారం జరిగింది. ఈ ప్రమాదంలో సూర్యాపేట జిల్లా పాలకీడు మండలం మహంకాళీగూడేనికి చెందిన పేరుపోగు ప్రేమదాసు (62) మృతి చెందాడు. ఎస్‌ఐ సౌందర్యరాజన్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలో జరుగుతున్న ఓ వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు ప్రేమదాసు ఆటోలో దామరచర్ల వైపు నుంచి వస్తున్నాడు. ఈ సమయంలో గామాలపాడు నుంచి శ్రీనగర్‌వైపు వెళుతున్న ఆటో దామరచర్ల వైపు వెళ్లుతున్న ఆటోని ఢీకొట్టింది. ఈ ఘటనలో ప్రేమదాసు తీవ్రంగా గాయపడ్డాడు. మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రేమదాసుని హస్పిటల్‌కి తీసుకెళ్తున్న క్రమంలో మృతి చెందాడు. సంఘటన స్థలాన్ని ఎస్‌ఐ సౌందర్యరాజన్ పరిశీలించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఎమ్మెల్సీ లక్ష్మణరావుకు ఏపీటీఎఫ్ మద్దతు
నరసరావుపేట: ఎమ్మెల్సీ ఎన్నికల్లో కె.ఎస్. లక్ష్మణరావుకు తాము సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు బి.సంపత్‌బాబు చెప్పారు. ఆయన బుధవారం లక్ష్మణరావును కలిసి, సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్ష్మణరావు గెలుపునకు కృషి చేస్తామని చెప్పారు. సంఘం ప్రధాన కార్యదర్శి కొమ్ము కిశోర్, గౌరవ అధ్యక్షులు పమ్మి వెంకటరెడ్డి మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం పాటు పడే పీడీఎఫ్ అభ్యర్థుల గెలుపు చారిత్రాత్మక అవసరమని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికను సైతం రాజకీయం చేసేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. పట్టభద్రులు కూడా చైతన్యవంతంగా ఆలోచించాలని, పీడీఎఫ్ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు.
సూర్యప్రకాశరావు మృతి తీరని లోటు
Comments
Please login to add a commentAdd a comment