
అధిక రక్తపోటుతో అనేక అనర్థాలు
గుంటూరు మెడికల్: అధిక రక్తపోటు వల్ల అనేక అనారోగ్య సమస్యలతో పాటు శరీరంలోని అనేక అవయవాలు దెబ్బతింటాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు అన్నారు. బ్రెయిన్ స్ట్రోక్‌కు దారి తీస్తున్న అధిక రక్తపోటును ప్రాథమిక దశలోనే గుర్తించి, అదుపులో పెట్టుకోవడం ద్వారా, ప్రాణాలు కాపాడుకోవచ్చని తెలిపారు. ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ అధ్యక్షురాలు, గుంటూరుకు చెందిన సీనియర్ న్యూరాలజిస్ట్ డాక్టర్ పమిడిముక్కల విజయ సహకారంతో రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో శుక్రవారం గుంటూరు భారతీయ విద్యా భవన్‌లో అధిక రక్తపోటుపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కృష్ణబాబు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 32 లక్షల మంది బీపీ, 25 లక్షల మంది షుగర్, బీపీ, షుగర్‌తో 22 లక్షల మంది బాధపడుతున్నట్లు స్క్రీనింగ్ పరీక్షల ద్వారా గుర్తించామని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మూడేళ్లుగా రాష్ట్రంలో ఎన్‌సీడీ సర్వేలో భాగంగా సిబ్బంది ఇంటింటికీ వెళ్లి బీపీ, షుగర్, జ్వరాల పరీక్షలు ఉచితంగా చేస్తున్నారని తెలిపారు. ప్రతి విలేజ్ హెల్త్ క్లినిక్‌లో 105 రకాల మందులు, 14 రకాల వైద్య పరీక్షలు అందుబాటులో ఉన్నట్లు వెల్లడించారు. స్టెమీ కార్యక్రమం ద్వారా ఎనిమిది నెలల్లో 2,300 మందికి రూ. 40వేలు ఖరీదు చేసే ఇంజక్షన్ చేసి ప్రాణాలు కాపాడామని తెలిపారు. హార్ట్ ఎటాక్ మాదిరిగానే బ్రెయిన్ స్ట్రోక్ కూడా ప్రాణాలు తీస్తుందని, అధిక రక్తపోటును కంట్రోల్‌లో పెట్టుకోవాలని ఆయన సూచించారు.
బస్సు ద్వారా ఉచిత పరీక్షలు
ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షురాలు డాక్టర్ పమిడిముక్కల విజయ మాట్లాడుతూ చెక్ బీపీ – స్టాప్ స్ట్రోక్ క్యాంపెయిన్ – 2025లో భాగంగా తాము ప్రత్యేక బస్సును ఏర్పాటు చేసి, అన్ని గ్రామాల్లో ఉచితంగా అధిక రక్తపోటు పరీక్షలు చేస్తున్నామని తెలిపారు. బీపీ పరీక్షల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సును, బీపీ అవగాహన పోస్టర్లను కృష్ణబాబు ప్రారంభించారు. కార్యక్రమంలో గుంటూరు డీఎంహెచ్‌ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి, రెడ్‌క్రాస్ ట్రెజరర్ పి.రామచంద్రరాజు, రోటరీ ఇంటర్నేషనల్ రవి వడ్లమాని, రోటరీ క్లబ్ అధ్యక్షుడు జి.సుబ్బారావు, ఐఎంఏ నేతలు, న్యూరాలజిస్టులు, రోటరీ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.
వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు బీపీ చెకప్ చేసేందుకు ప్రత్యేక వాహనం ప్రారంభం