
తెనాలి వైద్యశాలలో అరుదైన సర్జరీ
తెనాలిఅర్బన్: రోడ్డు ప్రమాదంలో ప్రమాదవశాత్తు ఆటో హ్యాండిల్ రెండు తొడల మధ్య ఇరుకున్న ఓ వ్యక్తికి ఆపరేషన్ చేసి ప్రాణప్రాయాన్ని తప్పించారు తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాల వైద్యులు. సేకరించిన వివరాలు, వైద్యుల కథనం ప్రకారం.. తెనాలి పట్టణంలోని సుల్తానాబాద్‌కు చెందిన ప్రసాద్ (28) ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం ఉదయం ఆటోనగర్ వైపు తన ఆటోలో వెళ్తుండగా ఎదురుగా వచ్చిన మరో వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో ప్రసాద్ నడుపుతున్న ఆటో హ్యాండిల్ అతని రెండు తొడల మధ్యలో ఇరుక్కుపోయింది.
ఎంత సేపు ప్రయత్నించి హ్యాండిల్ బయటకు రాకపోవడంతో స్థానికులు దానిని కట్ చేసి, అతడిని జిల్లా వైద్యశాలకు తరలించారు. విషయం తెలుసుకున్న సీనియర్ ఆర్థోపెడిక్ వైద్యులు డాక్టర్ జె.హనుమంతరావు రంజాన్ పండుగ సందర్భంగా సోమవారం సెలవు అయినప్పటికీ హుటాహుటిన వైద్యశాలకు వచ్చారు. ఓపీ నుంచి అదే స్ట్రక్చర్‌పై థియేటర్‌కు తీసుకువెళ్లి అత్యవసర శస్త్ర చికిత్స చేశారు. రెండు తొడల మధ్యలో ఇరుకున్న హ్యాండిల్‌ను తొలగించడంతో పాటు లోపల దెబ్బతిన్న నరాలను కూడా సరిచేసి కుట్లు వేశారు. వెంటనే సర్జరీ చేయడం వలన ప్రాణపాయం తప్పినట్లు వైద్యులు తెలిపారు. శస్త్ర చికిత్సలో ఆర్థోపెడిక్ వైద్యులు డాక్టర్ వెంకటేశ్వరరావు, ఎనస్తీషియా వైద్యులు డాక్టర్ యశస్వి, డాక్టర్ తులసీలు పాల్గొన్నారు. రోగి తరఫు బంధువులు వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు.
తొడల మధ్యలో ఇరుకున్న ఆటో హ్యాండిల్‌ను తొలగించిన వైద్యులు వ్యక్తికి తప్పిన ప్రాణాపాయం