సాక్షి, సిటీబ్యూరో: పీఎం కిసాన్ దరఖాస్తు పేరుతో సైబర్ నేరగాళ్లు పంపిన ఆండ్రాయిడ్ ప్యాకేజ్ కిట్ (ఏపీకే) ఫైల్‌ను ఇన్‌స్టాల్ చేసుకున్న బాలానగర్ వాసి రూ.1.97 లక్షలు కోల్పోయాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బాలానగర్‌లోని గీతానగర్‌కు చెందిన మల్లికార్జున్ ప్రైవేట్ ఉద్యోగి. తన స్వగ్రామానికి చెందిన వారితో కూడిన వాట్సాప్ గ్రూపులో సభ్యుడిగా ఉన్నారు. ఇటీవల ఆ గ్రూపులో పీఎం కిసాన్ పథకం దరఖాస్తు పేరుతో ఓ లింక్ వచ్చింది. దానిని క్లిక్ చేయడంతో ఓ ఏపీకే ఫైల్ మల్లికార్జున్ ఫోన్‌లో ఇన్‌స్టాల్ అయింది. సైబర్ నేరగాళ్లు ఈ ఫైల్స్‌లో మాల్‌వేర్‌ను నిక్షిప్తం చేసి పంపిస్తారు. ఇది ఒకసారి ఇన్‌స్టాల్ అయిన తర్వాత ఫోన్ మొత్తం నేరగాళ్ల ఆధీనంలోకి వెళ్లిపోతుంది. ఫోన్ ద్వారా జరిగే లావాదేవీలతో పాటు వచ్చే ఎస్సెమ్మెస్‌లు సైతం వారికి చేరిపోతుంటాయి. మల్లికార్జున్ ఫోన్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్న సైబర్ నేరగాళ్లు దాని ద్వారా ఆర్థిక లావాదేవీలు చేస్తూ, ఓటీపీలను వినియోగించి రూ.1.97 లక్షలు కాజేశారు. ఎట్టకేలకు జరిగిన మోసాన్ని గుర్తించిన బాధితుడు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. దీన్ని అధికారులు సాంకేతికంగా దర్యాప్తు చేస్తున్నారు. గత ఏడాది రాష్ట్రంలో నాలుగు వేలకు పైగా ఏపీకే ఫ్రాడ్స్‌కు సంబంధించిన కేసులు నమోదయ్యాయి. ఈ ఫైల్స్‌ను సైబర్ నేరగాళ్లు లింకులు, సందేశాలు సహా వివిధ రూపాల్లో పంపిస్తారని, వీటిపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు కోరుతున్నారు.
● తెలియక డౌన్‌లోడ్ చేసుకున్న బాధితుడు
● రూ.1.97 లక్షలు స్వాహా చేసిన నేరగాళ్లు
Comments
Please login to add a commentAdd a comment