మంటలను ఆర్పుతున్న ఫైర్ సిబ్బంది
రాజేంద్రనగర్: షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ అపార్ట్‌మెంట్ సెల్లార్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నిమిషాల వ్యవధిలోనే ద్విచక్ర వాహనాలకు మంటలు వ్యాపించి కాలిబూడిదైన ఘటన రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఉప్పర్‌పల్లి గ్రీన్ రెసిడెన్సీ అపార్ట్‌మెంట్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రీన్ రెసిడెన్సీ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న వారు తమ వాహనాలను, కార్లను సెల్లార్‌లో పార్కు చేశారు. గురువారం రాఖీ పౌర్ణమి కావడంతో వాచ్‌మన్ తన భార్యతో కలిసి సొంతూరు వెళ్లాడు.
గురువారం రాత్రి ఆరు బైక్‌లు, మూడు యాక్టివా వాహనాలు, ఒక కారును అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న వారు పార్కు చేసి నిద్రకు ఉపక్రమించారు. శుక్రవారం ఉదయం 6.30 గంటల ప్రాంతంలో సెల్లార్ నుంచి మంటలు, పొగలు వస్తుండడంతో స్థానికులు అపార్ట్‌మెంట్ వాసులను అప్రమత్తం చేశారు. కిందకు వచ్చేసరికి దట్టమైన పొగ, మంటలు వ్యాపించడంతో విషయాన్ని రాజేంద్రనగర్ పోలీసులు, అత్తాపూర్ ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. అత్తాపూర్ ఫైర్ ఆఫీసర్ చంద్రానాయక్ ఆధ్వర్యంలో హుటాహుటిన చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పారు.
అప్పటికే ఆరు బైక్‌లు, మూడు యాక్టివా వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఒక కారు పాక్షికంగా దగ్ధమైంది. పార్కు చేసిన రెండు కార్లుతో పాటు మరో బైక్‌ను స్థానికులు బయటకు తీసుకురావడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. షాట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment