
మంటగలుస్తున్న మానవత్వం.. పెరుగుతున్న హింసా ప్రవృత్తి
మద్యం, మాదక ద్రవ్యాలకు బానిసలై అఘాయిత్యాలు
డబ్బుపై వ్యామోహం, వివాహేతర సంబంధాలూ కారణమే
ఇటీవల నగరంలో అత్యంత పాశవికంగా హత్యలు
తన ప్రేమ వివాహం చెడిపోవడానికి కారణమయ్యాడని కన్నతండ్రినే నడిరోడ్డుపై దారుణంగా హత్య చేశాడు కన్న కొడుకు. బుద్ధి చెప్పాల్సిన తండ్రే వ్యసనాలకు బానిస కావడంతో అతనిపై కోపం పెంచుకున్నాడు కొడుకు సాయికుమార్. ఎలాగైనా తండ్రి మొగిలిని అంతమొందించాలని నిర్ణయించుకొని.. నడిరోడ్డుపై చుట్టూ జనం చూస్తుండగానే కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి చంపేశాడు.
అకారణంగా భార్య వెంకట మాధవితో గొడవ పెట్టుకొని, ఆమె గొంతు నులిమి చంపేశాడు భర్త గురుమూర్తి. ఇల్లాలి కాళ్లు, చేతులు, శరీరం, తల నాలుగు భాగాలుగా నరికి, వాటర్ హీటర్‌తో నీళ్లు మరిగించి శరీర భాగాలను ఉడకబెట్టాడు. ఆ తర్వాత వాటిని స్టవ్‌పై కాల్చి, రోకలి బండతో దంచి పోడి చేశాడు. ఆ పొడిని బ్లాస్టిక్ బకెట్‌లో తీసుకెళ్లి జిల్లెలగూడ చెరువులో పారబోశాడు.
తనను కాదని కంపెనీలో డైరెక్టర్‌గా మరొకర్ని నియమించారని, ఆస్తిలో వాటా ఇవ్వలేదని తాత మీద కక్ష పెంచుకున్నాడు మనవడు. చంద్రశేఖర జనార్దన్ రావు ఇంట్లోకి చొరబడిన కూతురు కొడుకు కార్తి తేజ.. వెంట తెచ్చుకున్న కత్తితో తాతను విచక్షణారహితంగా పొడిచి చంపేశాడు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన తల్లి సరోజపైనా దాడికి తెగబడ్డాడు.
భార్యను, పిల్లలను వేధిస్తున్న అన్నను అంతమొందించారు తమ్ముళ్లు. ఎప్పటిలాగే మద్యం మత్తులో ఉమేష్.. భార్య ప్రియాంక, తమ్ముడు రాకేష్, చిన్నాన్న కొడుకు లక్ష్మణ్‌లతో గొడవ పడ్డాడు. బీరు సీసాతో దాడి చేశాడు. వారు ప్రతిఘటించడంతో ఇంట్లో నుంచి వీధిలోకి పరుగెత్తుకుంటూ జాతీయ రహదారిపైకి చేరుకున్నాడు. అయినా రాకేష్, లక్ష్మణ్‌లు వదిలిపెట్టకుండా అన్న ఉమేష్‌ను వెంబడించి కత్తులతో 15 సార్లు పొడిచి చంపేశారు.
ఇలా.. రక్త సంబంధాల్లో నెత్తుటి చారికలు పారుతున్నాయి. ఎలాంటి బంధాలనూ లెక్కచేయడం లేదు. చెడు వ్యసనాలు, డబ్బు మీద వ్యామోహం, వివాహేతర సంబంధాల కారణంగా బంధుత్వాలు మరిచి పాశవికంగా ప్రవర్తిస్తున్నారు. ఈ దారుణ ఉదంతాలు ఏ మారుమూల గ్రామాల్లోనో, గిరిజన ప్రాంతాల్లో జరిగినవి కాదు.. విశ్వనగరంగా ప్రపంచంతో పోటీపడుతున్న హైదరాబాద్‌లో ఇటీవల చోటుచేసుకున్నాయి. విద్యావంతులు, రిటైర్డ్ ఉద్యోగస్తులూ ఇలాంటి కిరాతకాలకు పాల్పడుతుండటం శోచనీయం.
ఓటీటీలో బోలెడంత కంటెంట్..
హత్యలు ఎలా చేయాలి, చేశాక పోలీసులకు ఆధారాలు దొరక్కుండా ఎలా తప్పించుకోవాలి? ఈజీగా మనీ సంపాదించే అక్రమ మార్గాలేంటి? అనే అంశాలు పూసగుచ్చినట్లు బోలెడంత కంటెంట్ ఓటీటీ, యూట్యూబ్‌లో అందుబాటులో ఉంది. ఓటీటీ కంటెంట్ కారణంగా సమాజంలో నేరాలు, లైంగిక హింస పెరుగుతున్నాయని ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఇండియన్ సైకాలజీ ఓ రిపోర్ట్‌ను విడుదల చేసింది. ఓటీటీకి అలవాటు పడ్డవారి ప్రవర్తనలో విపరీతమైన మార్పులు కలుగుతున్నట్లు, ముఖ్యంగా టీనేజర్లలో ఒంటరితనం, హింసా ప్రవృత్తి పెరుగుతున్నట్టు తేల్చింది. ఓటీటీకి కేటాయించే సమయాన్ని క్రమంగా తగ్గిస్తూ.. సాహిత్యం, సంగీత, ఇతర కళలు, అభిరుచుల వైపు దృష్టిసారిస్తేనే ఈ విపత్తు నుంచి బయటపడవచ్చనిసూచించింది.
అసాంఘిక ఊబిలోకి..
మద్యం, మాదక ద్రవ్యాలు విచ్చలవిడిగా అందుబాటులోకి వచ్చాయి. నగదు అవసరాలు పెరిగాయి. వీటి కోసం పర తమ భేద భావాలను మర్చిపోతున్నారు. అయినోళ్లనే అత్యంత కిరాతకంగా హతమారుస్తున్నారు. తల్లీదండ్రులు, అన్నా చెళ్లెళ్లు, భార్యభర్తలు వావి వరసలు పట్టించుకోవడం లేదు. అవసరాల కోసం, క్షణిక సుఖాల కోసం నిర్దాక్షిణ్యంగా చంపేస్తున్నారు. అందుబాటులోకి వచ్చిన అశ్లీలత, విశృంఖలత్వం, మనుషుల భావాలను తీవ్రంగా దిగజారుస్తున్నాయి. వారిని అసాంఘిక ఊబిలోకి లాగుతున్నాయి.
సంస్కృతి, సంప్రదాయాల్ని పక్కనపెట్టేలా చేస్తున్నాయి. ఈ దుస్థితిని సమాజం నుంచి పారదోలేందుకు చిన్ననాటి పాఠ్యాంశాల నుంచి కూడా మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉందని సామాజిక, మానసిక విశ్లేషకులు చెబుతున్నారు. నైతిక విలువలకు ప్రత్యేకంగా క్లాసులు తీసుకోవాలి. ఉన్నత, తరగతుల ఉపాధ్యాయులు సమకాలిన రాజకీయ, ఆర్థిక, చారిత్రక అంశాలకు, భారతీయ సంస్కృతి, విలువల్ని కూడా జోడించి విద్యార్థులకు బోధించాలి. చట్టాలు, న్యాయ వ్యవస్థ మానసిక శాస్త్ర ఆలోచల్ని అందుబాటులో ఉంచాలి.
గతేడాది గ్రేటర్‌లో హత్యల గణాంకాలివీ:
హైదరాబాద్77
సైబరాబాద్ 121
రాచకొండ 73
విలువలు కునారిల్లడం వల్లే..
చిన్నతనం నుంచే డ్రగ్సకు బానిసలవుతున్నారు. దీంతో సమాజం, కుటుంబం అంటే గౌరవం ఉండట్లే. ఆస్తులు, డబ్బే లక్ష్యంగా ఎంతటి దారుణాలకై నా ఒడిగడుతున్నారు. నేరాలు, హింస, హత్యలు, వివాహేతర సంబంధాల వంటి వాటికి ఇంతకాలం మగవారు ఎక్కువగా పాల్పడేవారు. ఇటీవల కాలంలో మహిళలు కూడా ఇందులో భాగస్వామ్యమవుతున్నారు.
–డాక్టర్ పద్మా కమలాకర్, మానసిక వైద్యురాలు, ఫ్యామిలీ రిలేషిన్‌షిప్ కౌన్సిలర్
తప్పు చేసి తప్పించుకోలేరు
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉన్న ఈ రోజుల్లో నేరం చేసి తప్పించుకోలేరు. వ్యామోహంలో, క్షణికావేశంలో చేసిన తప్పు తెలుసుకునేసరికి పరిస్థితి ఘోరంగా ఉంటుంది. కుటుంబ సభ్యులు జైలుకు వచ్చి పలకరించే పరిస్థితి కూడా ఉండదు. కన్నబిడ్డలు అసలు దగ్గరకు కూడా రానివ్వరు. ఇలా అందరూ ఉన్న ఒంటరిగా నాలుగు గోడల మధ్య జైలు జీవితం గడపాల్సిందే.
–సుధీర్ బాబు, రాచకొండ సీపీ
Comments
Please login to add a commentAdd a comment