సాక్షి, సిటీబ్యూరో: ఆకాశానికి చిల్లు పడిందా? అన్నట్టుగా మూడ్రోజులుగా నిరంతరాయంగా కురుస్తున్న వర్షాలతో మహానగరం జలమయంగా మారింది. జన జీవనం స్తంభించింది. వర్షాలకు నగరంలో లోతట్టు ప్రాంతాలన్నీ నీటమునిగాయి. రోడ్లపై భారీగా వరద నీరు ప్రవహిస్తుండటంతో ఎక్కడికక్కడే ట్రాఫిక్‌జాం అవుతోంది. సోమవారం రాత్రి చిరుజల్లులతో మొదలై.. గురువారం అర్ధరాత్రి వరకు దంచి కొడుతూనే ఉంది.
లోతట్టు ప్రాంతాలు విలవిల..
నగరంలో భారీ వర్షాలకు పలు లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి. టోలీచౌకి మరోసారి నీటమునిగింది. నిజాం కాలనీ, మీరాజ్ కాలనీ లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి దేవాలయం వద్ద భారీగా వరద నీరు నిలిచిపోయింది. లింగంపల్లి రైల్వే అండర్ పాస్ కిందకు భారీగా వరదనీరు చేరడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతోంది.
కూలుతున్న పాత గృహాలు
ఎడతెరిపిలేని వర్షాలతో దెబ్బతిన్న పురాతన ఇళ్లు కూలిపోతున్నాయి. పలు ప్రాంతాల్లో చెట్లు నెలకొరిగాయి. కవాడిగూడలో శిథిలావస్థకు చేరిన ఇల్లు కుప్పకూలింది. కూలిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. బేగం బజార్‌లోనూ పాతఇల్లు వర్షానికి కూలిపోయింది.
రంగంలోకి ఈఆర్టీ..
జలమండలి సుమారు 16 ఈఆర్టీ బందాలను జలమండలి ఏర్పాటు చేసింది. వర్షపు నీరు నిలిచిన ప్రాంతంలో వాటిని తొలగించేందుకు వీరికి ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేశారు. ఆరు ఎస్పీటీ వాహనాలను సైతం అందుబాటులో ఉంచారు. మరో 16 మినీ ఎయిర్ టెక్ వాహనాలను సైతం 24 గంటలు అందుబాటులో ఉంచారు.. ఎక్కడైనా మ్యాన్ హోల్ మూత ధ్వంసమైనా, తెరిచి ఉంచినట్లు గమనించినా.. జలమండలి కస్టమర్ కేర్ నంబరు 155313కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వొచ్చు.
నగరమంతా ట్రాఫిక్ నరకం
రాజధాని రోడ్లపై వాహనశ్రేణులు నత్తలతో పోటీ పడ్డాయి. వరుస వర్షాలతో ఛిద్రమైన రోడ్లన్నీ జలమయంగా మారి.. ట్రాఫిక్ ఎక్కడిక్కడ ఆగిపోయింది. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని హైటెక్ సిటీ చుట్టుపక్కల ప్రాంతాల్లో పరిస్థితి మరీ దారుణంగా మారింది. నగర వ్యాప్తంగా దాదాపు 67 ప్రాంతాల్లో ఉన్న వాటర్ లాగింగ్ ఏరియాల కారణంగా రోడ్లన్నీ చెరువులుగా మారి ఎక్కడిక్కడ ట్రాఫిక్ జామ్స్ ఏర్పడ్డాయి. నాగోలు–మెట్టుగూడ, సికింద్రాబాద్–బేగంపేట్, ఎల్బీనగర్– చాదర్‌ఘాట్, ఎంజే మార్కెట్–నాంపల్లి, పంజగుట్ట–కూకట్‌పల్లి, బయోడైవర్శిటీ పైలాన్–హైటెక్ సిటీ ప్రాంతాల్లో వాహనాలు భారీ సంఖ్యలో ఆగిపోయాయి.
కలెక్టరేట్‌లో కంట్రోల్ రూం
వర్షాలతో ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ చాంబర్ నుంచి కలెక్టర్ జిల్లాలోని రెవెన్యూ అధికారులతో నిర్వహించిన టెలీకాన్షరెన్స్‌లో మాట్లాడారు. ముంపు ప్రాంతాల బాధితులను గుర్తించి వారిని వెంటనే ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు పంపించాలన్నారు. కలెక్టరేట్‌లో కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.
అప్రమత్తమైన జలమండలి
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో జలమండలి అప్రమత్తమైంది. ఎండీ దానకిశోర్ ఖైరతాబాద్‌లోని ప్రధాన కార్యాలయంలో గురువారం ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. ఇప్పటికే క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్‌లు (ఈఆర్టీ), ఎస్పీటీ వాహనాలు సైతం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. తాగునీటి సరఫరా, నాణ్యతపై జలమండలి ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు. కలుషిత నీరు సరఫరా కాకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, తాగునీటిలో తగిన మోతాదులో క్లోరిన్ ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు. ఎక్కడైనా మ్యాన్ హోల్ మూత ధ్వంసమైనా, తెరిచి ఉంచినట్లు గమనించినా.. జలమండలి కస్టమర్ కేర్ నంబరు 155313కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు.
పురాతన భవనాలతో భయం.. భయం..
పురాతన, శిథిల భవనాలు ఎప్పుడు కూలుతాయో తెలియక పరిసరాల్లోని ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. పురాతన భవనాలపై అప్రమత్తంగా ఉండాల్సిందిగా మేయర్ విజయలక్ష్మి జీహెచ్‌ఎంసీ అధికారులను ఆదేశించారు. వర్షాలతో ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కొనేందుకు అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ రోనాల్డ్‌రాస్ అధికారులకు సూచించారు.
45 ఫిర్యాదులు..
గురువారం మధ్యాహ్నం వరకు జీహెహెచ్‌ఎంసీ ఈవీడీఎం డీఆర్‌ఎఫ్‌కు 45 ఫిర్యాదులందాయి. రెండు ప్రాంతాల్లో గోడలు కూలగా, 24 చెట్లు కూలాయి. 15 ప్రాంతాలు నీటమునిగాయి. ఈవీడీఎం డైరెక్టర్ ప్రకాశ్‌రెడ్డి సైతం క్షేత్రస్థాయిలో పరిస్థితుల్ని పరిశీలిస్తున్నార డీఆర్‌ఎఫ్ సహాయం కోసం 90001 13667కు ఫోన్ చేయాల్సిందిగా పేర్కొన్నారు.
విద్యుత్ ఇంజినీర్ల సెలవులు రద్దు
భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్ సంస్థల్లో పని చేస్తున్న ఇంజినీర్లు, ఇతర సిబ్బంది సెలవులను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ రఘుమారెడ్డి చెప్పారు. వర్షాల కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లోని 345 కరెంట్ స్తంభాలు నేలకూలినట్లు తెలిపారు. ఇంజినీర్లు హెడ్‌క్వార్టర్ వదిలి వెళ్లకూడదని ఆదేశాలు జారీ చేశారు.
ఆరోగ్య శాఖ హెల్ప్‌లైన్
రాంగోపాల్‌పేట్: ప్రజారోగ్యంపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ వెంకటి సంబంధిత అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు. వర్షాలు, వరదల వల్ల ప్రజలకు కలిగే అనారోగ్య సమస్యలను ఎదుర్కోవటానికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలను ఏర్పాటు చేయడంతో పాటు ఎలాంటి అనారోగ్య సమస్యలు, వరదలు, వర్షాలకు సంబంధించిన సమస్యలు ఉన్నా 24 గంటలు పనిచేసే 8897 54979 నంబర్‌కు కాల్ చేయవచ్చని చెప్పారు. వైద్య సిబ్బంది సెలవులను రద్దు చేసినట్లు ఆయన తెలిపారు.
ఈ నెల 25 వరకూ భారీ వర్షాలే
ఈ నెల 25 వరకు హైదరాబాద్ జిల్లాలో నిరంతరాయంగా వర్షాలు కురుస్తాయని గురువారం వాతావరణ శాఖ తన నివేదికలో వెల్లడించింది. ఈ క్రమంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి సిబ్బందిని నియమించారు. కంట్రోల్ రూమ్ నంబర్ 040– 23202813 ఏదైనా సమాచారం కోసం ఫోన్ చేయాలన్నారు.
‘ఎఫ్‌టీఎల్’ దాటిన హుస్సేన్‌సాగర్
వరుస వర్షాలతో హుస్సేన్‌సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టాన్ని దాటింది. పూర్తిస్థాయి నీటిమట్టం (ఎఫ్‌టీఎల్) 513.41 మీటర్లు కాగా గరిష్ట నీటి మట్టం (ఎండబ్ల్యూఎల్) 514.75 మీటర్లు. గురువారం రాత్రి 7.15 గంటలకు నీరు 513.45 మీటర్లకు చేరుకుంది. కాగా.. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని అధికారులు పేర్కొన్నారు. గతంలోనూ ఎఫ్‌టీఎల్‌ను దాటడాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు.
ఓయూలో పరీక్షలు వాయిదా
లాలాపేట: ఈ నెల 20, 21 (గురు, శుక్రవారాల్లో) తేదీల్లో ఓయూ పరిధిలో జరగనున్న అన్ని పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఓయూ రిజిస్ట్రార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వాయిదా వేసిన పరీక్షల తేదీలను త్వరలో ప్రకటిస్తామని స్పష్టంచేశారు.
క్యాబ్ హైక్.. మెట్రో పీక్..
వరుస వర్షాలతో మెట్రో రైళ్లు కిటకిటలాడుతున్నాయి. రద్దీ మార్గాల్లో మెట్రో సర్వీసుల సంఖ్య పెంచారు. అయినప్పటికీ క్యాబ్‌లు, ఆటోలకు ఏ మాత్రం డిమాండ్ తగ్గలేదు. క్యాబ్‌లు, ఆటోల చార్జీలు రెట్టింపయ్యాయి. నగరంలోని వివిధ మార్గాల్లో సిటీబస్సు బాగా తగ్గాయి. ట్రాక్ పునరుద్ధరణ, మౌలిక సదుపాయాల నెపంతో కొద్ది రోజులుగా దక్షిణమధ్య రైల్వే వివిధ మార్గాల్లో పలు ఎంఎంటీఎస్ రైళ్లను సైతం రద్దు చేసింది. ప్రయాణికులు ఎంఎంటీఎస్ సర్వీసుల్లో గమ్యస్థానాలకు చేరుకొనే అవకాశం లేకుండాపోయింది. దీంతో ఎక్కువ మంది ఆటోలు, క్యాబ్‌లు, మెట్రోపై ఆధారపడాల్సి వచ్చింది. బైక్‌లపై వెళ్లే వాహనదారులు సైతం ఎడతెరిపిలేని వర్షాల కారణంగా మెట్రో వైపు మొగ్గు చూపడంతో ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. మరోవైపు వర్షం వల్ల స్విగ్గీ, జొమాటో తదితర యాప్‌లకు సైతం డిమాండ్ పెరిగింది. దీంతో ఫుడ్ డెలివరీల్లో జాప్యం చోటుచేసుకుంది. వర్షాలతో క్యాబ్‌ల కొరతను సాకుగా చూపుతూ చార్జీలను రెట్టింపు చేశారు.
ఎల్‌బీనగర్ పరిధిలో ఉద్యోగులు, ఇతర పనులపై బయటికివచ్చిన వారు వర్షంలో అవస్థలు పడ్డారు. అడ్డా కూలీలు ఇళ్లకే పరిమితమయ్యారు.
దిల్‌సుఖ్‌నగర్, మలక్‌పేట పరిధిలోని నల్లగొండ క్రాస్‌రోడ్డు, మలక్‌పేట, సైదాబాద్‌ల్లో ట్రాఫిక్ స్తంభించింది. ఎల్‌బీనగర్ వరకు రహదారులు గోదారిని తలపించాయి.
ఉప్పల్– వరంగల్ జాతీయ రహదారి పూర్తిగా వరద నీటితో నిండటంతో ఎక్కడ ఏ గుంత ఉందో తెలియక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలువురు వాహనదారులు ప్రమాదాలకు గురయ్యారు.
కాప్రా– నాగారం నాలా ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో అధికారులు సోనియాగాంధీ నగర్, శుభోదయ కాలనీ, వెస్ట్ గాంధీనగర్ కాలనీల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
మల్కాజిగిరి ఈస్ట్ ఆనంద్‌బాగ్ డివిజన్‌లో ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం వద్ద, ఆర్కే నగర్‌లో చెట్లు కూలాయి. వసంతపురి సబ్ స్టేషన్ పరిధిలో విద్యుత్ తీగలపై చెట్ల కొమ్మలు విరిగిపడి విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది.
కూకట్‌పల్లి పరిధిలోని ఆల్విన్‌కాలనీ ధరణినగర్‌లో పలు ఇళ్లలోకి పాములు, విష పురుగులు వచ్చాయి. పక్కనే పరికి చెరువు ఉండటంతో పాములు వస్తున్నాయని స్థానికులు వాపోతున్నారు.
మూసాపేట డివిజన్ బబ్బుగూడలో ఓ ఇంటి గోడ కూలింది. మట్టి ఇల్లు కావడంతో వర్షానికి కూలిపోయింది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.
చార్మినార్ యునానీ ఆస్పత్రి పైకప్పు పెచ్చులూడిపోయి వర్షపు నీరు వార్డులోకి చేరింది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా గర్భిణులను పక్క వార్డులోకి తరలించారు. కొంతమందిని డిశ్చార్జి చేశారు.
గోల్కొండ నానల్‌నగర్ డివిజన్ నదీమ్ కాలనీలోని దిగువ ప్రాంతాల వారు ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లారు.
బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ పంజగుట్ట, ఎస్‌ఆర్‌నగర్ సైఫాబాద్ పోలీసులు వరద నీటి ప్రభావిత ప్రాంతాల్లో చర్యలు చేపట్టినా పరిస్థితి అదుపులోకి రాలేదు.
Comments
Please login to add a commentAdd a comment