
హెచ్‌సీయూలో కుప్పకూలిన పోర్టికో
స్లాబ్ వేస్తుండగా ఘటన
గచ్చిబౌలి: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నూతన పరిపాలన భవనం పోర్టికో స్లాబ్ వేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలింది. శిఽథిలాల కింద పడటంతో 9 మంది కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం బాధితులను ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వివరాలు ఇలా ఉన్నాయి.. రూ.50 కోట్ల వ్యయంతో హెచ్‌సీయూలో నాలుగంతస్తుల నూతన పరిపాలనా భవనం నిర్మాణం చేపడుతున్నారు. సీపీడబ్ల్యూ కాంట్రాక్టర్ 20 అడుగుల ఎత్తులో పోర్టికో కోసం గురువారం రాత్రి 8 గంటల సమయంలో స్లాబ్ వేస్తుండగా అది ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో స్లాబ్‌పైన ఉన్న కార్మికులు నేలనూ పడిపోయారు. ఈ ప్రమాదంలో జలంధర్, భగవాన్, సంజయ్, కరణ్, ఈశ్వర్, దీనా, యూనుస్, మాధవ్, మనోజ్ తీవ్రంగా గాయపడ్డారు. వీరిని గచ్చిబౌలి పోలీసులు నల్లగండ్లలోని సిటిజన్ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులెవరికీ ప్రాణాపాయం లేదని గచ్చిబౌలి ఇన్‌స్పెక్టర్ హబీబుల్లాఖాన్ తెలిపారు.
నాణ్యతా లోపంతోనే..
పోర్టికో కూలిన విషయం తెలిసిన వెంటనే హెచ్‌సీయూ సెక్యూరిటీ విభాగం, అధికారులు, విద్యార్థులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొన్నారు. అంబులెన్సులు, ఫైరింజిన్‌కు సమాచారం ఇచ్చారు. నాణ్యతా లోపంతోనే భవనం పోర్టికో కుప్పకూలిందని హెచ్‌సీయూ విద్యార్థులు ఆరోపిస్తున్నారు. క్యాంపస్‌లోకి ఎవరినీ అనుమతించకపోవడంతోనే ఇష్టానుసారంగా నిర్మాణాలు చేస్తున్నారని ఆరోపించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
లోనికి అనుమతి నిరాకరణ..
హెచ్‌సీయూ క్యాంపస్‌లో పోర్టికో కుప్పకూలిన ఘటన చోటు చేసుకోవడంతో లోపలికి ఎవరినీ సెక్యూరిటీ వెళ్లకుండా అడ్డుకున్నారు. విద్యార్థులు, టీచింగ్, నాన్‌టీచింగ్ అధికారులు, ఉద్యోగులు, సిబ్బందిని తప్ప బయటివారిని కొన్నేళ్లుగా లోనికి అనుమతించడం లేదు. దీంతో అంతటా ఆందోళన వ్యక్తమవుతోంది.
9 మందికి గాయాలు
తప్పిన పెను ప్రమాదం