తుంగభద్ర నదిలో గల్లంతైన వైద్యురాలి మృతి
సుభాష్‌నగర్: విహార యాత్రకు వెళ్లి తుంగభద్ర నదిలో గల్లంతైన నగర వైద్యురాలు మైనంపల్లి అనన్యరావు(27) మృతి చెందింది. గురువారం అక్కడి యంత్రాంగం మృతదేహాన్ని వెలికి తీసింది. దూలపల్లిలోని అశోక ఎలా మైసన్–2కు చెందిన డాక్టర్ మోహన్‌రావు, రజిత దంపతుల కుమార్తె అనన్య రావు గుండ్లపోచంపల్లిలోని వీకేసీ ఆసుపత్రిలో వైద్యురాలిగా పనిచేస్తోంది. తన స్నేహితులు సాత్విన్, హషితలతో కలిసి కర్నాటకలోని హంపీకి విహార యాత్రకు వెళ్లింది. ఈ నెల 19న సుమారు 25 అడుగుల ఎత్తుగల బండరాయి నుంచి తుంగభద్ర నదిలో ఈత కొట్టాలనుకుంది. నదికి మరోవైపు నుంచి స్నేహితులు సరదాగా వీడియో తీస్తున్నారు. అంతెత్తు నుంచి దూకిన అనన్య కొన్ని క్షణాల పాటు ఈత కొట్టి నీటి ఉధృతికి కొట్టుకుపోయింది. వెంటనే స్నేహితులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో బుధవారం రాత్రి వరకు గాలించారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులతో కలిసి మాజీ ఎమ్మెల్యే హన్మంతరావు అక్కడకి చేరుకున్నారు. మరునాడు గురువారం సాయంత్రం మృతదేహం లభ్యమైంది. కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. అధికారులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. శుక్రవారం పోస్ట్‌మార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని నగరానికి తీసుకురానున్నారు.
పోస్టుమార్టం అనంతరం నేడు నగరానికి మృతదేహం
Comments
Please login to add a commentAdd a comment