హైదరాబాద్: నిలోఫర్ ఆస్పత్రి నుంచి గత గురువారం అపహరణకు గురైన ఆరు నెలల బాలుడి ఆచూకీ దొరికింది. బాన్సువాడలో ఆ చిన్నారికి రెస్క్యూ చేసిన పోలీసులు ఇద్దరు నిందితులను పట్టుకున్నారు. బషీర్‌బాగ్‌లోని ఓల్డ్ కమిషనరేట్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మధ్య మండల డీసీపీ ఎం.వెంకటేశ్వర్లు పూర్తి వివరాలు వెల్లడించారు. ఈ వ్యవహారంలో అమ్మా, నాన్న అని పిలిపించుకోవాలనే మమకారం తప్ప ఎలాంటి ఇతర కోణం లేదని పోలీసులు నిర్ధారించారు. ఈ నేపథ్యంలోనే నిందితులపైనా పోలీసులు మానవత్వం చూపడం కొసమెరుపు.
కుమారుడి వైద్యం కోసం రాగా..
► కామారెడ్డి జిల్లా కొత్తాబాద్ తండాకు చెందిన కె.మమత, కూరగాయల వ్యాపారి శ్రీను దంపతులు. వీరికి గతంలో ఇద్దరు మగ పిల్లలు పుట్టినా హైపర్ విస్కోసిటీ సిండ్రోమ్ అనే జన్యుపరమైన వ్యాధితో చనిపోయారు. ఇటీవలే మమతకు మరో బాబు పుట్టాడు. పది రోజుల వయసున్న అతడికీ అదే వ్యాధి సోకిందని, బతికే అవకాశం లేదని వైద్యులు చెప్పారు. దీంతో ఓ మగ శిశువుని కిడ్నాప్ చేసి పెంచుకుందామని ఈ దంపతులు పథకం వేశారు. దీన్ని అమలులో పెట్టడంలో భాగంగా ఇద్దరూ కలిసి తమ చిన్నారితో గత గురువారం నగరానికి చేరుకున్నారు.
► గండిపేట్ రోడ్డు ప్రాంతానికి చెందిన ఫరీదా బేగానికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు (4) అనారోగ్యం బారిన పడ్డాడు. దీంతో ఆమె పెద్ద కుమారుడు, చిన్న కుమారుడిని (6 నెలలు) తీసుకుని కలిసి గత గురువారం ఉదయం నిలోఫర్ ఆస్పత్రికి వచ్చింది. పెద్ద కుమారుడిని తండ్రి వైద్యుల వద్దకు తీసుకువెళ్లగా.. ఫరీదా బేగం తన చిన్న కుమారుడితో కలిసి వెయిటింగ్ హాల్‌లో ఉంది. సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో బాలుడు నిద్రించడంతో ఆమె బాలుడిని అక్కడే పడుకోపెట్టి ఆహారం కోసం బయటికి వెళ్లింది. అప్పటికే ఆమెతో మాటలు కలిపిన మమత తన కుమారుడి వైద్యం కోసం వచ్చానని చెప్పింది.
సొంతూరికి వెళితే అనుమానిస్తారని..
ఫరీదా తన చిన్న కుమారుడిని వదిలి వెళ్లడంతో అదను కోసం వేచి చూసిన మమత.. తన కుమారుడిని అక్కడే వదిలేసి ఆరు నెలల బాలుడిని తీసుకుని ఉడాయించింది. అక్కడ నుంచి ఆటోలో జూబ్లీబస్ స్టేషన్‌కు చేరుకోగా.. లక్డీకాపూల్ ప్రాంతంలో వేచి ఉన్న ఆమె భర్త శ్రీను బస్సులో వెళ్లాడు. అక్కడ కలుసుకున్న ఇద్దరూ కొన్నిరోజులు స్వగ్రామానికి వెళ్లకూడదని భావించారు. తమ పది రోజుల శిశువు స్థానంలో ఆరు నెలల బాలుడిని తీసుకువెళ్తే ఎవరైనా అనుమానిస్తారని, ఈ నేపథ్యంలో మరో ఆరు నెలలు బాన్సువాడలో తల దాచుకోవాలని నిర్ణయించుకున్నారు.
బాన్సువాడలో ఉన్న తన స్నేహితుడి ద్వారా శ్రీను ఓ గదిని అద్దెకు తీసుకున్నాడు. గత శుక్రవారం నుంచి నిందితులు ఇద్దరూ కిడ్నాప్ చేసిన బాలుడితో అందులోనే ఉంటున్నారు. ఈ శిశువుకు మమత బ్రెస్ట్ ఫీడింగ్ ద్వారా పాలు ఇస్తూ జాగ్రత్తగా చూసుకుంది. వీళ్లు నిలోఫర్‌లో వదిలేసిన బాలుడిని అదే రోజు గుర్తించిన వైద్య సిబ్బంది నాంపల్లి ఠాణాలో ఫిర్యాదు చేయడంతో గుర్తుతెలియని నిందితులపై కేసు నమోదైంది. ఫరీదా ఫిర్యాదు మేరకు మరో కిడ్నాప్ కేసు రిజిస్టర్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment