హైదరాబాద్: కంటోన్మెంట్‌లను సమీప మున్సిపాలిటీల్లో విలీనం దిశగా మంగళవారం కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ ఏడాది జనవరి మొదటి వారంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్‌ను జీహెచ్‌ఎంసీ విలీనం చేసేందుకు ఉద్దేశించి కమిటీ ఏర్పాటు చేయగా, తాజాగా దేశ వ్యాప్తంగా పలు కంటోన్మెంట్‌ల విలీనం కోసం కేంద్రం వేర్వేరు కమిటీలను ఏర్పాటు చేసింది. దీంతో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతం జీహెచ్‌ఎంసీలో విలీనంపై సందిగ్ధతకు తెరపడింది. కేంద్రం వీలైనంత త్వరలోనే ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది.
మహారాష్ట్రలోని ఔరంగాబాద్, డేహూ రోడ్, దేవ్‌లాలీ, ఉత్తరప్రదేశ్‌లోని బబినీ, ఫతేఘర్, మధుర, షాజహాన్‌పూర్, రాజస్థాన్ అజ్మీర్, నసీరాబాద్, మధ్యప్రదేశ్‌లోని మోరార్, ఉత్తరాఖండ్‌లోని అల్మోరా, డెహ్రాడూన్, క్లెమెంట్ టౌన్, రూర్కీ కంటోన్మెంట్‌లను సమీప మున్సిపాలటీల్లో విలీనం చేసేందుకు కమిటీలు ఏర్పాటు చేస్తూ రక్షణ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సంబంధిత కమిటీలు రెండు నెలల్లో నివేదిక సమర్పించాలని సూచించారు. సికింద్రాబాద్‌కు సంబంధించి ఏర్పాటైన కమిటీ ఫిబ్రవరిలోనే కేంద్రానికి నివేదిక సమర్పించింది.
తదనంతరం దేశ వ్యాప్తంగా 56 కంటోన్మెంట్‌లలో ఎన్నికల కోసం నోటిఫికేషన్ జారీ చేసినప్పటికీ, కేంద్రం అర్ధంతరంగా ఉత్తర్వులను ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. నాటి నుంచి కంటోన్మెంట్‌ల భవితవ్యంపై పలు ఊహాగానాలు వెలువడగా, తాజా ఉత్తర్వులతో విలీనం దిశగానే కేంద్రం ముందుకెళ్తోందని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment