
సాక్షి, సిటీబ్యూరో/అంబర్‌పేట: కమలం పార్టీ రాష్ట్ర సారథిగా నగర నేతకు అధినాయకత్వం పట్టం కట్టింది. ఆయన ఈ పదవిని అధిష్టించడం మూడోసారి కావడం గమనార్హం. కేంద్ర మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ ఎంపీ గంగాపురం కిషన్‌రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో రెండుసార్లు ఉమ్మడి రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరించిన కిషన్‌రెడ్డికి మరోసారి పగ్గాలు అప్పగించడం ద్వారా నగర బీజేపీకి పార్టీ హైకమాండ్ అధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది.
రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపూర్‌లో జన్మించిన కిషన్‌రెడ్డి మూడు దఫాలు ఎమ్మెల్యేగా, శాసన సభా పక్ష నేతగా వ్యవహరించారు. దీంతో ఆయనకు నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కేడర్‌తో ప్రత్యేక సంబంధాలు ఏర్పడ్డాయి. ప్రజా సంఘాలతో సైతం కిషన్‌రెడ్డి తనదైన శైలిలో సంబంధాలు ఏర్పరుచుకున్నారు. నగర సమస్యలపై పోరాడి వాటిని పరిష్కరించుకునే వారు. నిత్యం అంబర్‌పేట నియోజకవర్గంలో ప్రజా సమస్యలపై పాదయాత్ర చేసి తిరిగా శాసన సభ వ్యవహారాలు నిర్వహించేవారు.
కలిసొచ్చిన ఓటమి..
2018లో నాలుగోసారి అంబర్‌పేట అసెంబ్లీ బరిలో నిలిచి ఓటమి పాలయ్యారు. కార్వాన్ అసెంబ్లీ నుంచి 1999లో ఓటమి పాలయ్యారు. 2004 నుంచి వరుసగా 2014 వరకు మూడు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ సాధించారు. 2018 ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 1,015 ఓట్లతో ఓడిపోయారు. ఆ తర్వాత వచ్చిన పార్టమెంటు ఎన్నికల్లో సికింద్రాబాద్ బరిలో నిలిచి విజయం సాధించారు.
చదవండి: బండి సంజయ్ ను ఎందుకు తప్పించారు?
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి సెంటిమెంట్ పార్లమెంటు ఎన్నికల్లో కలిసి వచ్చిందని అందరూ భావించారు. మొదటిసారి ఎంపీ కాగానే ఏకంగా కేంద్ర మంత్రి పదవి కిషన్‌రెడ్డిని వరించింది. రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు నిర్వహించనున్న కిషన్‌రెడ్డికి నగరానికి చెందిన గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సస్పెన్షన్ అంశం తేల్చడం కొంచెం సవాల్‌తో కూడుకున్నదేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తాజాగా రాష్ట్ర నాయకత్వం మారడంతో రాజాసింగ్‌పై ఈ అంశంపై ఎలాంటి నిర్ణయం ఉంటుందోనని ఉత్కంఠ లేకపోలేదు.
Comments
Please login to add a commentAdd a comment