
భావన్నారాయణ స్వామి దేవాలయం వారసత్వ బైలాస్‌కు శ్రీకారం
బాపట్ల: శ్రీభావన్నారాయణస్వామి దేవాలయం దేవాలయ కట్టడాల పరిరక్షణకు అవసరమైన వారసత్వ బైలాస్ రూపొందిస్తున్నామని ‘ఇంటాక్,’ (ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్) జాతీయ వారసత్వ డైరెక్టర్ ఎ.విజయ చెప్పారు. గురువారం ఢిల్లీ నుంచి వచ్చిన ఇంటాక్ బృందం దేవాలయాన్ని సందర్శించింది. ఇటువంటి చారిత్రక దేవాలయాల అద్భుత వారసత్వాన్ని కొనసాగించేందుకు ఆర్కిలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా వారితో కలిసి కృషి చేస్తున్నట్లు ఆమె తెలిపారు. దేవాలయం చుట్టూ 100 మీటర్ల పరిధిలో ఉన్న పలు వారసత్వ కట్టడాలను వారు సందర్శించారు. ఇందులో భాగంగా శ్రీపాద, నోరి, కంభంపాటి, దేశరాజు వారి భవనాలను వారు పరిశీలించారు. దేవాలయంతో పాటు, మిగతావాటిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని ఆమె వివరించారు. ఇంటాక్ బృందంలో విజయతో పాటు, ఆర్కిటెక్ కన్జర్వేషనిస్ట్ దీప్తి శర్మ, ఇంటాక్ రాష్ట్ర కన్వీనర్ ఎస్వీఎస్ లక్ష్మీనారాయణ, ఆర్కిలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియాకు చెందిన డి.ఫణీంద్రలు ఉన్నారు. వారికి ఇంటాక్ బాపట్ల జిల్లా కన్వీనర్ డాక్టర్ పీసీ సాయిబాబు స్వాగతం పలికారు. బృందం సభ్యులని ఫోరం ఫర్ బెటర్ బాపట్ల ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఫోరం సభ్యులు జి.వెంకటేశ్వర్లు, ఎం.నరసింహారావు, దేవాలయ వంశపారంపర్య ధర్మకర్త దేశిరాజు రమణబాబు, శ్రీరామచంద్రమూర్తి, ఉమాదేవి, రాజేష్, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.