నాంపల్లి: బజార్‌ఘాట్‌లో అగ్ని ప్రమాదానికి గురైన బాలాజీ అపార్ట్‌మెంట్ యజమాని రమేష్ కుమార్ జైస్వాల్ ఆచూకీ లభించడం లేదు. సోమవారం అగ్ని ప్రమాదం సంభవించిన సమయంలో అపార్ట్‌మెంట్ లో కనిపించిన ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో వెలువడిన (మిథైల్ బెంజిన్) విషవాయువులను పీల్చుకుని సృహతప్పి పడిపోయారు.
వెంటనే అతడిని ఓ ప్రైవేట్ అంబులెన్స్‌లో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. స్పృహ కోల్పోయిన ఆయనను ఏ ఆసుపత్రిలో చేర్చారు? ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఏమిటనే విషయం ఎవరికీ అంతు చిక్కడం లేదు. అయితే పోలీసులు సైతం అతడు చికిత్స పొందుతున్న విషయాన్ని గోప్యంగా ఉంచినట్లు తెలుస్తోంది. ఇదే విషయమై నాంపల్లి పోలీసులను వివరణ కోరగా స్పందించలేదు. ఇదిలా ఉండగా సోమవారం జరిగిన అగ్ని ప్రమాదం సంఘటనలో ఆయనపై పోలీసులు 304, 285, 286 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
అపార్ట్‌మెంట్‌ను పరిశీలించిన జేఎన్టీయూ నిపుణుల బృందం
అగ్ని ప్రమాదానికి గురైన బాలాజీ అపార్ట్‌మెంట్‌ను జేఎన్టీయూ నిపుణుల బృందం మంగళవారం సాయంత్రం పరిశీలించింది. ఖైరతాబాద్ జోన్ సిటీ ప్లానర్ రంజిత్ కుమార్ నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కూడిన నిపుణుల బృందం అగ్ని ప్రమాదంలో దెబ్బతిన్న అపార్ట్‌మెంట్ స్థితిగతులను, పూర్వాపరాలను పరీక్షించింది. భవంతిలోని నాలుగు అంతస్తులను నిపుణుల బృందం, జీహెచ్‌ఎంసీ అధికారుల బృందం సంయుక్తంగా సుమారు 60 నిమిషాల పాటు పరిశీలన చేసింది. సెల్లారుతో పాటుగా దెబ్బతిన్న అంతస్తులు ఎన్ని? ప్రమాదానికి గురికాని అంతస్తులెన్ని అనే వాటిపై లెక్కలు వేశారు.
భవనానికి వినియోగించిన ఇటుకలు, సిమెంటు, ఇసుక, ఇనుము నాసిరకమైనవి వాడినట్లుగా గుర్తించారు. ఒక్కో అంతస్తుకు రెండు ఫ్లాట్స్ చొప్పున నాలుగు అంతస్తులకు ఎనిమిది ఫ్లాట్స్‌ను నిర్మించినట్లు గుర్తించారు. 1998లో జీహెచ్‌ఎంసీ నుంచి అనుమతులు పొందారు. జీ 1 నిర్మాణానికి అనుమతులు తీసుకుని నాలుగంతస్తులు నిర్మించారు. 286 గజాల విస్తీర్ణంలో నిర్మించిన భవనానికి ఫైర్ సేప్టీ లేదు. క్రోడీకరించిన అన్ని అంశాలను నివేదిక రూపంలో బుధవారం జీహెచ్‌ఎంసీకి అందజేస్తామని జేఎన్టీయూ నిపుణుల బృందం వెల్లడించింది. ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్ సర్కిల్–12 టౌన్ ప్లానింగ్ ఏసీపీ కృష్ణమూర్తి, టీపీఎస్ నర్సింగ్‌రావు, చైన్‌మెన్లు మోహన్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment