శివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం
పెదకాకాని: స్థానిక మల్లేశ్వరస్వామి దేవస్థానంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఆదివారం శ్రీకారం చుట్టారు. భ్రమరాంబ అమ్మవారు పెండ్లి కుమార్తె అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. సుప్రభాత సేవ, పంచహారతులు, రుద్రాభిషేకం, విఘ్నేశ్వరపూజ, పుణ్యాహవచనం, పంచగవ్యప్రాసన, దీక్షాధారణ, త్రిశూలపూజ, వాస్తుపూజ, ధ్వజారోహణ, ఆలయ బలిహరణ తదితర కార్యక్రమాలు ఘనంగా సాగాయి. స్థానాచార్యులు పొత్తూరి సాంబశివరావు, ప్రధాన అర్చకులు పొత్తూరి లక్ష్మీనారాయణ వరప్రసాదులు ఈ కార్యక్రమాలను ఆలయ ఉప కమిషనరు గోగినేని లీలాకుమార్ పర్యవేక్షణలో నిర్వహించారు. ఆలయం భక్తులతో కిటకిటలాడింది. అధిక సంఖ్యలో భక్తులు పొంగళ్లు పొంగించి స్వామి వారికి నైవేద్యం పెట్టారు. పెదకాకాని భవానీ భక్త సమాజం వారిచే భజన కాలక్షేపం, విజయవాడకు చెందిన ప్రణతి కూచిపూడి నృత్యం, శివశక్తి నాట్యమండలి, పెద్దపల్లి వారిచే శ్రీ వల్లీ కళ్యాణం నాటకం తదితర సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సోమవారం అమ్మవారు వనదుర్గాదేవి అలంకారంలో దర్శనమివ్వనున్నారు.
శివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం
Comments
Please login to add a commentAdd a comment