
నేడు కొండపాటూరు పోలేరమ్మ తల్లి తిరునాళ్ల
కొండపాటూరు(కాకుమాను): భక్తుల కొంగు బంగారమైన కొండపాటూరు పోలేరమ్మ తల్లి తిరునాళ్ల మంగళవారం జరగనుంది. ఈ సందర్భంగా దేవాలయాన్ని రంగు రంగుల విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. భక్తుల సౌకర్యార్థం ఆలయం చుట్టూ చలువ పందిళ్లను ఏర్పాటు చేశారు.
ప్రధాన ఘట్టం శిడిమాను మహోత్సవం
ఒక పెద్ద దులానికి చివరి భాగాన ఇనుప బోనును ఏర్పాటు చేస్తారు. అందులో మేకపోతును ఉంచి సాయంత్రం ఆరు గంటల సమయంలో గ్రామ పురవీధులలో మేళతాళాలు, కనక తప్పెట్ల మధ్య ఊరేగిస్తారు. శిడిమాను బయలుదేరే ముందు శిడి పెడ్లి కొడుకుని ప్రత్యేకంగా అలంకరించి, దేవాలయ కమిటీ సభ్యులు గ్రామ పురవీధుల్లో తిప్పుతారు. దీంతో శిడిమాను బయలు దేరేందుకు సిద్ధమైందని గ్రామస్తులంతా దేవాలయం వద్దకు చేరుకుంటారు. సోమవారం దేవాలయ ప్రాంగణంలో కమిటీ సభ్యులు శిడిమానును ఏర్పాటు చేశారు. ఆ పెద్ద దూలానికి రైతులు పండించిన వివిధ రకాల పంటలను కట్టి, చల్లంగా చూడాలని అమ్మవారిని మొక్కుకున్నారు. తిరునాళ్లలో వినోదం అందిచేందుకు రంగుల రాట్నాలు, జెయింట్ వీల్‌లను ఏర్పాటు చేశారు. చిన్నారులకు ఆట వస్తువులు, గృహోపకరణాల దుకాణాలు ఏర్పాటు చేశారు.