
వైద్య సిబ్బంది 8వ తేదీలోగా అభ్యంతరాలు తెలపాలి
గుంటూరు మెడికల్: ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ జిల్లా ఆస్పత్రుల సమన్వయ అధికారి కార్యాలయం పరిధిలో కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారి ప్రొవిజనల్ మెరిట్ లిస్టు విడుదల చేసినట్లు జిల్లా వైద్యశాలల సమన్వయ అధికారి ఎం.మజిదాబి తెలిపారు. ప్రొవిజనల్ మెరిట్ లిస్టులో ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈనెల 8వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు గుంటూరు పట్టాభిపురంలోని జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి కార్యాలయంలో నేరుగా వచ్చి తెలియజేయాలన్నారు. ప్రొవిజనల్ మెరిట్ లిస్టును గుంటూరు.ఏపీ.జీవోవి.ఇన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు.
రేవుల హక్కులపై జెడ్పీలో బహిరంగ వేలం
గుంటూరు ఎడ్యుకేషన్: ఉమ్మడి గుంటూరు జిల్లా కృష్ణానదీ పరివాహక ప్రాంతంలోని 11 రేవుల్లో పడవలు, బల్లకట్లు నడుపుకునేందుకు బుధవారం జెడ్పీ సమవేశ మందిరంలో సీల్డ్ టెండర్లు, బహిరంగ వేలం ప్రక్రియ నిర్వహించారు. జెడ్పీ డెప్యూటీ సీఈఓ సీహెచ్ కృష్ణ పర్యవేక్షణలో నిర్వహించిన సీల్డ్ టెండర్లు, బహిరంగ వేలంలో ఏడు రేవులను పాటదారులు దక్కించుకోగా, నాలుగు రేవులకు పాటదారులు పాల్గొనకపోవడంతో వాయిదా వేశారు. అచ్చంపేట, మాచవరం, అమరావతి, కొల్లిపర మండలాల పరిధిలోని చామర్రు, గింజుపల్లి, తాడువాయి, మాదిపాడు, దిడుగు, ధరణికోట రేవుల్లో పడవ, పుట్లగూడెంలో బల్లకట్టును వచ్చే ఏడాది మార్చి 31 వరకు తిప్పుకునేందుకు నిర్వహించిన వేలంలో పాటదారుల నుంచి జెడ్పీకి మొత్తం రూ.1,46,07,526 ఆదాయం సమకూరింది. కాగా చింతపల్లి, వల్లభాపురంలో పడవ, మాదిపాడు, గోవిందాపురంలో బల్లకట్టు వేలంలో పాటదారులు ఆసక్తి చూపలేదు. వేలం ప్రక్రియలో జెడ్పీ సీఈవో వి.జ్యోతిబసు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
గ్రానైట్ తరలింపు లారీ పట్టివేత
ముప్పాళ్ళ: ఎటువంటి అనుమతి పత్రాలు లేకుండా గ్రానైట్ తరలిస్తున్న లారీని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు అదుపులోకి తీసుకున్న సంఘటన మంగళవారం అర్ధరాత్రి జరిగింది. నరసరావుపేట – సత్తెనపల్లి ప్రధాన రహదారిలోని ముప్పాళ్ళ దర్గా సమీపంలో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి కె.చంద్రశేఖర్ తన సిబ్బందితో తనిఖీలు నిర్వహిస్తుండగా గ్రానైట్ లోడ్‌తో వెళుతున్న లారీని గుర్తించారు. లోడ్‌కు సంబంధించి ఎటువంటి పత్రాలు లేవని గుర్తించి తదుపరి చర్యలు నిమిత్తం లారీని పోలీసులకు అప్పగించారు.