లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): కూటమి సర్కారు అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు కావస్తున్నా.. ఇంతవరకు తమ వేతనాలు పెంచలేదని అంగన్‌వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సుబ్బరావమ్మ ధ్వజమెత్తారు. పాతగుంటూరులోని సీఐటీయూ కార్యాలయంలో సోమవారం జిల్లా అధ్యక్షురాలు ఏవీఎన్ కుమారి అధ్యక్షుతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ అంగన్‌వాడీలకు వేతనాలు పెంచకపోగా ఉద్యోగుల పేరుతో కరెంట్ బిల్లులు పెంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్‌వాడీ వర్కర్లు హెల్పర్‌లు అందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. అంగన్‌వాడీలకు గ్రాట్యూటీ ఇస్తామని మోసం చేశారని పేర్కొన్నారు. సమావేశంలో అంగన్‌వాడీల యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులుగా వై.రమణను గౌరవ అధ్యక్షులుగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి దీప్తి, ఉపాధ్యక్షులు సుకన్య, ధనలక్ష్మి, హేమలత, రాజకుమారి, శివ పార్వతి పాల్గొన్నారు.