
టీడీపీ ప్రజా దర్బార్‌లో రభస
గుంటూరు మెడికల్: గుంటూరు తూర్పు నియోజకవర్గం 15వ డివిజన్ సంగడిగుంట లాంచెస్టర్ రోడ్డులో బుధవారం గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్ అహ్మద్ ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. కార్యక్రమానికి ప్రజలను అధిక సంఖ్యలో తరలించే యత్నంలో భాగంగా స్థానిక టీడీపీ నేతలు రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు, పెన్షన్లు, ప్రభుత్వ పథకాలు కావాల్సిన వారు కార్యక్రమానికి వస్తే ఇస్తామంటూ ఆటోల్లో ప్రచారం చేశారు. దీంతో స్థానిక ప్రజలు అధిక మొత్తంలో ప్రజా దర్బార్‌కు హాజరయ్యారు. తమ సమస్యలు పరిష్కరించాలని, రేషన్ కార్డులు కావాలని, పెన్షన్‌లు ఇప్పించాలంటూ పలువురు ఎమ్మెల్యేను నిలదీశారు. ఈ సందర్భంగా కొద్దిసేపు గందరగోళం నెలకొంది. రేషన్ కార్డులు మంజూరుకు ఇంకా ప్రభుత్వం నుంచి అనుమతి రాలేదని, అనుమతి రాగానే అందరికీ పథకాలు ఇప్పిస్తామని ఎమ్మెల్యే హామీ ఇవ్వడంతో సమస్య సద్దు మణిగింది. అధిక మొత్తంలో ప్రజలు పథకాల కోసం హాజరవడంతో జనాల మధ్య తోపులాట, వాగ్వాదం జరిగి రభస చోటు చేసుకుంది.