సినీ భాషలోనే డ్రగ్స్‌ దందా! | Hyderabad: Tollywood Actor Navdeep- Madhapur Drugs Case - Sakshi
Sakshi News home page

సినీ భాషలోనే డ్రగ్స్‌ దందా!

Published Wed, Sep 27 2023 7:42 AM | Last Updated on Thu, Sep 28 2023 4:26 PM

- - Sakshi

హైదరాబాద్‌: సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్లలోని ఠాణాల్లో నమోదైన ‘టాలీవుడ్‌ డ్రగ్స్‌’ కేసుల దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సినీ రంగానికి చెందిన వారు మాదకద్రవ్యాల దందాను వారి పారిభాషిక పదాలనే కోడ్‌ వర్డ్స్‌గా వినియోగించే చేస్తున్నట్లు వెల్లడైంది. మరోపక్క టీఎస్‌ నాబ్‌ అధికారులు నటుడు నవదీప్‌ నుంచి స్వాధీనం చేసుకున్న సెల్‌ఫోన్‌ను విశ్లేషిస్తున్నారు. న్యాయస్థానం నుంచి ముందస్తు బెయిల్‌ పొందిన నిందితులు మంగళవారం దర్యాప్తు అధికారి ఎదుట హాజరయ్యారు. ఇటీవల కాలంలో టాలీవుడ్‌తో లింకులు ఉన్న డ్రగ్స్‌ కేసులు రెండు నమోదయ్యాయి. సైబరాబాద్‌ పోలీసులు పట్టుకున్న కేపీ రెడ్డికి సంబంధించిన కేసు మాదాపూర్‌ ఠాణాలో నమోదైంది.

టీఎస్‌ నాబ్‌ అధికారులు గుట్టురట్టు చేసిన వెంకట రమణరెడ్డి లింకులకు సంబంధించిన కేసు హైదరాబాద్‌ కమిషనరేట్‌లోని గుడిమల్కాపూర్‌ ఠాణాలో రిజిస్టరైంది. ఈ కేసులోనే హీరో నవదీప్‌ పేరు బయటపడింది. ఈ రెండు కేసుల్లోనూ అనేక మంది టాలీవుడ్‌ నటులు, నిర్మాతలు, దర్శకులతో పాటు మోడళ్ళు సైతం డ్రగ్స్‌ వినియోగదారులుగా ఉన్నట్లు బయటపడింది. వీళ్ళు రహస్య ప్రాంతాల్లో, పొరుగు రాష్ట్రాల్లో పార్టీలు నిర్వహించుకుంటూ, మాదకద్రవ్యాలు వినియోగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సాధారణంగా డ్రగ్స్‌ క్రయవిక్రయాల్లో వాటి పేర్లను డైరెక్టుగా వాడరు. ఎవరికి వాళ్ళు కొన్ని కోడ్‌ వర్డ్స్‌ పెట్టుకుని పని పూర్తి చేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే సినీ రంగానికి చెందిన వారు ఆ పారిభాషిక పదాలతోనే డ్రగ్స్‌కు కోడ్‌ వర్డ్స్‌ రూపొందించినట్లు పోలీసులు గుర్తించారు.

నటులు, దర్శకులు, నిర్మాతలతో పాటు మోడల్స్‌ సైతం ఎక్కువగా కొకై న్‌ను వినియోగిస్తుంటారని అధికారులు చెప్తున్నారు. దీంతో ఈ డ్రగ్‌కు స్క్రిప్ట్‌ అనే కోడ్‌ వర్డ్‌ ఏర్పాటు చేసుకున్నారు. అలాగే మాదకద్రవ్యాలు సరఫరా చేసే డ్రగ్‌ పెడ్లర్‌కు రైటర్‌ అని, డ్రగ్స్‌ రావాలని అడగటానికి ‘షెల్‌ వీ మీట్‌’ అని కోడ్స్‌ ఏర్పాటు చేసుకున్నారు. వారి వారి ఫోన్లు విశ్లేషించినప్పుడు ఈ పదాలే కనిపించాయని దర్యాప్తు అధికారులు చెప్తున్నారు.

మరోపక్క నవదీప్‌ నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న ఫోన్‌ విశ్లేషణ ప్రారంభమైంది. ఈ ఫోన్‌ను పోలీసులకు అప్పగించే ముందే నవదీప్‌ ఫార్మాట్‌ చేసినట్లు గుర్తించారు. దీంతో డిలీట్‌ అయిన డేటాను రిట్రీవ్‌ చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. ఇప్పటికే దర్యాప్తులో గుర్తించిన అంశాలను బట్టి ఈ డ్రగ్స్‌ క్రయవిక్రయాలన్నీ స్నాప్‌చాట్‌ ఆధారంగా జరిగాయి. ఈ సోషల్‌మీడియా యాప్‌లో ఉన్న డిజ్‌అప్పీర్‌ ఆప్షన్‌ను పెడ్లర్లు, వినియోగదారులు తమకు అనుకూలంగా మార్చుకున్నారు.

గుడిమల్కాపూర్‌ కేసులో నిందితులుగా ఉండి, న్యాయస్థానం నుంచి మందస్తు బెయిల్‌ తీసుకున్న వ్యాపారి కలహర్‌రెడ్డి, పబ్‌ నిర్వాహకుడు సూర్య కాంత్‌ సహా మరో వ్యక్తి మంగళవారం దర్యాప్తు అఽధికారి ఎదుట హాజరయ్యారు. గుడిమల్కాపూర్‌ ఠాణాలో ష్యూరిటీలు సమర్పించడంతో పాటు ఎప్పుడు పిలిచినా విచారణకు హాజరవుతాయని హామీ ఇచ్చారు. కలహర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... ‘హైకోర్టు ఆదేశాల మేరకు గుడిమల్కాపూర్‌ పోలీసుస్టేషన్‌ లో లొంగిపోయా. నాకు, డ్రగ్స్‌ కేసుకి ఎలాంటి సంబంధం లేదు. విచారణకు పూర్తిగా సహకరించాను.. తర్వాత కూడా సహకరిస్తాను. పోలీసులు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తా. నాకు డ్రగ్స్‌ తీసుకునే అలవాటు లేదు’ అని అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement