జీవితం ‘అమృత’మయం
తెనాలి: కష్టాల గరళాన్ని దిగమింగి జీవితాన్ని అమృతమయం చేసుకున్నారామె.. తెనాలిలో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ (ఏఎంవీఐ)గా సమర్థంగా బాధ్యతలు నిర్వర్తిస్తూ ఈనాటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆమెపేరు గోలి అమృతరాణి. గ్రూప్–1 సాధించి ఈ మధ్యనే తొలి పోస్టింగ్ తెనాలిలో పొందారు. ఆమె సొంతూరు ఫిరంగిపురం. ఆమె ఎంవీఐ స్థాయికి ఎదిగిన తీరు ఆమె మాటల్లోనే..
అమ్మమ్మ ప్రోత్సాహంతో..
మా అమ్మ సింగిల్ పేరెంట్. చిన్నతనంలో ఎన్నో అవరోధాలు ఎదురయ్యాయి. విశ్రాంత ప్రభుత్వ ఉపాధ్యాయిని అయిన మా అమ్మమ్మ ప్రోత్సాహం కొండంత బలాన్ని ఇచ్చింది. ఫిరంగిపురం సెయింట్ ఆన్స్ ఎయిడెడ్ బాలికోన్నత పాఠశాలలో చదివా. పదో తరగతిలో 537 మార్కులు సాధించా. నూజివీడులోని ట్రిపుల్ ఐటీలో ఉచిత సీటు లభించింది. మెకానికల్ ఇంజినీరింగ్ చేశాను. 2015లో ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్‌గా బయటకొచ్చా. కొంతకాలం ప్రైవేటు కాలేజీలో జూనియర్ అధ్యాపకురాలిగా పనిచేశా. సివిల్ ఇంజినీరు సత్యనారాయణతో 2016లో ఏడడుగులు వేశా. అయినా ఉన్నతోద్యోగం సాధించాలనే నా లక్ష్యాన్ని వదలలేదు. భర్త ప్రోద్బలంతో సివిల్స్, గ్రూప్స్ రాశా. తొలిసారి నిరాశే మిగిలింది. 2023లో ఏపీపీఎస్సీకి ఎంపికయ్యా. 2024లో ఎంవీఐ ఉద్యోగం వచ్చింది. శిక్షణ తర్వాత తొలి పోస్టింగ్ తెనాలి వచ్చింది. ప్రస్తుతం మాకో బాబు ఉన్నాడు. ఎంవీఐగా పనిచేస్తున్నా. మరింత ఉన్నత స్థానం చేరుకోవడానికి గ్రూప్–1, సివిల్స్‌కు ప్రిపేరవుతున్నా.
Comments
Please login to add a commentAdd a comment