పని ప్రదేశాల్లో లింగ సమానత్వం సాధించాలి
సాక్షి, సిటీబ్యూరో: పనిచేసే చోట లింగ సమానత్వం సాధించాల్సిన అవసరం ఉందని సీఐఐ తెలంగాణ చైర్మన్ సాయి డి ప్రసాద్ అన్నారు. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం(టీడీఎఫ్), సీఐఐ తెలంగాణ ఎడ్యుకేషన్ అండ్ యూత్ ఎంపవర్‌మెంట్ సంయుక్తంగా ’ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ధి’ అనే అంశంపై ఆదివారం హైదరాబాద్‌లో సదస్సు నిర్వహించాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంఎస్‌ఎంఈ పాలసీకి సిఫార్సులను రూపొందించడంలో ఇండియన్ ఉమెన్ నెట్ వర్క్ తెలంగాణ చేస్తున్న కృషిని కొనియాడారు. ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ వ్యవస్థాపకుడు డాక్టర్ జయప్రకాష్ నారాయణ్ మాట్లాడుతూ విద్యా నాణ్యతను మెరుగుపరిచేందుకు మద్దతు ఇవ్వడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారని తెలిపారు. మన విద్యార్థులు అసాధారణంగా రాణించేందుకు విద్యా వ్యవస్థలో భారీ మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు, సమాచారం సమకూర్చాలని కోరారు. విద్యలో నాణ్యత పెంపొందించడానికి విశ్వవిద్యాలయాల పరిపాలనను మెరుగుపరచడం, అవసరమైన నిధులను సమకూర్చడం, కొత్త బోధనా పద్ధతులను ప్రవేశపెట్టడం అవసరమని అన్నారు. కార్యక్రమంలో సీఐఐ సదరన్ రీజియన్ మాజీ చైర్మన్ అనిల్ కుమార్, తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ట్రస్టీ, మాజీ చైర్మన్ జి.గోపాల్ రెడ్డి, కావేరి విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ వి.ప్రవీణ్ రావు, మారుతి సుజుకి లిమిటెడ్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు సి.వి.రామన్, సీఐఐ తెలంగాణ వైస్ చైర్మన్ ఆర్‌ఎస్ రెడ్డి, 200 మందికిపైగా పరిశ్రమ నిపుణులు, విద్యావేత్తలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment