
వరంగల్ : కుటుంబ కలహాలతో ఓ ఆటోడ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మండలంలోని చింతలపల్లిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన దండుగుల శ్రీను(30), మౌనిక దంపతులు. వీరికి ఇద్దరు కుమారులు ప్రణయ్, కన్నయ్య ఉన్నారు. ఈ క్రమంలో కుటుంబ కలహాల నేపథ్యంలో కొంతకాలంగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి.
మూడు రోజుల క్రితం మళ్లీ గొడవపడ్డారు. దీంతో మౌనిక తన ఆడబిడ్డ వల్లెపు శ్రీలత ఇంటికి వెళ్లింది. శ్రీలత.. తమ్ముడు, మరదలుకు సర్ది చెప్పి ఇంటికి పంపించింది. అయితే ఆటో కిరాయికి వెళ్లి వస్తానని చెప్పిన శ్రీను.. మంగళవారం మధ్యాహ్నం తాను ఉరేసుకుంటున్నానని తన అక్క శ్రీలతకు వీడియోకాల్‌లో చేశాడు. శ్రీలత వెంటనే ఇంటి పక్కన ఉంటే చాపర్తి నగేశ్‌కు ఫోన్ చేసి విషయం తెలిపింది. దీంతో నగేశ్ వెళ్లే సరికి శ్రీను ఇంట్లో దూలానికి వేలాడుతూ చనిపోయి ఉన్నాడు. దీనిపై మృతుడి తల్లి ఐలమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్‌కానిస్టేబుల్ చందర్‌రావు తెలిపారు.