సాక్షిప్రతినిధి, వరంగల్: అసెంబ్లీ ఎన్నికల పోరు ఉమ్మడి వరంగల్‌లో పతాకస్థాయికి చేరుకుంటోంది. వ్యూహాలు, ప్రతివ్యూహాలతో గెలుపే లక్ష్యంగా బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు ముందుకు సాగుతున్నారు. నామినేషన్ల ఉప సంహరణ తర్వాత ఉమ్మడి జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో 213 మంది అభ్యర్థులుగా ఉన్నారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీలకు చెందిన 36 మంది 12 సెగ్మెంట్లలో పోటీ చేస్తున్నారు.
అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించడంతోపాటు అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెబుతూ యువ, నవ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నంలో అభ్యర్థులు పడరాని పాట్లు పడుతున్నారు. ఉమ్మడి వరంగల్‌లో మొత్తం 29,74,631 మంది ఓటర్లుండగా.. 18 నుంచి 39 ఏళ్ల మధ్య వయస్సు వారు 14,70,458 మంది ఉన్నారు. ఈసారి ఎన్నికల్లో యువ, నవ ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతారన్న చర్చ రాజకీయ విశ్లేషకుల్లో సాగుతుండగా.. ఆ ఓటర్లను ఆకట్టుకోవడంపై ప్రధాన పార్టీలు దృష్టి పెట్టాయి.
యువతే కీలకం..
ప్రచారం సహా ఓటింగ్‌లోనూ ప్రభావం
ప్రశ్నించే గుణం, స్పందించే తత్వం కలిగిన యువత సహజంగానే ఎన్నికల్లో అత్యధికంగా ప్రభావితమవుతోంది. ఎన్నికల తరుణంలో రాజకీయ చర్చలనుంచి మొదలుకొని అన్ని పార్టీల తరఫున ప్రచారం చేయడం, సాంకేతిక సహకారం అందించడం వరకు తమవంతుగా పాలుపంచుకుంటుండగా ఇటీవల ఓటు నమోదు, ఓటింగ్‌శాతం పెంచడం, సచ్ఛీలురను ఎన్నుకునేలా కార్యక్రమాలు సైతం చేపడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో యువత అధికంగా ఉండడంతో యువచైతన్యం వెల్లివిరుస్తోంది.
వచ్చే ఎన్నికల్లో వీరే కీలకంగా మారనున్నారు. అత్యధిక జనసాంద్రత కలిగిన ఓరుగల్లు జిల్లాలో విద్యానుకూల పరిస్థితులు చైతన్యానికి దోహదం చేస్తున్నాయి. జిల్లాలో కేయూసీ, ఎన్‌ఐటీ, హెల్త్ యూనివర్సిటీ, వెటర్నరీ, వ్యవసాయ పాలిటెక్నిక్, వ్యవసాయ డిగ్రీ, వ్యవసాయ పీజీ కళాశాలలు, పదుల సంఖ్యలో ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ, ఒకేషనల్ కళాశాలలున్నాయి. నిరుద్యోగ యువత అధికంగా ఉండడంతో పలు కళాశాలల్లో ఓటరు నమోదు కార్యక్రమాలు, న్యాక్ కేంద్రం, ఐటీఐ, ఇతరత్రా యువజన, స్వచ్ఛంద సంస్థలు తమవంతుగా ఓట రు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నా యి.
సోషల్ మీడియా ద్వారానూ వీరు ఓటరు చైతన్యం, ఓటు నమోదు, ఓటు వేయడం, పోలింగ్, పార్టీల పాత్ర తదితర అంశాలపై పెద్దఎత్తున స్పందిస్తున్నారు. వ్యక్తిగతంగా, గ్రూపులుగా సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండగా వీరిలో కొందరు పార్టీల ద్వారా ప్రచారంలో పాలుపంచుకుంటున్నారు. యువత తాము నమ్మిన అంశాలను తమ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో ఆచరింపజేస్తారు కాబట్టి ఓటింగ్ సరళిని మార్చడమనేది వారి చేతుల్లోనే ఉంది. దీంతో ప్రస్తుత ఎన్నికల్లో వారిని ఆకట్టుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలు దృష్టి సారించాయి.
ఓటర్ల నమోదులో కీలకం..
యువ ఓటర్లు 14.70 లక్షలు..
ఈ నెల 10న ప్రకటించిన జాబితా ప్రకారం ఉమ్మడి వరంగల్‌లో ఓటర్ల సంఖ్య 29,74,631. ఇందులో వయస్సుల వారీగా చూస్తే యువ, నవ ఓటర్లు 14,70,458 మంది ఉన్నారు. అత్యధిక శాతం ఉన్న ఈ ఓటర్లు ఏ పార్టీవైపు మొగ్గు చూపుతారన్న అంశం కీలకంగా మారింది. ఓ వైపు రాజకీయ విశ్లేషకుల్లో ఇదే చర్చ జరుగుతుండగా.. ప్రధాన రాజకీయ పార్టీలు సైతం తమ పార్టీల అభ్యర్థులను గెలిపించుకునేందుకు ఈ ఓట్లపైనే ఫోకస్ పెడుతున్నాయి.
అలాగే 40–49 ఏళ్ల వయస్సున్న ఓటర్లతో పాటు 50–59 ఏళ్లలోపు వయసున్న వారిని తమవైపు తిప్పుకునేందుకు నియోజకవర్గాలు, మండలాల వారీగా ఇన్‌చార్జ్‌లను నియమించి తాయిలాలు అందించేందుకు రంగం సిద్ధం చేశారు. అదే విధంగా 60 నుంచి 80 ప్లస్ వయస్సున్న ఓటర్లను పోలింగ్ కేంద్రాల వరకు తీసుకెళ్లి ఓటు వేయించే దిశగా వ్యూహరచనలో నిమగ్నమైన ప్రధాన పార్టీలు.. నవ, యువ ఓటర్లను ఆకట్టుకోవడంపైనే దృష్టి సారించడం చర్చనీయాంశం అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment