మంటలను ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది
హైదరాబాద్: ఎల్‌ఈడీ లైట్ హౌజ్ గోదాంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. దాదాపు రూ.50 లక్షలకు పైగా ఆస్తినష్టం వాటిల్లింది. శనివారం సుల్తాన్‌బజార్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ట్రూప్‌బజార్ ఎలక్ట్రికల్ మార్కెట్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. నగరానికి చెందిన సునీల్ అనే వ్యక్తికి కోఠి ట్రూప్ బజార్‌లోని ఫిర్దాస్ మాల్‌లో ఎల్‌ఈడీ లైట్‌హౌజ్ షోరూం ఉంది.
ఫిర్దాస్ మాల్‌లోని 2వ అంతస్తులో ఎల్‌ఈడీ లైట్లతో పాటు జూమర్స్‌ను నిల్వ ఉంచాడు. శనివారం మధ్యాహ్నం షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి దట్టమైన పొగలు వ్యాపించడంతో స్థానిక వ్యాపారులు పోలీసులకు సమాచారం అందించారు. గౌలిగూడ ఫైర్‌స్టేషన్ సిబ్బంది వచ్చి దాదాపు 5 గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
భయభ్రాంతులకు గురైన వ్యాపారులు
కోఠి ట్రూప్‌బజార్ ఎలక్ట్రానిక్ మార్కెట్‌లో దట్టమైన పొగలతో అగ్నిప్రమాదం సంభవించడంతో చుట్టుపక్కల ఉన్న వ్యాపారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దుకాణాలు మూసివేసి వెళ్లిపోయారు. 3వ అంతస్తులో పనివాళ్లు మంటల్లో చిక్కుకున్నారని వదంతులు రావడంతో అగ్నిమాపక సిబ్బంది ఓ మహిళను రిస్క్‌చేసి కిందకు దింపారు. దాదాపు 5 గంటల పాటు ట్రూప్‌బజార్ మార్కెట్‌లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఎట్టకేలకు 3 ఫైర్ ఇంజిన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడంతో వ్యాపారులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment