ఘనంగా ప్రారంభమైన కోటప్పకొండ తిరునాళ్ల
నరసరావుపేట రూరల్: కోటప్పకొండ తిరునాళ్ల మహోత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. త్రికోటేశ్వర స్వామి వారికి తెల్లవారుజామున ఆలయ అర్చక స్వాములు శాస్త్రోక్తంగా విశేష అభిషేకాలు, ప్రత్యేక పుష్పాలంకరణ సేవ నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామి వారిని దర్శించుకున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా మూలవిరాట్ అభిషేకాలు రద్దు చేశారు. అభిషేక మండపంలో నిర్వహించిన అభిషేకాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వీరికి ప్రత్యేక దర్శనాన్ని కల్పించారు. ధ్యానశివుడు, నాగేంద్రుని పుట్ట వద్ద భక్తులు పూజలు నిర్వహించారు. సోపాన మార్గంలో మెట్ల పూజ నిర్వహిస్తూ భక్తులు కొండమీదకు చేరుకొని మొక్కులు తీర్చుకున్నారు. మెట్ల మార్గంలో తాగునీటి సౌకర్యం కల్పించకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అలాగే ప్రధాన ఆలయం చుట్టూ నీడ కోసం టెంట్లు వేసే పనులు పూర్తికాక పోవడంతో ఎండ వేడిమికి మహిళలు, వృద్ధులు అవస్థలు పడ్డారు. ధ్యాన శివుడుకు రంగులు వేసే పనులు పూర్తికాలేదు. సెంట్రింగ్ కర్రల మధ్య నుంచే వెళ్లి భక్తులు పూజలు నిర్వహించాల్సి వచ్చింది. వృద్ధులు, వికలాంగులను బ్యాటరీ కారులో పార్కింగ్ నుంచి ప్రధాన ఆలయ ప్రాంగణం వద్దకు తీసుకువచ్చే ఏర్పాటు చేశారు. నరసరావుపేట నుంచి ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను నడిపింది. పట్టణ, పరిసర గ్రామాల నుంచి భక్తులు బాలప్రభలతో కొండకు వచ్చారు. ఆలయ ఈవో డి.చంద్రశేఖరరావు ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఘాట్‌రోడ్డు మార్గంలోని ప్రకృతి పర్యావరణ కేంద్రం వద్ద యాత్రికుల సందడి నెలకొంది.
నేడు, రేపు అన్నప్రసాద వితరణ
నరసరావుపేట రూరల్: కొండకు వచ్చే భక్తులకు సోమ, మంగళవారాల్లో అన్నప్రసాద వితరణ ఉంటుందని గిరి ప్రదక్షిణ సేవా సమితి అధ్యక్షుడు అనుమోలు వెంకయ్యచౌదరి ఆదివారం తెలిపారు.
ఘనంగా ప్రారంభమైన కోటప్పకొండ తిరునాళ్ల
Comments
Please login to add a commentAdd a comment