మున్సిపల్ ఛైర్మన్ అబ్దుల్లా సాది
హైదరాబాద్: పాతబస్తీ బండ్లగూడలో కలకలం సృష్టించిన రౌడీషీటర్ హత్య కేసును సౌత్‌ఈస్ట్ జోన్ పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. రాజకీయంగా తమను అప్రతిష్ట పాల్జేస్తున్న రౌడీషీటర్‌ను హత్య చేయాలని కుట్ర పన్నిన జల్‌పల్లి మున్సిపాలిటీ చైర్మన్.. హతుడికి స్నేహితుడైన మరో రౌడీషీటర్ హోమోసెక్స్ అలవాటను ఆయుధంగా ప్రయోగించి హత్య చేశాడు. దీన్ని హోమోసెక్స్ వివాదంగా మార్చాలనే యత్నం చేశాడు. అయితే వారి కుట్రను పోలీసులు బట్టబయలు చేశారు. బుధవారం సైదాబాద్‌లోని తన కార్యాలయంలో డీసీపీ రూపేష్ వివరాలు వెల్లడించారు.
జైలులో ఏర్పడిన పరిచయంతో..
► బార్కాస్‌కు చెందిన షేక్ సయీద్ బిన్ అబ్దుల్ రహ్మాన్ బవజీర్ (27) చాంద్రాయణగుట్ట పీఎస్ పరిధిలో రౌడీషీటర్. హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్‌ల పరిధిలో 3 పోక్సో కేసులు సహా మొత్తం 9 కేసుల్లో నిందితుడు. బండ్లగూడలో ఆఫీస్ ఏర్పాటు చేసుకొని యూ ట్యూబర్‌గా పని చేస్తున్నాడు. బవజీర్‌కు 2021లో జైలులో ఉన్న సమయంలో భవానీనగర్ పీఎస్ పరిధి రౌడీషీటర్ అయిన వాషింగ్ మెషిన్ మెకానిక్ అహ్మద్ బిన్ హజీబ్‌తో పరిచయమైంది. జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా వారు స్నేహం కొనసాగిస్తున్నారు. వీరిద్దరికీ హోమోసెక్స్‌వల్ అలవాటు ఉంది. అందుకు తన స్నేహితులను తీసుకురమ్మని హజీబ్‌ను బవజీర్ వేధించేవాడు. దీంతో అతను తన స్నేహితులను తెచ్చేవాడు.
రూ.13 లక్షలకు ఒప్పందం..
ఈ నేపథ్యంలో బవజీర్.. జల్‌పల్లి మున్సిపాలిటీలో అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయంటూ తరచూ తన యూట్యూబ్‌లో ప్రచారం చేసేవాడు. అతని వీడియోలతో ప్రతిష్ట దెబ్బ తింటోందని, రాజకీయంగా తమకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని జల్‌పల్లి మున్సిపల్ చైర్మన్ అబ్దుల్లా సాదీ, అహ్మద్ సాదీ, సాలేహ్ సాదీ, ఒమర్ సాదీ భావించారు. హజీబ్‌కు బంధువైన ఒమర్ సాదీ అతడిని బార్కాస్‌కు తీసుకువెళ్లి మిగిలిన వారిని పరిచయం చేశాడు. బవజీర్‌ను తమపై అనుమానం రాకుండా హతమారిస్తే రూ. 13 లక్షలు ఇచ్చేలా వారి మధ్య ఒప్పందం కుదిరింది.
బాలుడిని తీసుకొచ్చి..
► బవజీర్ హోమోసెక్స్ అలవాటును ఆసరాగా చేసుకొని హత్య చేయాలని హజీబ్ ప్లాన్ వేశాడు. ఈ నెల 9న గతంలో హోమోసెక్స్‌కు పాల్పడిన బాలుడిని తీసుకు వస్తున్నట్లు బవజీర్‌కు ఫోన్‌లో చెప్పాడు. హజీబ్ తన స్నేహితుడు మహ్మద్ అయూబ్‌ఖాన్‌ను, బాలుడిని తీసుకొని బవజీర్ ఆఫీస్‌కు వెళ్లాడు. బవజీర్ బాలుడితో కలిసి ఉన్న హజీబ్ లోనికి వెళ్లి తనతో తెచ్చుకున్న కారం పొడిని బవజీర్ కళ్లలో చల్లి అతడిని కత్తితో పొడిచి హతమార్చి అక్కడి నుంచి వాహనాలపై పారిపోయారు.
► కేసు దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులు హజీబ్, జల్‌పల్లి మున్సిపల్ చైర్మన్ అబ్దుల్లా సాదీ, అహ్మద్ సాదీ, అయూబ్‌ఖాన్‌లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సాలేహ్ సాదీ, ఒమర్ సాదీలు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. బవజీర్ తనకు ప్రాణహాని ఉందని బతికి ఉన్న సమయంలోనే పోలీసులకు, హోంమంత్రికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ విషయమై డీసీపీ మాట్లాడుతూ.. అతని ఫిర్యాదులను కోర్టు అనుమతుల కోసం పంపామని, ఎలాంటి ఫిర్యాదులపై అయినా తాము వెంటనే స్పందిస్తామని ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment