సమ్మర్‌ టూర్‌.. వెరీ ‘హాట్‌’ గురూ! | - | Sakshi
Sakshi News home page

సమ్మర్‌ టూర్‌.. వెరీ ‘హాట్‌’ గురూ!

Apr 15 2023 7:14 AM | Updated on Apr 15 2023 7:14 AM

- - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: వేసవి వచ్చిందంటే చాలు మండే ఎండలతో పాటు టూర్‌లు కూడా ఎక్కువే. ఇంటిల్లిపాది కలిసి..నచ్చిన ప్రాంతాల్లో పర్యటించేందుకు నగరవాసులు ఆసక్తి చూపుతారు. కొద్ది రోజులుగా హైదరాబాద్‌ నుంచి వివిధ ప్రాంతాలకు పర్యాటకుల రద్దీ పెరిగింది. కొంతమంది సిటీ టూరిస్టులు ఇప్పటికే ‘డెస్టినేషన్‌ సెర్చింగ్‌’లో మునిగిపోయారు. నచ్చిన చారిత్రక, పర్యాటక ప్రాంతాల్లో గడిపేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారు. దీంతో రైళ్లు, విమానాలకు భారీగా డిమాండ్‌ నెలకొంది.

హైదరాబాద్‌ నుంచి గోవా, విశాఖ, బెంగళూరు, ఢిల్లీ, జైపూర్‌ తదితర ప్రాంతాలకు రద్దీకనుగుణంగా విమాన చార్జీలు సైతం పెరుగుతున్నాయి. మరో 2 నెలల పాటు ఏ రోజుకు ఆ రోజు చార్జీల్లో గణనీయమైన మార్పులు ఉండే అవకాశం ఉన్నట్లు నగరానికి చెందిన ట్రావెల్‌ ఏజెన్సీల నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. కుటుంబమంతా కలిసి జైపూర్‌ వంటి చారిత్రక నగరాలను, ఊటీ, సిమ్లా వంటి చల్లటి ప్రాంతాలను ఎంపిక చేసుకుంటుండగా, కుర్రకారు మాత్రం మాల్దీవులు, బ్యాంకాక్‌ వంటి అంతర్జాతీయ డెస్టినేషన్‌లకు ఫ్లైటెక్కేస్తున్నారు. సోలో టూరిస్టుల సంఖ్య కూడా ఇటీవల కాలంలో బాగా పెరిగినట్లు అంచనా. దీంతో కొద్ది రోజులుగా కేరళ, తమిళనాడులోని పర్యాటక ప్రాంతాలకు, సింగపూర్‌, దుబాయ్‌ తదితర దేశాలకు సైతం బుకింగ్‌లు భారీ సంఖ్యలోనే ఉన్నాయి. పర్యాటకుల రద్దీని సొమ్ము చేసుకొనేందుకు ఎయిర్‌లైన్స్‌ సంస్థలు చార్జీలను పెంచేశాయి.

టికెట్ల రేట్లు ౖపైపెకి...

కొద్ది రోజులుగా గోవాలో పర్యాటకుల సందడి పెరిగింది. వేసవి సెలవులను సరదాగా గడిపేందుకు చాలామంది గోవాను ఎంపిక చేసుకుంటున్నారు. దీంతో హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రతి రోజు సుమారు 50 వేల మంది డొమెస్టిక్‌ ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుండగా వారిలో 8 వేల మందికి పైగా గోవా టూరిస్టులే ఉన్నట్లు అంచనా. విమానాల్లోనూ, రోడ్డు, రైలు మార్గాల్లోనూ సిటీ టూరిస్టులు గోవాకు తరలి వెళ్తున్నారు. సాధారణ రోజుల్లో హైదరాబాద్‌ నుంచి గోవాకు ఫ్లైట్‌ చార్జీ రూ.5000 వరకు ఉంటే ప్రస్తుతం రూ.7500 వరకు చేరింది. మరికొద్ది రోజుల్లో ఈ చార్జీలు మరింత పెరిగి రూ.10 వేలకు చేరుకున్నా ఆశ్చర్యం లేదని ట్రావెల్స్‌ సంస్థలు పేర్కొంటున్నాయి. ఇక ఇంటిల్లిపాది కలిసి వెళ్లే టూర్‌లలో ఎక్కువగా జైపూర్‌. కేరళ, తమిళనాడు పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి.

అంతర్జాతీయ పర్యటనలు పెరిగాయ్‌...
హైదరాబాద్‌ నుంచి సింగపూర్‌, మలేసియా, దుబాయ్‌, మాల్దీవులకు కూడా టూరిస్టుల రద్దీ పెరిగింది. గోవా తరువాత చాలామంది కుర్రాళ్లు బ్యాంకాక్‌ వైపు మొగ్గుచూపుతున్నారు. దీంతో చార్జీలు పెరుగుతూనే ఉన్నాయి. గతంలో బ్యాంకాక్‌కు రూ.25000 వరకు రౌండాఫ్‌ ఉంటే ఇప్పుడు రూ.40 వేలకు చేరినట్లు ట్రావెల్‌ ఏజెన్సీ నిర్వాహకులు ఒకరు తెలిపారు. భారీగా పెరిగిన విమాన చార్జీల దృష్ట్యా ఐఆర్‌సీటీసీ ఫ్లైట్‌ ప్యాకేజీలను తగ్గించి ఎక్కువగా రైల్‌టూర్‌లనే నిర్వహిస్తోంది.

రైళ్లలో రద్దీ..
ఇక హైదరాబాద్‌ నుంచి విజయవాడ, వైజాగ్‌, తిరుపతి, బెంగళూరు, గోవా, ఢిల్లీ, ముంబై, షిరిడీ తదితర ప్రాంతాలకు రాకపోకలు సాగించే రైళ్లలోనూ రద్దీ పెరిగింది. జూన్‌ నెలాఖరు వరకు పలు రైళ్లలో వెయిటింగ్‌ లిస్టు దర్శనమిస్తోంది. వేసవి దృష్ట్యా ఏసీ బెర్తులకు డిమాండ్‌ పెరగడంతో థర్డ్‌ ఏసీ, సెకెండ్‌ ఏసీ బోగీల్లో బెర్తు లభించడం అసాధ్యమే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement