
వక్ఫ్ సవరణ చట్టంపై శాంతియుత నిరసన
లక్ష్మీపురం: పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా ప్రశాంతమైన వాతావరణంలో ఈద్గాలు, మసీదులలో నమాజులు చేసుకునేందుకు వచ్చిన ముస్లింలు కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అవలంభిస్తున్న వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నల్ల రిబ్బన్లతో శాంతియుతంగా తమ నిరసనను వ్యక్తం చేశారు. స్థానిక నగరంపాలెంలోని ఈద్గాలో సోమవారం పవిత్ర రంజాన్ పురస్కరించుకుని జరిగిన ప్రార్థనల్లో ముస్లింలు వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నల్ల రిబ్బన్లు ధరించి పాల్గొన్నారు. నమాజ్ అనంతరం కాంగ్రెస్‌పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే షేక్ మస్తాన్‌వలి విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ పూర్వీకుల ఆస్తులను దోచుకుంటూ ఉంటే చూస్తు ఊరుకునేది లేదన్నారు. వక్ఫ్ ఆస్తులు ఎవరి బాబు గాడి సొత్తు కాదని, బ్రిటిష్ వారికే భయపడకుండా గుండె చూపించి దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన ముస్లిం సమాజాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాలన్నారు. ముస్లింలందరూ రాజ్యాంగం ప్రకారం మనకు సంక్రమించిన వక్ఫ్ ఆస్తులను కాపాడుకోవాలన్నారు. వక్ఫ్ ఆస్తులను దోచుకోవాలని చూసే దుర్మార్గులకు తగిన విధంగా రానున్న రోజుల్లో బుద్ధి చెప్పడం తథ్యమన్నారు. ముస్లింలందరూ ఐకమత్యంతో వక్ఫ్ సవరణ చట్టంకు వ్యతిరేకంగా శాంతియుతంగా పోరాడాలని పిలుపునిచ్చారు.