ఆచార్య కృపాచారికి పరిశోధక గురు పురస్కారం
తెనాలి: ఆచార్య నాగార్జున యూనివర్శిటీ విశ్రాంత ఆచార్యుడు, దళిత సార్వత్రిక విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి పరిశోధక గురువుగా చేసిన సేవలు ప్రశంసనీయమని ప్రముఖ రచయిత, శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయ విశ్రాంత ఉపకులపతి ఆచార్య కొలకలూరి ఇనాక్ అన్నారు. స్థానిక చెంచుపేట డొంకరోడ్డులోని ఆచార్య కృపాచారి నివాసానికి శుక్రవారం ఆచార్య ఇనాక్ వచ్చారు. పరిశోధక గురు పేరుతో కొలకలూరి పురస్కారాన్ని ప్రదానం చేసి సత్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తాము ఏటా ప్రదానం చేస్తున్న కొలకలూరి పురస్కారాలను రచయితలతోపాటు పరిశోధకులు, పరిశోధక గురువుకు కూడా అందజేస్తున్నామని గుర్తుచేశారు. ఈ ఏడాది ప్రకటించిన అవార్డుల్లో పరిశోధక గురు అవార్డుకు కృపాచారిని ఎంపిక చేశామని తెలిపారు. ఆరోగ్య కారణాలతో హైదరాబాద్‌లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవ సభకు కృపాచారి హాజరుకాలేకపోయారని చెప్పారు. అందుచేత తానే స్వయంగా తెనాలి వచ్చి కృపాచారికి ఈ పురస్కారాన్ని అందజేసినట్టు ఆచార్య ఇనాక్ వివరించారు. కృపాచారి పర్యవేక్షణలో 75 మంది పీహెచ్‌డీలు, 68 మంది ఎంఫిల్ చేసినట్టు గుర్తుచేశారు. పలు విశ్వవిద్యాలయాలకు 45 పాఠ్యగ్రంథాలను అందించారనీ, పలు అవార్డులను స్వీకరించారని గుర్తుచేశారు. పురస్కారం స్వీకరించటంపై కృపాచారి సంతోషాన్ని ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment