కండల కోసం ఆరోగ్యం పణం! | - | Sakshi
Sakshi News home page

కండల కోసం ఆరోగ్యం పణం!

Mar 27 2024 7:35 AM | Updated on Mar 27 2024 8:33 AM

- - Sakshi

మెఫెంటర్మైన్‌ సల్ఫేట్‌ ఇంజెక్షన్ల అక్రమ వినియోగం

గుట్టురట్టు చేసిన సౌత్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు

ముగ్గురు నిందితుల అరెస్టు, భారీగా సరుకు స్వాధీనం

సాక్షి, సిటీబ్యూరో: వైద్య రంగంలో అత్యవసర సమయాల్లో వినియోగించే ఇంజెక్షన్లను స్టెరాయిడ్స్‌గా విక్రయిస్తున్న ముఠా గుట్టును దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు రట్టు చేశారు. కొందరు యువకులు తక్కువ కాలంలోనే ఎక్కువ కండలు పెంచేందుకు వీటిని వినియోగిస్తున్నట్లు గుర్తించారు. జిమ్‌లలో అత్యధిక సమయం గడపటానికి స్టెరాయిడ్‌గా ఈ మందులు తీసుకుంటూ తమ ఆరోగ్యాన్ని ఫణంగా పెడుతున్నారని టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ ఎస్‌.రష్మి పెరుమాళ్‌ తెలిపారు. మంగళవారం ప్రకటించారు. నలుగురు నిందితుల్లో ముగ్గురిని అరెస్టు చేశామని, వీరి నుంచి భారీగా ఇంజెక్షన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. బషీర్‌బాగ్‌లోని సీసీఎస్‌ కార్యాలయంలో అదనపు డీసీపీ అందె శ్రీనివాస రావుతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.

మంగళ్‌హట్‌కు చెందిన నితేష్‌ సింగ్‌ ఆసిఫ్‌నగర్‌లో పల్స్‌ ఫిట్‌నెస్‌ సెంటర్‌ పేరుతో జిమ్‌ నిర్వహిస్తున్నాడు. ఇందులో టప్పాచబుత్రకు చెందిన సయ్యద్‌ జఫ్ఫార్‌ అలీ రిసెప్షనిస్ట్‌గా రాహుల్‌ సింగ్‌ జిమ్‌ ట్రైనర్‌గా పని చేస్తున్నారు. తేలిగ్గా డబ్బు సంపాదించడం కోసం వీరు ముగ్గురు స్టెరాయిడ్స్‌ను జిమ్‌కు వచ్చే యువతకు సరఫరా చేయాలని పథకం వేశారు. ఇండియా మార్ట్‌ యాప్‌ ద్వారా ముంబైకి చెందిన కండివలీ కునాల్‌ నుంచి మెఫెంటర్మైన్‌ సల్ఫేట్‌ ఇంజెక్షన్లు ఖరీదు చేస్తున్నాడు. ఒక్కో ఇంజెక్షన్‌కు రూ.500 వసూలు చేస్తున్న అతడు కొరియర్‌ ద్వారా పంపిస్తున్నాడు. తమ జిమ్‌కు వస్తున్న యువత నిర్ణీత బరువు కంటే ఎక్కువ వెయిట్స్‌ ఎత్తడానికి, ఎక్కువ సమయం వ్యాయామం చేయడానికి స్టెరాయిడ్‌గా వాడటానికి వీటికి విక్రయిస్తున్నారు.

ఒక్కో ఇంజెక్షన్‌ రూ.2000 వరకు అమ్ముతున్నారు. నిబంధనల ప్రకారం వీటిని కేవలం మెడికల్‌ షాపులు, వైద్యుడి చీటీ ఆధారంగానే విక్రయించాలి. అయితే వీరు ముగ్గురూ వీటిని అక్రమంగా సేకరించి తమ జిమ్‌లో అమ్ముతున్నట్లు సమాచారం అందడంతో దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ షేక్‌ జకీర్‌ హుస్సేన్‌ నేతృత్వంలో ఎస్సైలు ఎన్‌.నవీన్‌, జి.ఆంజనేయులు, కె.నర్సింహులుతో కూడిన బృందం దాడి చేసింది. నిందితులను అదుపులోకి తీసుకుని వీరి నుంచి 75 ఇంజెక్షన్లు, సెల్‌ఫోన్లు, సిరంజ్‌లు స్వాధీనం చేసుకుంది. నిందితులతో పాటు స్వాధీనం చేసుకున్న సరుకునూ తదుపరి చర్యల నిమిత్తం డ్రగ్‌ కంట్రోల్‌ అడ్మినిస్ట్రేషన్‌ (డీసీఏ) అధికారులకు అప్పగించారు. పరారీలో ఉన్న ముంబై వాసి కునాల్‌ కోసం గాలిస్తున్నారు.

ఇలాంటి ఇంజెక్షన్లు, టాబ్లెట్స్‌ను స్టెరాయిడ్‌గా వాడటం వల్ల అనేక దుష్ఫరిణామాలు ఉంటాయని డీసీపీ రష్మి హెచ్చరిస్తున్నారు. దీనిని వైద్యుల చీటీ లేనిదే అమ్మడం అక్రమమని స్పష్టం చేస్తున్నారు. వీటిని సుదీర్ఘకాలం వాడితే రక్తపోటు, గుండె సమస్యలతో పాటు మానసిక ఇబ్బందులు వస్తాయని తెలిపారు. వీటి విక్రయంపై ఎలాంటి సమాచారం ఉన్నా తమకు అందించాలని ఆమె కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement