ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య
సైదాబాద్: ప్రేమ విఫలమై ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి..ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, కర్నేల్‌గంజ్‌కు చెందిన మహ్మద్ సాదాబ్, మహ్మద్ దిల్‌షాద్ (21) సోదరులు నగరానికి వలస వచ్చి సైదాబాద్ రెడ్డిబస్తీలో ఉంటూ టైలరింగ్ పని చేస్తున్నారు. దిల్‌షాద్ యూపీలోని తమ గ్రామానికి చెందిన యువతిని ప్రేమిస్తున్నాడు. ఇద్దరూ తరచూ ఫోన్‌లో మాట్లాడుకునే వారు. అయితే కొన్ని రోజులుగా వారు ఫోన్‌లో గొడవ పడుతున్నారు. మంగళవారం రాత్రి సాదాబ్ ఇంటికి తిరిగి వచ్చేసరికి దిల్‌షాద్ ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించాడు. అతడి సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దిల్‌షాద్ మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. ప్రేమ విఫలమై తన సోదరుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని సాదాబ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైదాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
యువకుడి దారుణ హత్య
చాంద్రాయణగుట్ట: క్షణికావేశంలో ముగ్గురు స్నేహితులు ఓ యువకుడిని కత్తులతో పొడిచి హత్య చేసిన సంఘటన గురువారం బండ్లగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బండ్లగూడ, ఇందిరానగర్ ప్రాంతానికి చెందిన షేక్ షాబాజ్ (23) డీసీఎం డ్రైవర్, లేబర్‌గా పని చేసేవాడు. అదే ప్రాంతానికి చెందిన ఆజం, ఆయూబ్, అమీర్ అతడి స్నేహితులు. వీరు నలుగురు ఇందిరానగర్‌లోని శ్మశాన వాటికలో కూర్చుని మద్యం తాగేవారు. గురువారం మధ్యాహ్నం మద్యం సేవిస్తుండగా ఆజం, షాబాజ్‌ల మధ్య గొడవ జరిగింది. దీంతో షాజాబ్ ఆజమ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ విషయాన్ని ఆజమ్ తన స్నేహితులు ఆయూబ్, అమీర్‌లకు చెప్పాడు. వీరు ముగ్గురు కలిసి మరోసారి మద్యం తాగి ఇందిరానగర్ శ్మశాన వాటిక నుంచి వెళుతుండగా చిన్న సందులో నుంచి షాబాజ్ వస్తూ కనిపించడంతో ఆజం తన వద్ద ఉన్న కత్తితో షాబాజ్‌పై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన షాబాజ్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ కాంతిలాల్ పాటిల్, చాంద్రాయణగుట్ట ఏసీపీ కె.మనోజ్ కుమార్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బండ్లగూడ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఎలక్ట్రిక్ బైకులు దగ్ధం
మణికొండ: షాపు ఎదుట నిలిపిన ఎలక్ట్రిక్ బైక్‌లు దగ్ధమైన సంఘటన మణికొండ మున్సిపాలిటీ అలకాపూర్ టౌన్‌షిప్‌లో గురువారం తెల్లవారు జామున చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. అలకాపూర్ రోడ్డు నెంబర్ 23లో డామినోస్ పిజ్జా షాప్ కొనసాగుతుంది. అందులో నుంచి పిజ్జాలు సరఫరా చేసే స్కూటీలను బుధవారం రాత్రి ఎప్పటి లాగే షాప్ ఎదుట పార్క్ చేశారు. గురువారం తెల్లవారు జామున ఓ బైక్‌కు నిప్పంటుకోవడంతో పక్కనే ఉన్న మరో నాలుగు వాహనాలకు వ్యాపించాయి. దీనిని గుర్తించిన స్థానికులు అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. వారు సంఘటనా స్థలానికి చేరుకునేలోపే అవి కాలి బూడిదయ్యాయి.
ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య
Comments
Please login to add a commentAdd a comment